సైకిలెక్కాలా కమలంతో నడవాలా? కన్ఫ్యూజన్ లో పవన్

By KTV Telugu On 3 December, 2022
image

ఎటూ తేల్చుకోలేకపోతోన్న పవన్ కళ్యాణ్

జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. 2008లోనే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈసారి ఎన్నికలను మాత్రం పవన్ కళ్యా ణ్ చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు . తిరుగులేని జనాదరణ తనసొంతం కావడంతో ఈసారి ఎన్నికల్లో తానే నిర్ణాయకశక్తిగా ఉంటానని ఆయన నమ్ముతున్నారు. అటు జనసైనికులు కూడా ఈసారి జనసేన ఎన్నికల్లో సత్తాచాటి తమని వెటకారం చేసే వాళ్లకు గుణపాఠం చెప్పాలని పంతంగానే ఉన్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యా ణ్ పార్టీకి ఓట్లు బాగానే వచ్చాయి. ఆరు శాతానికి పైగా ఓట్లు రావడం ఆషామాషీ ఏమీకాదు. పార్టీని తన ఒంటిచేత్తో ముందుకు నడిపిస్తోన్న పవన్ కళ్యాణే పార్టీకి తిరుగులేని బలం అనడంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలూ అవసరమే లేదు. అయితే ఇప్పుడు పవన్ ను కలవరపరుస్తోన్న అంశం వేరేఉంది. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానీయకూడదని పవన్ కళ్యాణ్ భీష్మించుకున్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుందో తానుచూస్తానని ప్రభుత్వ సలహాదారు సజ్జలకే ఆయన సవాల్ విసిరారు కూడా.

అంతా బాగానే ఉంది కానీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే ఆయన ఎవరితో కలుస్తారు అనేది ఇప్పుడు
ఆసక్తికరంగా మారింది. టిడిపి-బిజెపిలను కలుపుకుంటూ 2014 తరహాలో కూటమి కట్టాలని పవన్ కళ్యా ణ్ అనుకున్నారు.
అందుకే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటును చీలనిచ్చే ప్రసక్తే లేదని శపథం చేశారు . తనను చీటికీమాటికీ చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటూ మంత్రులు, పాలక పక్షనేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహంతోనే ఉన్నారు . వచ్చే ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా బదలా తీర్చుకోవాలన్న కృతనిశ్చయంతోనూ ఉన్నారు. ఇటీవల విశాఖలో తనను ర్యాలీ చేసుకోనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం హోటల్ గదిదాటి బయటకు
రానివ్వ కుండా ఆంక్షలు విధించడంపై పవన్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఆ సమయంలోనే పవన్ కళ్యా ణ్ ను పరామర్శిం చడం ద్వా రా టిడిపి-జనసేనలు కలసి పనిచేస్తాయని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. దానికి
అనుగుణంగానే పవన్ కళ్యా ణ్ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే విధంగా ఇప్పటంలో తాను ప్రజల కోసంవెళ్తే అక్కడా
తనను అవమానించేలా మంత్రులు మాట్లాడుతున్నారని పవన్ భావిస్తున్నారు . ఈనేపథ్యంలోనే విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీని కలవాల్సిందిగా జనసేనానికి పిలుపు రావడంతో అక్కడికి వెళ్లి మోదీతో భేటీ అయ్యారు.

అందులో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఏమీ బాగాలేదని అందరినీ వేధిస్తోందని పవన్ కళ్యాణ్ మోదీకి ఫిర్యా దు చేసినట్లు చెబుతున్నారు. ఆభేటీలోనే చంద్రబాబు నాయుడిని కూడా కలుపుకునిపోతే మంచిదని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే మోదీ మాత్రం టిడిపితో పొత్తు అనగానే మొహం చిట్లించేసి చంద్రబాబు నాయుడిని ఎంత దూరం పెడితే అంత మంచిదని పవన్ కు హితవు చెప్పినట్లు భోగట్టా. టిడిపితో పొత్తు ప్రసక్తే లేదని మోదీ తేల్చిచెప్పడంతో పవన్ కళ్యా ణ్ కాస్త డీలాపడ్డారు. అందుకే ప్రధానిని కలిసి బయటకు వచ్చిన తర్వా త మీడియాతో మాట్లాడిన పవన్ లో ఎలాంటి హుషారూ కనిపించలేదు. చాలాడల్ గా కనిపించారు. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే మోదీ వద్దని చెప్పి నాటిడిపితో జట్టు కట్టాలా లేక బిజెపికే గుడ్ బై చెప్పి చంద్రబాబు నాయుడితో ఉండిపోవాలా. అలా కాకుంటే మోదీ చెప్పినట్లు విని టిడిపికి దూరంగా ఉండి బిజెపితో కలిసి ముందుకు సాగాలా ?
ఈ డైలమాలోనే పవన్ కళ్యా ణ్ తర్జన భర్జనలు పడుతున్నట్లు సమాచారం.

బిజెపితో కలిసి వెళ్తే ఏంటిలాభం? బిజెపితో కటీఫ్ చెబితే ఏంటి నష్టం? టిడిపితో ఉంటే లాభమా దూరం పెడితే లాభమా? వంటి ప్రశ్నలకూ ఆయన సమాధానాలు వెతుక్కునే పనిలో పడ్డారని అంటున్నారు. నిజానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని ఓడించి తీరాలని పంతంతో ఉంటే బిజెపి జనసేన కలిసి పోటీ చేయడం వల్ల ఆలక్ష్యం నెరవేరదు. ఏపీలో ఎంతకాదన్నా టిడిపికి ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉంది. ఆ పార్టీకి నిర్ధిష్ఠమైన ఓటు బ్యాంకూ ఉంది. బిజెపికి రెండు శాతం ఓట్లుకూడా లేవు. మరి ఆపార్టీ నేతలు చెప్పినట్లు ఎందుకు నడుచుకోవాలి అన్న ప్రశ్నలు జనసేన పార్టీలోని సీనియర్ల నుంచే వస్తున్నాయంటున్నారు. చంద్రబాబుతో జట్టు కడితే ఎలా ఉంటుంది. ఇక్కడే జనేసేనలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయట. ఓవర్గం నేతలు టిడిపితో పొత్తు పెట్టుకుంటే మంచిదంటున్నారట. మరోవర్గం మాత్రం చంద్రబాబు నాయుడిని నమ్మడానికి వీల్లేదని ఆయన వాడుకుని వదిలేస్తారని అంటున్నారట.

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఏపీలోని కాపు సామాజికవర్గం ప్రజలు గట్టిగానే కోరుకుంటున్నారు. అందులో సందేహమే లేదు. అయితే టిడిపితో జనసేన పొత్తు పెట్టుకుంటే జనసేనకు చంద్రబాబు ఎన్నిసీట్లు కేటాయిస్తారు? టిడిపి ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. తీరా ఎన్నికల్లో టిడిపి-జనసేన కూటమే గెలిస్తే ముఖ్యమంత్రిగా ఎవరుంటారు? పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి భోగం కల్పిస్తారా లేదా ? చంద్రబాబు నాయుడి గురించి బాగా తెలిసిన వారయితే చంద్రబాబు ము ఖ్యమంత్రి పదవిని మరొకరికి ఇచ్చే ఛాన్సేలేదంటున్నారు. ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచిన సందర్బంలో తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా కుట్రలో భాగస్వామి చేసుకున్న చంద్రబాబు ఎన్టీయార్ ను గద్దె దింపిన తర్వాత ప్రభుత్వంలో దగ్గుబాటిని ఉపముఖ్యమంత్రిని చేస్తానని ఆఫర్ ఇచ్చారట. తీరా వెన్నుపోటు సక్సెస్ అయ్యి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యా క దగ్గుబాటిని కరివేపాకులా పక్కన పెట్టేశారు.

అటువంటి చరిత్ర ఉన్నచంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు కూడా పచ్చటి కుచ్చుటోపీ పెడతారని జనసేనలో ఓవర్గం హెచ్చరిస్తోంది. తన తర్వాత తన కుమారుడు లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అందుకే జనవరి నుండి లోకేష్ చేత పాదయాత్ర చేయిస్తున్నారు. తన తర్వాత పార్టీలో నెంబర్ టూ లోకేషే నని సీనియర్లకు కూడా సంకేతాలు ఇస్తున్నారు చంద్రబాబు. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబును నమ్మిపొత్తు పెట్టుకుంటే కాపు ప్రజానీకం అయినా తమ వెంట నిలుస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయంటున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారనుకుంటే కాపులంతా ఏకతాటిపైకి వచ్చి ఓటు వేయచ్చు. కానీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి కాపులంతా ఎందుకు ఏకంకావాలి అన్న ప్రశ్న ఉత్పన్నమవు తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిపై కాపులకుండే అసంతృప్తి వేరే ఉంది. అటు బిజెపి నాయకత్వా న్ని ఇటు జనసేన క్యాడర్ నీ ఒప్పించి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం కుదిరే పనికాదు. టిడిపితో వెళ్లాలనుకుంటే బిజెపికి బైబై చెప్పక తప్పదు. అప్పుడు జనం ఎలా ఆలోచిస్తారనేది ఇప్పుడే చెప్పలేం అంటున్నారు రాజకీయ పండితులు.