బాద్ షాతో బీజేపీ..బాబుతో పవన్ కల్యాణ్

By KTV Telugu On 3 November, 2022
image

జూ.ఎన్టీఆర్ వల్లే బాబు, పవన్ లు ఒక్కటయ్యారా?
వైసీపీ, జనసేనగా మారిన ఏపీ రాజకీయాలు
చంద్రబాబు ఎత్తుగడే అంటోన్న విశ్లేషకులు
బాబు, పవన్ కల్యాణ్ తో జత కడుతున్న వేళ…
జూ.ఎన్టీఆర్ కు రెడ్ కార్పెట్ పరుస్తోన్న బీజేపీ

ఏపీలో రాజకీయాలు గమ్మత్తుగా మారాయి. వైసీపీ, టీడీపీల మధ్య యుద్ధం కాస్తా టర్న్ తీసుకొని వైసీపీ, జనసేనగా మారింది. టీడీపీ పక్కకు వెళ్లిపోయింది. అయితే, అదంతా చంద్రబాబు మైండ్ గేమ్ రాజకీయంలో భాగమనే ప్రచారం జరుగుతోంది. జనసేనాని భుజం మీద తుపాకీ పెట్టి బాబు వైసీపీని షూట్ చేసే ఎత్తుగడ వేశారని పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట. ఏపీలో బీజేపీ, జనసేన భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అయితే, పేరుకు దోస్తులే గానీ కలిసి పోరాటాలు చేసింది మాత్రం చాలా తక్కువే. ఇదే చంద్రబాబుకు కలిసొచ్చింది. ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ ను తనకు అనుకూలంగా మలుచుకునే స్కెచ్ వేసి చంద్రబాబు సక్సెస్ అయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఒంటరిగా ఎదుర్కోలేమని భావించిన బాబు..బీజేపీతో దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. అయితే, కమలనాథులు బాబుతో దోస్తీకి విముఖంగా ఉండడంతో, జనసేనకు కర్చీఫ్ వేసినట్లు చెబుతున్నారు. గత కొంతకాలంగా టీడీపీ నేతలు జనసేనతో పొత్తుకు అనుకూలంగా చేస్తున్న వ్యాఖ్యలు అందుకు బలాన్నిచ్చాయి. ఇక, ఇటీవల విశాఖలో చోటుచేసుకున్న పరిణామాలతో రంగంలోకి దిగిన చంద్రబాబు నేరుగా పవన్ ను కలవడంతో…టీడీపీ-జనసేనల పొత్తు ఫిక్స్ అయిపోయినట్లేనని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.

టీడీపీ వ్యూహం అలా ఉంటే, బీజేపీ రాజకీయం అంతకుమించే ఉంది. అధికార వైసీపీతో సన్నితంగా మెలుగుతూ… పవన్ తో పొత్తు మెయిన్ టైన్ చేస్తున్నట్టుగా కనిపించింది. ఏపీలో జరిగిన బద్వేల్, తిరుపతి ఉపఎన్నికల్లో జనసేనను పక్కనబెట్టి బీజేపీ రంగంలోకి దిగింది. అంతేకాదు, తాము చేపట్టే కార్యక్రమాలకు ఎక్కడా పవన్ ను పిలిచింది లేదు. ఇటీవల ప్రధాని భీమవరం వచ్చినప్పుడు కూడా పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందలేదు. ఢిల్లీలోనూ వైసీపీ నేతలకు అపాయింట్ మెంట్ ఇచ్చినంత ఈజీగా జనసేనానికి దొరకలేదనే వార్తలు మనం చూశాం. అటు జనసేనాని సైతం…. తమ పార్ట్ నర్ తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, వైసీపీతో సన్నిహితంగా మెలగడం లాంటి కారణాలతో దూరం జరుగుతూ వచ్చారు. సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ తమకు దగ్గరయ్యే ప్రయత్నం చేయడంతో…సైకిల్ వైపు కన్ను మళ్లించారు. పవన్ కల్యాణ్ మనసు నొచ్చుకునేలా బీజేపీ ప్రయత్నించిందో…లేక వైసీపీని ఎదుర్కొనేందుకు బాబు అయితేనే కరెక్ట్ అని జనసేనాని భావించారో అనే విధంగా రాజకీయ విశ్లేషణలు సాగాయి. కానీ, అసలు కారణం మరొకటి ఉందనే చర్చ జరుగుతోంది. బాబు, పవన్ దగ్గరకెళ్తే…బీజేపీ, జూ. ఎన్టీఆర్ కు రెడ్ కార్పెట్ పరుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇటీవల తెలంగాణలో చోటుచేసుకున్న పరిణామాలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు నొచ్చుకునేలా చేశాయట. తెలంగాణ పర్యటనలో అమిత్ షా జూ. ఎన్టీఆర్ ను కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ సేవలను ఉపయోగించుకుంటామన్న కమలనాథుల స్టేట్ మెంట్లే బాబు, పవన్ లను దగ్గర చేసిందని చెబుతున్న వారు ఉన్నారు. ఎందుకంటే, ఇటీవల చంద్రబాబు పర్యటనల్లో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలనే డిమాండ్లు వస్తున్నాయి. చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు మాట దాడి చేసినప్పుడు, అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చినప్పుడు…జూనియర్ స్పందన పేలవంగా ఉందంటూ తమ్ముళ్లు తిట్టిపోశారు. షా-బాద్ షాల భేటీని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. అటు పవన్ కల్యాణ్ సైతం తనతో దోస్తానం చేస్తూ…. బీజేపీ అగ్రనేత జూనియర్ ను కలవడంపై ఒకింత అసంతృప్తికి లోనయ్యారట. సీన్ కట్ చేస్తే తాజాగా, పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న పురస్కారం ప్రదానం చేసిన బీజేపీ ప్రభుత్వం…రజినీకాంత్ తో పాటు ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి రెడ్ కార్పెట్ పరిచింది. మొత్తంగా, పవన్ కళ్యాణ్ తో టీడీపీ జత కడుతున్న వేళ.. బీజేపీ ముఖ్య నాయకత్వం జూనియర్ కు ఇస్తున్న ప్రాధాన్యత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.