హిందూపురంలో హై టెన్షన్

By KTV Telugu On 1 November, 2022
image

వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ పై హత్యారోపణలు
సీబీఐ విచారణకు బాధితుల డిమాండ్
నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా పరిస్థితి
బాలయ్యపై వైసీపీ వ్యూహం బెడిసికొడుతుందా?

ఏపీలో కుప్పం, మంగళగిరి మాదిరే వైసీపీ టార్గెట్ చేసిన మరో ముఖ్యమైన నియోజకవర్గం హిందూపురం. కుప్పం, హిందూపురం ప్రజలు టీడీపీ తప్ప మరో పార్టీకి ఛాన్స్ ఇవ్వడం లేదు. కుప్పంలో చంద్రబాబును, మంగళగిరిలో మరోసారి పోటీకి సిద్ధమవుతున్న లోకేష్ ను ఓడించేందుకు భారీ స్కెచ్ వేస్తోన్న వైసీపీ…హిందూపురంపైనా కన్నేసింది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకే ఇక్కడి ప్రజలు మద్దతు పలుకుతున్నారు. 2014 నుంచి వరుసగా రెండు పర్యాయాలు బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముచ్చటగా మూడోసారి పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలవాలని వైసీపీ భావిస్తోంది. అక్కడ బాలకృష్ణను ఢీకొట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే, వైసీపీ హిందూపురం నియోజకవర్గం మాజీ సమన్వయ కర్త రామకృష్ణారెడ్డి హత్యతో అక్కడ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది.

రామకృష్ణారెడ్డిని సొంత పార్టీ నేతలే హత్య చేశారన్న ఆరోపణలతో అక్కడ మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ కేసులో పలువురు పోలీస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. రామకృష్ణారెడ్డి హత్య జరిగిన తర్వాత రోజే ఇద్దరు ఖాకీలపై వేటు పడింది. ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు వారంతా అండగా నిలుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఇక్బాల్ పీఏ గోపీకృష్ణ, కీలక నిందితులుగా ఉన్న వరుణ్, మహేష్ తో మాట్లాడిన ఆడియోలు బయటపడటంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పట్టణంలో 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ను ఏ1గా, అతని ప్రయివేట్ పీఏ గోపీకృష్ణను ఏ2గా, సీఐ జీటీ నాయుడును ఏ3గా నమోదు చేయాలని, సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు అఖిలపక్ష నేతలు పట్టణంలో బంద్ నిర్వహించడం, వైసీపీ నేతలు పాల్గొనడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

గతంలో రామకృష్ణారెడ్డి వద్ద పనిచేసిన గోపీకృష్ణ అతనితో విభేదాల కారణంగా ఇక్బాల్ కు చేరువయ్యారు. ఇక్బాల్ కర్నూలు వాసి. ఆయనకు ఎక్కడా సీటు సర్దుబాటు కాకపోవడంతో… వైసీపీ గత ఎన్నికల్లో హిందూపురం నుంచి బాలయ్యపై బరిలో నిలిపింది. 20వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఇక్బాల్ పై బాలకృష్ణ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ… ఇక్బాల్ ఓడినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చింది. రామకృష్ణారెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇక్బాల్ చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై నియోజకవర్గం మొత్తం ఇక్బాల్‌కు వ్యతిరేకంగా మారిపోయింది. ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డిని కూడా వైసీపీ కార్యకర్తలు ఘెరావ్ చేశారు.