ఎందుకిలా నా ‘ఖర్మ’ కాలిపోయిందీ!
అడుగు కదిపేలోపే ఆడేసుకుంటున్నారు!
త్రీడీలు, గ్రాఫిక్సులూ సిన్మాలను ఆడించలేవు. రాజకీయాలైనా అంతే. కమిట్మెంట్ ఉండాలి, కష్టపడాలి. అంతేగానీ బ్యానర్ ఎలా డిజైన్ చేయాలో, కటౌట్ ఎంత హైడ్ ఉండాలో, ప్రోగ్రాంకి థీమ్సాంగ్ ఏదికావాలో, టైటిల్ ఏం పెట్టాలో చూసుకుంటే వర్కవుట్ అవ్వదు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. మూడుసార్లు సీఎంనని గుర్తుచేస్తారు. కానీ తరచూ తప్పులో కాలేస్తుంటారు. అడుసు తొక్కొద్దని అనుకుంటూనే కాళ్లు కడుగుతూనే ఉంటారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వీక్నెస్ని వైసీపీ బాగా కనిపెట్టేసింది. ఆయనకి ఎక్కడికక్కడ చెక్ పెడుతోంది. విమర్శలను తిప్పికొడుతోంది. బాదుడే బాదుడు అయిపోయింది. టైటిల్ మాసే అయినా సిన్మా క్లాస్ సెంటర్లలో ఆడలేదు. దీంతో మరో ప్రోగ్రాంకి క్లాప్ కొట్టారు చంద్రబాబు. ప్రభుత్వం మీద సమరమే అంటూ శంఖంపూరించినా సౌండ్ బయటికి రాలేదు. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనే ప్రోగ్రాం ఎనౌన్స్ చేసి ఏదో తేడా కొట్టేలా ఉందని పునరాలోచనలో పడ్డారు. జనంలోకి వెళ్లాలంటే ఏ చైతన్యయాత్రో పెట్టుకోవచ్చు. దానికి సింబాలిక్ టైటిల్స్‌తో పనేముంటుంది. ఆయన తన తదుపరి కార్యక్రమం గురించి ప్రకటించడమే ఆలస్యం ఖర్మ ఖర్మ అంటూ సెటైర్లు పడుతున్నాయి.
ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ నెలన్నరరోజులు రాష్ట్రంలో తిరగాలనుకున్నారు చంద్రబాబు. ఆ ప్రోగ్రాంలో ప్రజల సమస్యలపై విన్నపాలు స్వీకరించాలనుకున్నారు. కానీ కాలు బయట పెట్టకముందే ఇదేం ఖర్మ అంటూ సీఎం జగన్ వేసిన కౌంటర్లు సూటిగానే గుచ్చుకున్నట్లున్నాయి. రేపు జనంలో ఎవరన్నా ఖర్మ ఖర్మ అన్నా ఎవరిని అన్నారో అర్ధంకాదు. ఇక ప్రత్యర్థులు కూడా ఈ పదాన్నే వెనకాముందు వాడేసి విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. మొదటైతే ఇదేం ఖర్మనే అనుకున్నారు. తర్వాత ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని మార్చారు. ఏం మార్చినా ఖర్మ మాత్రం కామన్. అయినా ఈ టైటిల్‌తో జనంలోకి వెళ్తే కామెడీ అయిపోతామని కొందరు టీడీపీ సీనియర్లే మధనపడుతున్నారు. సేవ్ ఏపీ అనో, ఆంధ్రా ఆక్రోశం అనో పెట్టుకున్నా బానే ఉండేదేమో! కాలానికి తగ్గట్లు అప్డేట్ కాకపోతే ఇలాంటి చిత్రవిచిత్ర సమస్యలే ఎదురవుతాయి. మన అభిప్రాయాలు జనంమీద రుద్దడం కాదు, వాళ్ల మనసెరిగి మసలుకోవాలి. వాళ్ల గుండెచప్పుడుని దగ్గర్నించి వినగలగాలి. అంతేగానీ టైటిల్ భీకరంగా ఉంటేనో, పాంప్లెట్ అదిరిపోతేనో మళ్లీ అధికారం దక్కుతుందనుకోవడం కల్ల!