మన శత్రువుకి.. శత్రువు మనకెంతో ఆప్తమిత్రుడవుతాడంటారు. రాజకీయాల్లోనూ అంతే. మహారాష్ట్ర పరిణామాలకు ఆ సామెత అతికినట్లు సరిపోతుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై అక్కసుతో బీజేపీ నేతృత్వ హిందూత్వవాద సంస్థలన్నీ ఎంఎన్ఎస్ నేత రాజ్ ఠాక్రేను సమర్థిస్తున్నాయి. ముసుగులో గుద్దులాట లేకుండా ఓపెన్ గానే ఆయన, మేము ఒకే తాటిపై ఉన్నామని చెప్పుకుంటున్నాయి….
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు.. రాజ్ ఠాక్రే బాబాయి కొడుకు. మొదటి నుంచి రాజకీయాల్లో ఇద్దరిదీ ఎడమొహం పెడమొహం. ఉద్ధవ్ ఠాక్రే… బాలాసాహెబ్ వారసుడైన తర్వాత రాజ్ ఠాక్రే… ఎంఎన్ఎస్ పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నారు. రెండు పార్టీలదీ హిందూత్వవాదమే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ సాధించిన ఓట్లు 2. 25 శాతమే. అసెంబ్లీలో ఆయన పార్టీకి ఒక సీటు మాత్రమే ఉంది. అయినా హిందూత్వవాద పోకడలు, శక్తిమంతమైన ప్రసంగాలతో రాజ్ ఠాక్రే నిత్యం వార్తల్లో వ్యక్తిగా ఉంటారు..
లౌడ్ స్పీకర్ వివాదం
మసీదుల్లో లౌడ్ స్పీకర్లు వద్దంటూ రాజ్ ఠాక్రే ఒక ఉద్యమాన్నే ప్రారంభించారు. పెద్దగా సౌండ్ పెట్టి ఆజాన్ చదవడంతో ఇతరులకు ఇబ్బంది కలుగుతోందని వాదించారు ఉత్తర ప్రదేశ్ లో యోగీ సర్కారు వేలాది లౌడ్ స్పీకర్లను తీసేసినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమిటని ఆయన ప్రశ్నించారు. లౌడ్ స్పీకర్లపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి తాను హాజరు కాకపోయినా ఎంఎన్ఎస్ ప్రతినిధులను పంపారు ఆ సమావేశానికి బీజేపీ హాజరు కాలేదు. లౌడ్ స్పీకర్లపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్ననేపథ్యంలో కేంద్రమే చొరవ తీసుకుని నిర్ణయం ప్రకటించాలని మహారాష్ట్ర ప్రభుత్వం అంటోంది…
బీజేపీ మద్దతుతో..
నిజానికి రాజ్ ఠాక్రే పొలిటికల్ నో వాయిస్… స్టేట్ మెంట్లు ఇవ్వడం మినహా పెద్దగా ప్రభావం చూపలేని నాయకుడు. అనవసరమైన విషయాలు మాట్లాడుతూ వార్తల్లో ఉండాలని కోరుకునే నేత. ఉద్ధవ్ ఠాక్రేతో కలిసిపోదామని ప్రయత్నించి… అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో టైమ్ పాస్ రాజకీయాలు నిర్వహిస్తున్న నాయకుడు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు కొంచెం….. కాలం కలిసి వస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉంటూ.. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయిన బీజేపీ ఇప్పుడు రాజ్ ఠాక్రే చర్యలకు ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం పదవి కోసం ఉద్ధవ్ ఠాక్రే తమకు హ్యాండిచ్చి కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసిపోయారని బీజేపీ గుర్రుగా ఉంది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న కమలం ఇటీవలే ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది. సంకీర్ణ ప్రభుత్వం మహా వికాస్ ఆగాఢీలోని నేతలు, వారి కుటుంబ సభ్యులపై ఈడీ దాడులు కొనసాగిస్తోంది. ఇప్పుడు రాజ్ ఠాక్రేను పద్ధతి ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం పైకి ఎగదోస్తోంది…
బీజేపీ వైపు నుంచి వచ్చిన అవకాశాన్ని రాజ్ ఠాక్రే అందిపుచ్చుకున్నారు. లౌక్ స్పీకర్ల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి.. ఇప్పుడు మహారాష్ట్ర సర్కారుకు డెడ్ లైన్లు పెట్టేస్తున్నారు. ఇటీవల మరాఠ్వాడా ప్రాంతంలో నిర్వహించిన ఒక సభకు భారీగా జనం హాజరయ్యారు. అందులో 90 శాతం మంది బీజేపీ, వీహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలే.. సభలో పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చిన రాజ్ ఠాక్రే… 16 అంశాల్లో పోలీసులు విధించిన షరతులను ఉల్లంఘించారు. తమ పార్టీ తరపున నిర్వహించాల్సిన మహా హారతిని రద్దు చేశారు. అదేమంటే.. హిందూ ముస్లింలు ఒకటి కాదా… వాళ్ల పండుగలను మనం గౌరవించవద్దా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు…
రాజ్ ఠాక్రేకు రాజకీయ ఆకాంక్షలున్నాయి. బీజేపీకి మహారాష్ట్రలో అవసరాలున్నాయి. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు మార్గాలు వెదుక్కోవాల్సిన అనివార్యతలున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ లాంటి నేతలను మట్టి కరిపించి ప్రభుత్వంలోకి రావాలంటే.. హిందూ నినాదమే మేలని వాళ్లు భావిస్తూ ఉండొచ్చు. మహారాష్ట్ర జనం తమ కంటే రాజ్ ఠాక్రేను ఎక్కువగా నమ్ముతారని బీజేపీ విశ్వసిస్తోంది. రాజ్ ఠాక్రేను తమ కూటమిలోకి లాగేందుకు రాజ్యసభ సీటు ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. అధికారం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న రాజ్ ఠాక్రే కూడా ఇందుకు నో అని చెప్పలేని పరిస్థితి ఉంది. మరి మహారాష్ట్ర పరిణామాలు ఎలా మారతాయో చూడాలి