ప్రధానితో వేదిక.. జగన్ మార్క్ రాజకీయం
పరోక్షంగా మూడు రాజధానుల ప్రస్తావన
మోడీతో అనుబంధం కొనసాగుతుందంటూ మెసేజ్
ఏపీ సీఎం జగన్ విశాఖ కేంద్రంగా తన మార్క్ రాజకీయం చూపించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ప్రభుత్వంపై పోరాటానికి విపక్షాలన్నీ ఏకమవుతున్న వేళ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అందుకు మోడీ టూర్‌ను తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేశారు. ఆంధ్రాయూనివర్సిటీ గ్రౌండ్స్‌లో భారీ సభను నిర్వహించి ఎక్కడా విపక్షాలకు చోటులేకుండా చేశారు. ప్రధానితో వేదిక పంచుకున్న జగన్ సాగరతీరంలో రూ.10వేల కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో తాను చెప్పదల్చుకుంది సూటిగా చెప్పేశారు. అశేష జనవాహిని మధ్య రాజధాని దగ్గర్నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన హక్కుల వరకు ప్రస్తావించారు. ప్రజలకు తానేం చేశానో చెబుతూనే మోడీతో బంధం గురించి చెబుతూ ప్రత్యర్థులకు చురకలు అంటించారు.
ఇక, అంతా ఊహించినట్టే బహిరంగ సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ ముందు రాజధాని ప్రస్తావన తీసుకొచ్చారు . సంక్షేమం, అభివృద్ధి దిశగా వెళ్తున్నామన్న జగన్ వికేంద్రీకరణ, పారదర్శక పాలనే తమ విధానమంటూ పరోక్షంగా మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారు. పరిపాలన రాజధానికి కేంద్రం మద్దతు ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతోనే మోడీ ముందు జగన్ ఆ ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ మినహా అన్ని పార్టీలు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. అటు హైకోర్టు సైతం అమరావతినే రాజధానిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. అయినప్పటికీ జగన్ సర్కార్ మొండిగా మూడు రాజధానులపై ముందుకెళ్తోంది. వికేంద్రీకరణకు మద్దతుగా ఇప్పటికే విశాఖ వేదికగా గర్జించిన వైసీపీ, ఉత్తరాంధ్రలో బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.
కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి ఉన్న అనుబంధం గురించి ప్రస్తావిస్తూ విపక్షాలపై బాణం ఎక్కుపెట్టారు జగన్. ప్రధానితో తమ అనుబంధం పార్టీలకు, రాజకీయాలకు అతీతమని చెప్పడం ద్వారా కేంద్రంతో తమ సన్నిహిత సంబంధాలు కొనసాగుతాయనే మెసేజ్ పంపారు. టీడీపీ, జనసేన, బీజేపీలు వచ్చే ఎన్నికల్లో కలిసి నడిచే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మోడీ, పవన్‌ల భేటీ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. ఇలాంటి సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అందుకు తగ్గట్టే వేదికపైన జగన్, మోడీలు ఉల్లాసంగా కనిపించారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా లేదన్న జగన్ గత ప్రభుత్వం ఏపీకి ఎంతో అన్యాయం చేసిందని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం, విభజన హామీలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, రైల్వేజోన్ సహా అనేక విజ్ఞప్తులు చేశామని పెద్ద మనసు చేసుకుని మేలు చేయాలని జగన్ ప్రధానిని కోరారు. మంచి చేసే ప్రభుత్వానికి ప్రజల దీవెనలు, పెద్దలైన మోడీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని సెంటిమెంట్ పండించారు.