అయ్యన్నకు ఉన్నపాటి దమ్ముకూడా లేకపాయ!
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. నాలుగు దశాబ్ధాల రాజకీయజీవితంలో అపారమైన అనుభవం వచ్చుండాలి. తిరుగులేని నిర్ణయాలు తీసుకోవాలి. పక్కా వ్యూహంతో నాయకులను మెప్పించాలి, ఒప్పించాలి. కానీ తెలుగుదేశంలో జరుగుతున్నదేమిటి? అధినేత నిర్ణయాలు సీనియర్లని నొప్పిస్తున్నాయి. పోనీ యువ నాయకత్వాన్నయినా మెప్పిస్తున్నాయా అంటే అదీ లేదు. యువనాయకత్వానికే పెద్దపీటని చంద్రబాబు సంకేతాలిస్తున్నారు. గెలుపుగుర్రాలకే అవకాశం అంటున్నారు. కానీ అందులో కూడా క్లారిటీ లేదు.
అమ్మ పుట్టిల్లు మేనమామకెరుకే. అందుకే అధినేత గందరగోళాన్ని అయ్యన్నపాత్రుడు బాగానే అర్ధంచేసుకున్నట్లుంది. అందుకే అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మంచిదని మొహానే చెప్పేస్తున్నారు. టికెట్ ఇచ్చేది లేదనుకుంటే మొహమాటం లేకుండా ముందే చెప్పేయాలి. గెలవడనుకుంటే నాకైనా టికెట్ ఇవ్వొద్దు. అభ్యర్థులను మాత్రం చివరిదాకా నాన్చకుండా ముందే నిర్ణయించాలని టీడీపీ అధినేతకు సీనియర్ లీడర్ నాలుగు పనికొచ్చే మాటలే చెప్పారు. గెలిపించకపోతే ఇవే చివరి ఎన్నికలని నీరసపు మాటలు చెబుతున్న చంద్రబాబుకు ధైర్యవచనాలు చెప్పారు. జనమే మనల్ని గెలిపిస్తారని అధినేతకి బూస్ట్ తాపించే ప్రయత్నం చేస్తున్నారు.
గెలుపుగుర్రాలకే టికెట్లు అంటున్నారు చంద్రబాబు. మరి ఈ నిబంధన అందరికీ వర్తిస్తుందా లేకపోతే కొందరికి మినహాయింపు ఉంటుందా? ఆ కొందరిలో చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేష్ కూడా కచ్చితంగా ఉంటారు. ఎందుకంటే మంగళగిరినుంచి పోటీచేసి తొలి ఎన్నికలోనే ఓటమిని మూటగట్టుకున్నాడు అధినేత వారసుడు. మళ్లీ అక్కడినుంచే పోటీచేస్తానంటున్నా పార్టీ పరిస్థితి అక్కడ ఆశాజనకంగా లేదు. బీసీ కీలకనేతలు సైకిల్ దిగి ఫ్యాన్ పార్టీలో చేరారు. రెండుసార్లు గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి జనంలోనే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో లోకేష్ మళ్లీ పోటీచేయడమంటే పార్టీకి ఓ సీటు మైనస్సే. మరి చంద్రబాబు దృష్టిలో లోకేష్ గెలుపుగుర్రమా? రేసులో వెనుకబడ్డ గుర్రమా?