సిన్మా తుస్…ఈడీ ఎంక్వయిరీ బోనస్!
ఎందుకిలా మా ఖర్మ కాలిపోయిందీ అంటూ కోరస్‌గా పాడుకోవచ్చు లైగర్ త్రిమూర్తులు. ఎవరా ముగ్గురంటే అర్జున్‌రెడ్డితో రౌడీబాయ్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, పాన్ఇండియా రేంజ్ సిన్మా తీద్దామని బొక్కబోర్లాపడ్డ పూరీ జగన్నాధ్, ఆయన రైట్‌హ్యాండ్ చార్మి. చారానా కూరకి బారానా మసాలా అన్నంత ప్రచారం చేశారు లైగర్ సిన్మాకి. దేశమంతా తిరిగి బ్రహ్మాండం బద్దలైపోతుందన్నంత బిల్డప్పిచ్చారు. తీరా సిన్మా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది. బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నష్టాల్లో కూరుకుపోయి నెత్తీనోరు బాదుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ మీద ఒంటికాలిపై లేస్తున్నారు.
లైగర్ ఫ్లాప్‌తో అప్సెట్ అయిన టీంకి గోరుచుట్టుపై రోకటిపోటులా కొత్త దెబ్బ పడింది. ఈమధ్యే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులతో పూరీ జగన్నాథ్, ఛార్మి విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఆ సిన్మాలో బాక్సర్‌గా చొక్కావిప్పి రంకెలేసిన హీరోగారి వంతొచ్చేసింది. లైగర్ భయంకర డిజాస్టర్‌గా మిగిలినా ఆ సిన్మా వదల బొమ్మాళీ వదలా అంటూ వెంటాడుతోంది.
ఈ సినిమా బడ్జెట్ విషయంలో వచ్చిన ఆరోపణలపై ఈడీ ఆరాతీస్తోంది. విదేశాల నుంచి కొందరు రాజకీయ నేతల ఖాతాలనుంచి లైగర్ కోసం డబ్బు బదిలీ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. నవంబర్ 18న పూరి జగన్నాథ్, ఛార్మిలని విచారించిన ఈడీ తాజాగా హీరో విజయ్ దేవరకొండని పిలిచింది. ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఈడీ ప్రశ్నిస్తోంది. విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్పైనా ఆరాతీసింది. లైగర్ డిజాస్టర్ తర్వాత విజయ్, ఛార్మి, పూరి మధ్య మనస్పర్థలు వచ్చాయని వార్తలు వచ్చాయి. విజయ్‌కి కమిట్ అయిన డబ్బు రాలేదన్న ప్రచారం కూడా ఉంది. దీంతో విజయ్ దేవరకొండ కూడా పూరితో చేయాల్సిన జనగణమణ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడని చెబుతున్నారు. లైగర్‌లో కల్వకుంట్ల కవిత పెట్టుబడులు పెట్టారంటూ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేయడంతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. చిత్రం లావాదేవీల విషయంలో ప్రొడ్యూసర్, డైరెక్టర్‌తో పాటు హీరోని కూడా ప్రశ్నించింది. ఈడీ ఎంక్వయిరీలో ఏమన్నా బయటపడితే లైగర్ టీంకి కొత్త కష్టాలు తప్పేలా లేవు.