తేలిపోయిన టీ బీజేపీ చేరికల హైప్ ! ఎవరూ కండువా కప్పించుకోరేంటి ?

By KTV Telugu On 4 May, 2022
image

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత పాదయాత్రలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని బీజేపీ నేతలు ఉదరగొట్టారు. బండి సంజయ్ పాదయాత్ర చివరికి వచ్చింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే సాగుతోంది. అయితే ఇంత వరకూ ఒక్కరంటే ఒక్కరు పార్టీలో చేరలేదు. ఎక్కడిక్కకడ ఓ మాదిరి గుర్తింపు ఉన్న నేతలను అయినా పార్టీలో చేర్చుకుందామని ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదు. కొంత మందితో జరిపిన చర్చలు టిక్కెట్ ఇస్తారా లేదా అన్న దగ్గర ఆగిపోతున్నాయి. దీంతో ఈ సారి ఒక్క నేత కూడా పార్టీలో చేరడం లేదని తేలిపోయింది.

జూపల్లి కూడా ఆగిపోయారా !?

మాజీ మంత్రి.. టీఆర్ఎస్ కీలక నేత జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారన్న ప్రచారం జరిగింది. ఆయనతో బీజేపీ నేతలు చర్చలు జరిపారు. జూపల్లి కృష్ణారావు టిక్కెట్ కోసం హామీ పొందే స్థాయి నేత కాదు. అంత కంటే పెద్ద నేతనే. ప్రస్తుతం బీజేపీలోనే ఉన్న మాజీ మంత్రి డీకే అరుణకు.. జూపల్లి కృష్ణారావుకు సరిపడదు. అందుకే తాను పార్టీలో చేరితే తన ప్రాధాన్యం తనకు ఉండేలా ఆయన హామీ కోరుతున్నారు. ఆయనకు హామీ ఇస్తే డీకే అరుణను నిర్లక్ష్యం చేసినట్లవుతుంది. అందుకే ఏటూ తేల్చుకోలేకపోతున్నారు. ఫలితంగా ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారని అంటున్నారు. ఆయన బేసిక్‌గా కాంగ్రెస్ పార్టీ నేతనే. డీకే అరుణతో సరిపడకనే పార్టీ మారారు.

ముహుర్తాల పేరుతో ఇతర నేతలూ ఆగిపోయారు !

మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు చల్లా వెంకట్రామిరెడ్డి పార్టీలో చేరుతానని చెప్పి చర్చలు జరిపారు. కానీ ఇప్పుడు ఆగిపోయారు. తెలంగాణలో బీజేపీకి మంచి హైప్ వచ్చిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే క్యాడర్ పరంగా.., పార్టీ నిర్మాణ పరంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆ పార్టీలో ఉత్తేజం పెరిగింది. కేసీఆర్‌కు ధీటైన నాయకుడు రేవంత్ అన్న ప్రచారం ప్రారంభం కావడంతో.. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో బీజేపీలో చేరాలనుకున్న నేతలు ఊగిసలాడుతున్నట్లుగా చెబుతున్నారు. దీంతో తెలంగాణ బీజేపీ నేతల ప్రయత్నాలు ఎక్కడివక్కడ ఆగిపోతున్నాయి. కానీ తెలంగాణలో భవిష్యత్ బీజేపీదేనని ఆ పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అదే చెబుతున్నారు. అయితే పార్టీలో చేరాలనుకునేవారికి నమ్మకం కుదరడం లేదు. ఎవరైనా చేరడానికి వస్తే వారు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు.

అమిత్ సభలో ఎవర్నీ చేర్చుకోకపోతే పరువు పోదా !?

పద్నాలుగో తేదీ వరకూ రెండో విడత పాదయాత్ర సాగనుంది. ఆ లోపు అయినా చర్చలు పూర్తి చేసి .. ముగింపు సభకు అమిత్ షాను ఆహ్వానించి కండువాలు కప్పాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఒక వేళ ఎవరూ చేరకపోతే.., బీజేపీలో చేరడానికి ఎవరూ సిద్ధంగా లేరన్న అభిప్రాయం బలపడుతుంది. అందుకే బీజేపీ అగ్రనేతలు కూడా చేరికలపై విస్తృతంగా మంతనాలు జరుపుతున్నారు. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి సానుకూల సంకేతాలు ఎవరి వద్దా రాలేదు. టీఆర్ఎస్‌పై అసంతృప్తితో.. ఆ పార్టీలో ప్రాధాన్యం దక్కని వారు చాలా మందే ఉన్నారు. కానీ వారినీ బీజేపీ నేతలు ఆకట్టుకోలేకపోతున్నారు.

బెంగాల్‌లో బీజేపీ తృణమూల్‌కు గట్టిపోటీ ఇవ్వగలిగింది అంటే దానికి కారణం చేరికలే. తెలంగాణలో ఆ మూమెంట్ కనిపించడం లేదు. తీసుకు రావడానికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత సక్సెస్ అయితే.. బీజేపీకి అంత హైప్ వస్తుంది. లేకపోతే లేదు.