ఎవరి వాదన వారిదే.. వాట్ నెక్ట్స్?

By KTV Telugu On 29 November, 2022
image

వైసీపీ స్టెప్ ఏవిధంగా ఉండబోతోంది?
సుప్రీం తాజా ఉత్తర్వులపై జోష్‌..
3రాజధానులపై స్పీడప్

సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. ఇంకా కీలక విషయాలపై వాదనలు మిగిలే ఉన్నాయి. అంతిమ తీర్పు వెలువడితేనే అసలు లెక్క. అయినప్పటికీ ఎవరికి వారు వక్రభాష్యాలు చేసుకుంటున్నారు. అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం కోరినట్టుగా సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు మొగ్గుచూపలేదు. కానీ హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆరు నెలల్లోగా నిర్మాణాలన్నీ పూర్తిచేయాలంటూ గతంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలపై మాత్రం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు చీఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లా, కార్వనిర్వాహక వ్యవస్ధలా వ్యహరించిందన్న వ్యాఖ్యలు కూడా చేసింది. అలాగే మూడు రాజధానుల చట్టాల్ని ప్రభుత్వం అసెంబ్లీలో ఉపసంహరించుకున్న తర్వాత హైకోర్టు ఇలాంటి ఆదేశాలు ఎలా ఇచ్చిందంటూ అభ్యంతరం తెలిపింది. తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది. అయితే మూడు రాజధానుల ఏర్పాటుకు న్యాయపరమైన చిక్కులు, ఇబ్బందులు తొలగిపోతున్నట్టుగా అధికార పార్టీ భావిస్తోంది.

అధికార వికేంద్రీకరణకు అవసరమైన చర్యలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మూడు రాజధానులకు అవసరమైన కొత్త బిల్లు రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది . ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం మాత్రమే ఉన్నందున, ఎంతమాత్రం జాప్యం చేయకూడదనే ఆలోచనతో ప్రభుత్వం కనిపిస్తోంది. వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తారంటూ మంత్రులు చెబుతున్నారు. ఉగాది నాటికి సచివాలయం విశాఖపట్నానికి తరలి వెళ్తుందనే సంకేతాలు ఇస్తున్నారు. అదేసమయంలో న్యాయ రాజధానిని బదలాయించే ప్రక్రియ కూడా ఊపందుకోనుందంటున్నారు. అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించడానికి నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 5న ఈ సభను నిర్వహించనున్నట్లు తెలిపింది. విశాఖను మించేలా రాయలసీమ ప్రాంతానికి చెందిన అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించాలని భావిస్తోంది. లక్షమంది వరకు ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తోంది.

అయితే న్యాయరాజధాని తరలింపు అంత ఈజీ కాదనే వాదన వినిపిస్తోంది. అమరావతిలోనే హైకోర్టు కొనసాగింపు ఉంటుందా లేదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించగా ప్రస్తుతానికి హైకోర్టు అమరావతిలోనే కొనసాగుతోందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు బదులిచ్చారు. భవిష్యత్తులో అసెంబ్లీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేమని తేల్చిచెప్పేశారు. అయితే ఇదే ప్రశ్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదే పదే వేయగా రాష్ట్రపతి ఉత్తర్వుల కారణంగా ప్రస్తుతానికి హైకోర్టును న్యాయరాజధానికి తరలించే పరిస్దితి లేదని లాయర్లు తెలిపారు. దీంతో ఈ వ్యవహారంలో ఇంతకుమించి సుప్రీంకోర్టు స్పందించడానికి కూడా ఏమీ లేకుండా పోయింది. రాజధాని విషయంలో సుప్రీంకోర్టు అసలు వాస్తవ విచారణలోకి వెళ్లనేలేదు. కొన్ని అంశాలపై మాత్రమే స్పందించింది. కీలక విషయాలపై వాదనలు కూడా వినలేదు. అది జరిగితే గానీ వాస్తవ ఉత్తర్వులు వెలువడే అవకాశం లేదు. అయినప్పటికీ ఈలోగా తాము చేయాల్సింది తాము చేస్తామనే ధోరణితో అధికార పార్టీ ముందుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.