ఏముంది రహస్యం.. తలపండిన నేత జోస్యం!
ఒక్క ఛాన్స్ ప్లీజ్. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి స్లోగన్. సుదీర్ఘపాదయాత్రకు తోడు ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్న ఆయన విన్నపాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన్నించారు. తిరుగులేని మెజారిటీతో అందలం ఎక్కించారు. మార్పుకోసం అంటూ వచ్చిన పవన్‌కల్యాణ్‌కి చేదు ఫలితాలు మిగిల్చారు. పోటీచేసిన రెండుస్థానాల్లో జనసేనాని ఓడిపోయారు. రాజోలులో గ్లాసు పార్టీ గెల్చినా ఎప్పుడో అది జనసేన ఖాతాలోంచి జారిపోయింది.
ఈసారి ఎలాగైనా గెలవాలి గెలిచితీరాలి. మోడీ నుంచి భరోసా దొరికింది. టీడీపీనుంచి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు లభిస్తుంది. అందుకే వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పవన్‌కల్యాణ్. ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ కొత్త పల్లవి అందుకున్నారు. కాపులంతా తోడుంటే వంగవీటి రంగాని కాపాడుకుని ఉండేవాళ్లమంటూ ఆమధ్య కులం సెంటిమెంట్‌ని రాజేశారు. కానీ కాపులంతా ఆయనవైపు మళ్లే అవకాశాలైతే కనిపించడంలేదు. అయితే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. ఆ కోయిల శకునంపైనే అందరికీ అనుమానాలున్నాయి.
చేగొండి హరిరామజోగయ్యకి పరిచయం అక్కర్లేదు. కాపులకు పెద్దదిక్కుని తానేనని చెప్పుకుంటారు. కాపు సంక్షేమ సేనకు ఆయనే వ్యవస్థాపకుడు. పవన్‌కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారంటూ చేగొండి జోస్యం చెబుతుంటే జనసైనికులే చంకలు గుద్దుకోవడం లేదు. చిరంజీవిలా అందరివాడుగా ఉంటేనే పవన్‌కల్యాణ్‌కి రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఓ వర్గం నేతగా ముద్రపడితే నష్టం జరుగుతుంది. ఇప్పుడు చేగొండిలాంటి నాయకుల స్టేట్‌మెంట్లతో జనసేనకి కాపుల పార్టీ అనే ముద్ర ఇంకా బలంగా పడుతుంది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టగానే అందులో చేరి తర్వాత ఆయన్నే టార్గెట్ చేసుకున్న చరిత్ర హరిరామజోగయ్యది. అలాంటి ఆయన పవన్‌కల్యాణ్ ఎప్పటికైనా సీఎం అవుతారంటుంటే జనసైనికులు ఆనందపడాలా? ఆందోళనపడాలా?