విచారణలో అక్రమాలు జరిగాయని నిర్ధారణ.
అన్ని వివరాలతో ఈడీకి లేఖ.
తెలంగాణలో మంత్రి మల్లారెడ్డిని ఐటీ అధికారులు అంత ఈజీగా వదిలిపెట్టేలా లేరు. మూడు రోజులు మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లల్లో ఐటీ శాఖ అధికారులు తనికీలు చేయడం అందరికీ తెలిసిందే. సోదాల సందర్భంగా మల్లారెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడి ఇంట్లో నుంచి 18 కోట్ల రూపాయలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల సోదాల తరువాత విచారణకు హాజరు కావాలని 14 మందికి నోటీసులు ఇచ్చారు. సోమవారం నుంచి ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. ఈ విచారణలో సందర్భంగా మెడికల్ సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. డొనేషన్ల రూపంలో వసూలు చేసిన వంద కోట్ల రూపాయల మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులను ఆ విషయం గురించే ప్రశ్నించినట్లు సమాచారం.
మల్లారెడ్డి ఆడిటర్‌ను కూడా వంద కోట్లు ఎక్కడ డిపాజిట్ చేశారనే విషయంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఐటీ శాఖ భావిస్తోంది. అందుకే మల్లారెడ్డి ఇంట్లో సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పటివరకు సేకరించిన సమాచారం, సాక్షాధారాలను క్రోడీకరిస్తూ ఈడీకి లేఖ రాసింది. మనీ ల్యాండరింగ్ కోణంలో దర్యాప్తు జరపాలని ఈడీని కోరారు. ఈ పరిణామాలను గమనిస్తే మల్లారెడ్డిని ఐటీ, ఈడీ అధికారులు ఇప్పుడప్పుడే విడిచిపెట్టేలా కనిపించడం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా డొనేషన్ల రూపంలో వసూలు చేశారని భావిస్తున్న ఆ వంద కోట్లు ఏమయ్యాయో తెలుసుకోవడంపైనే రెండు శాఖలు దృష్టి సారించబోతున్నాయని
అనుకుంటున్నారు.