పార్టీ పాలిటిక్స్.. పార్టీయింగ్ పాలిటిక్స్ వేరయా.. అర్థం చేసుకోరూ..

By KTV Telugu On 5 May, 2022
image

బాక్సింగ్ లో ఒక రూల్ ఉంది. బిలో ది బెల్ట్ అంటారు. అంటే బెల్ట్ కింద కొట్టకూడదు. అలా ఎవరైనా చేస్తే.. ఆ క్రీడాకారుడ్ని అనర్హుడిగా ప్రకటిస్తారు. ఇప్పుడురాజకీయాలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఒకరినొకరు బిలో ది బెల్ట్ అటే ఆడుతున్నారు. విమర్శలు, ప్రకటనల దాడులు, ప్రతిదాడులు, ట్వీట్లు, వీడియోలు విడుదల చేయడాలు… ఏది చూసినా సరే… బిలో ది బెల్ట్ అవుతోంది. రాహుల్ గాంధీ నేపాల్ టూర్ ను బీజేపీ ప్రొజెక్ట్ చేసిన తీరు బిలో ది బెల్టే అవుతుందనడంలో సందేహం లేదు…..

బీజేపీ విడుదల చేసిన వీడియోలో ఉన్నదీ…. నేపాల్ లో చైనా రాయబారి అని తెలుస్తోంది. తమ రాయబార్లు ఎక్కడబడితే అక్కడకు వెళితే చైనా ప్రభుత్వం ఊరుకోదని ప్రచారం చేసిన వారికి తెలియదనీ చెప్పలేం. మరో పక్క భారత్ లో సీఎన్ఎన్ విలేకరిగా పనిచేసిన సుమ్నిమా ఉదాస్ వివాహానికి హాజరైనప్పుడు రాహుల్ గాంధీ నైట్ క్లబ్ కు వెళ్లారని బీజేపీ వర్గాల వాదన. ప్రైవేటు టూర్లో తప్పులేదని అంటూనే చైనా గూఢచారితో మాట కలపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దొరికాడు కుమ్మెద్దామని తొందరపాటు మినహా.. గూఢచారులు నేతలతో ఫోటోలు, వీడియో దిగుతారా అన్న ఆలోచన కూడా వారికి రాలేదు…

బీజేపీ వారి లెక్క ప్రకారం రాహుల్ గాంధీ ఒక పప్పు. ఆయనకు ఏమీ తెలీదు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఐరెన్ లెగ్ పెట్టినట్లే. కాంగ్రెస్ పార్టీని అథోగతిపాలు చేసిన రాహుల్ గాంధీ… ఎంత ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉంటే తమకు అంత మంచిదని కమలనాథులు సంబరపడిపోతుంటారు మరి రాహుల్ ఎక్కడుంటే వాళ్లకేమిటో ఇబ్బంది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. రాహుల్ వ్యక్తిగత పర్యటనకు వెళ్లారని బీజేపీ వాళ్లే అంగీకరిస్తున్నారు నైట్ క్లబ్ అంటూ ఒక వీడియో ప్రచారమయ్యే వరకు కూడా రాహుల్ నేపాల్ వెళ్లారని భారతీయుల్లో 99.9 శాతం మందికి తెలీదు. ఆయన యూరప్ టూర్లో ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. అమేఠీలో ఓడిపోయిన రాహుల్ ను వాయ్ నాడ్ లో కూడా ఓడించాలని బీజేపీ కంకణం కట్టుకుంది. ఇప్పటికే స్మృతీ ఇరానీ ఒక పర్యాయం వాయ్ నాడ్ పర్యటించి వచ్చారు. ఇంతలోనే రాహుల్ నేపాల్ పర్యటన రూపంలో వారికి మరో అస్త్రం దొరికింది..

కాంగ్రెస్ కూడా ఎదురుదాడి మొదలెట్టింది. పెళ్లికి వెళితే తప్పేమిటని ప్రశ్నించింది. మోదీ వెళ్లినట్లుగా రాహుల్ పాకిస్థాన్లో పర్యటించలేదని, నవాజ్ షరీఫ్ కూతురు పెళ్లికి పిలవని పేరంటంగా మోదీ వెళ్లినట్లు రాహుల్ పరిగెత్తుకుంటూ వెళ్లలేదని, కాంగ్రెస్ నేతలు వాదన. పైగా బీజేపీ నేతలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బయటకు తీస్తున్నారు.. కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవడేకర్, అప్పుడెప్పుడో పార్టీ చేసుకుంటూ షాంపైన్ బాటిల్ పట్టుకున్న ఫోటోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఉంచింది. తొందర్లోనే మరిన్ని ఫోటోలు, వీడియోలు బయటకు వస్తాయనేందుకు సందేహ పడాల్సిన అవసరం లేదు…. రాహుల్ టూర్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త భాష్యం చెప్పారు. చైనా వాళ్లు అమ్మాయిలను పంపి హనీ ట్రాప్ వేస్తారట. చైనా వైపు నుంచి హనీ ట్రాపులు పెరుగుతున్నాయట. అదీ చైనా రాయబారే స్వయంగా వచ్చి హనీట్రాప్ వేశారట… కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోను, పార్టీలోను పరిస్థితులు చక్కబెట్టుకోకుండా ఇలా నైట్ క్లబ్బులకు వెళ్లడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు…

నిజానికి రెండు పార్టీలు చేస్తున్నదీ తప్పే… విధానాల పరంగా దుమ్మెత్తిపోసుకోవాల్సిన పార్టీలు, వ్యక్తిగత అంశాలతో ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నాయి. కాంగ్రెస్ ను కాలం చెల్లిన పార్టీ అని, జనం ఆ పార్టీని తరిమి తరిమి కొట్టారని వాదిస్తున్న బీజేపీ.. ఇంకా ఆ పార్టీనే ఎందుకు టార్గెట్ చేస్తుందో అర్థం కాని అంశమనుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడైనా కాంగ్రెస్ తోనే తమకు ముప్పు ఉంటుందని బీజేపీ భయపడుతోంది. అందుకే జనం కళ్లలో కాంగ్రెస్ ను పలుచన చేసే ప్రయత్నం మానుకోవడం లేదు. కాంగ్రెస్ ను లేవకుండా కొట్టాలన్నదీ బీజేపీ ప్రయత్నం. బీజేపీపై తిరగబడాలన్నది కాంగ్రెస్ సంకల్పం. ఎవరు గెలుస్తారో చూడాలి….