డిసెంబర్ 1 నుంచి ఇదేం ఖర్మ రాష్ట్రానికి..!

By KTV Telugu On 21 November, 2022
image

రాబిన్ శర్మ డైరెక్షన్, అయ్యన్న అడ్వైజ్
ప్రజాసమస్యలపై 45రోజులపాటు ప్రోగ్రామ్
ఖర్మ కార్యక్రమం నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌తో
అజెండా, మ్యానిఫెస్టో సిద్ధం చేస్తామన్న బాబు

బాదుడే బాదుడుతో జనంలోకి వెళ్తున్న చంద్రబాబు టీమ్. ఇప్పుడు ప్రభుత్వంపై మరో అస్త్రం ప్రయోగిస్తోంది. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ 45రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ రాబిన్ శర్మ డైరెక్షన్‌లో అయ్యన్నపాత్రుడు సలహాతో చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. కర్నూలు పర్యటనలో తనకు ఎదురైన నిరసనల నుంచి పుట్టుకొచ్చిందే ఇదేం ఖర్మ రాష్ట్రానికి. మొదట ఇందేం ఖర్మ అనుకున్నారు బాబు. అయితే అయ్యన్నపాత్రుడు దీనికి సవరణ చేయాలని కోరారు. రాష్ట్రానికి ఇదేం ఖర్మ అంటే ఉత్తరాంధ్రలో సెంటిమెంట్ పండుతుందని చెప్పడంతో బాబు ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే టైటిల్‌ను డిసైడ్ చేశారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో దీన్ని ప్రారంభించారు.

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలపై అవగాహన కల్పించేందుకు ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ ప్రజల్లోకి వెళ్లాలని బాబు తమ్ముళ్లకు సూచించారు. కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన స్పందన వారి ఆకాంక్షలకు అనుగుణంగానే పార్టీ భవిష్యత్‌ ఎజెండాను, మ్యానిఫెస్టోను సిద్ధం చేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. డిసెంబరు 1 నుంచి 45 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కనీసం 52 లక్షల కుటుంబాల్ని కలవాలని టార్గెట్ పెట్టుకున్నారు. రెండు కోట్ల మంది ప్రజల్ని నేరుగా కలుసుకోవాలని బాబు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను క్రోడీకరించి రాష్ట్రపతి, గవర్నర్‌లకు పంపుతామని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చంద్రబాబు చెబుతున్నారు.

అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ రచ్చబండకు ప్లాన్ చేశారు. పార్టీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు రచ్చబండలో పాల్గొనున్నారు. పార్టీ బృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రత్యేకంగా సిద్ధం చేసిన కిట్లను పంపిణీ చేస్తాయి. ప్రతి కిట్‌లో బ్యాగ్‌, ప్రజల నుంచి సమాచారం సేకరించేందుకు వివిధ ప్రశ్నలతో రూపొందించిన పత్రం, ఒక క్యాలెండర్‌ ఉంటాయి. ప్రతి కుటుంబంతో ఆ ఫామ్‌ నింపించి దాన్ని ఫొటో తీసి వాట్సాప్‌లో కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. పత్రాలనూ సేకరిస్తారు. అక్కడ అన్నింటినీ క్రోడీకరించి ఒక నివేదిక సిద్ధం చేస్తారు. ఇంటింటికీ వెళ్లినప్పుడు వారితో ఒక మొబైల్‌ నంబర్‌కి మిస్డ్‌కాల్‌ ఇప్పిస్తారు. గతంలో ఇదే ఫార్ములాను జగన్ ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్‌లో అమలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు దాన్ని రాబిన్ శర్మ సలహా మేరకు ముందుకు తీసుకెళ్తున్నారు. కార్యక్రమం పేరు వేరయినా మిగతాదంతా సేమ్ టూ సేమ్ కనిపిస్తోంది.