కశ్మీర్‌ఫైల్స్‌లో నచ్చడానికి ఏమీ లేదా!

By KTV Telugu On 30 November, 2022
image

కోట్లు కొల్లగొట్టిన కశ్మీర్‌ఫైల్స్‌ని తేల్చేశాడు!
ప్రశంసలే కాదు విమర్శలూ వస్తాయ్‌..టేకిటీజీ!

ఎంతోమందికి నచ్చింది కొందరికి నచ్చకపోవచ్చు. యూనివర్సల్‌గా అందరి అభిప్రాయం ఒకేలా ఉండదు. థియేటర్లలో భావోద్వేగాలు రేకెత్తించిన ఓ సినిమా దేశమంతా సంచలన విజయం సాధించింది. వాస్తవాల ఆధారంగా నిర్మించిన ఆ సినిమా అందరి కళ్లూ చెమర్చేలా చేసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజైన సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. ఇండియన్‌ సినిమా హిస్టరీలో ఓ సంచలనంగా మిగిలిపోయిన ఆ సినిమా విదేశీ ప్రముఖ దర్శకుడికి మాత్రం నచ్చలేదు.

మనం మాట్లాడుకునేది కశ్మీర్‌ఫైల్స్‌ గురించి. సినిమాపరంగా సూపర్‌హిట్‌. కానీ రాజకీయ వివాదాలను రాజేసింది. ఆ సినిమా తెరకెక్కించడం వెనుక ఉన్న ఉద్దేశాలపై చర్చతో పాటు పెద్ద రచ్చే జరిగింది. చాలామందికి నచ్చింది. కొంతమంది కొన్ని కారణాలతో నచ్చలేదు. ఆ కొందరిలో గోవా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌ జ్యూరి హెడ్‌ కూడా ఉన్నారు. ఆయన ఇజ్రాయిల్‌ దర్శకుడు. గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ది కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రాన్ని ప్రదర్శించడాన్ని నడవ్‌ లాపిడ్‌ తప్పుపట్టాడు. ఈ సినిమా చూసి దిగ్భ్రాంతి చెందానంటూ ప్రచారం కోసం తీసిన అడల్ట్‌ మూవీగా ఆయన అభివర్ణించారు. ప్రతిష్ఠాత్మక సినీ మహోత్సవంలో ప్రదర్శించదగ్గ సినిమా కాదంటూ తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పారు. ది కశ్మీర్‌ పైల్స్‌ సినిమాపై ఇఫి జ్యూరీ హెడ్‌ వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.

నిజాలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి వ్యక్తులతో అబద్ధాలు చెప్పిస్తాయంటూ నడవ్‌లాపిడ్‌కి సినిమా డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి చురకలంటించారు. సినిమాలో కీలకపాత్ర పోషించిన అనుపమ్‌ ఖేర్‌ కూడా తీవ్రంగా రియాక్ట్‌ అయ్యారు. నాడు యూదులపై నరమేధం నిజమైతే కశ్మీరీ పండిట్ల ఊచకోత కూడా నిజమేనంటూ ట్విటర్‌ వేదికగా స్పందించారు. అయితే శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ మాత్రం ఇజ్రాయిల్‌ దర్శకుడి వ్యాఖ్యలను సమర్ధించారు. ది కశ్మీర్ ఫైల్స్ దురుద్దేశంతో తీసిన సినిమా అనడంలో వాస్తవం ఉందన్నారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా తర్వాతే జమ్ముకశ్మీర్‌లో హత్యలు విపరీతంగా పెరిగాయని రౌత్ నిందించారు. విషయం వివాదాస్పదం కావటంతో ఇఫి జ్యూరీ బోర్డ్‌ దీనిపై ప్రతిస్పందించింది. కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రంపై లాపిడ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయమేనని, దీనిపై జ్యూరీ బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటన విడుదల చేసింది.