గంటా చేరికకు వైసీపీ గంట కొట్టినట్లేనా!
రాజకీయం అంటే ఆయనకు ఫక్తు వ్యాపారం. ఒకప్పుడు స్టీల్‌ఫ్యాక్టరీలో స్క్రాప్ సేల్స్నుంచి ఎదిగిన అనుభవం ఆయనది. ఎన్నికలముందు ఆయనకో లెక్కుంటుంది. ఏ పార్టీ అధికారంలోకొస్తుందో అందులో ఉంటారు. 2019లోనే లెక్క కాస్త తప్పింది. ఆయన గెలిచాడు కానీ పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో ఎన్నికలకు ఏడాదిన్నర ముందు మళ్లీ గోడెక్కి కూర్చున్నారు. పంఖా పార్టీ పచ్చజెండా ఊపితే క్షణం ఆలస్యం చేయకుండా దూకేయబోతున్నారు. గంటా శ్రీనివాసరావు. విశాఖ నార్త్ ఎమ్మెల్యే. గెలిచింది తెలుగుదేశంపార్టీనే అయినా ఆ పార్టీలో ఆయన లేరు. రాజీనామా చేశారా అంటే అది కూడా లేదు. ఉండి కూడా లేనట్లే ఉన్నారు. పార్టీకూడా ఆయనపై ఆశలొదిలేసుకుంది.
డబ్బుంది. కాపు కార్డు ఎంతోకొంత పనిచేస్తుంది. ఆ రెంటిమీదా ఆయన రాజకీయం నడిచిపోతోంది. నియోజకవర్గం మార్చినా గన్‌షాట్ తప్పకుండా గెలిచే నాయకుడు. అందుకే ఆయనకు పార్టీ ముఖ్యంకాదు. ఒకప్పుడు ప్రజారాజ్యం. ఇప్పుడు తెలుగుదేశం. రేపు మరోపార్టీ. అది వైసీపీనేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీలో చేరేందుకు గంటా ఎప్పట్నించో రంగం సిద్ధంచేసుకున్నారు. కానీ ఆ పార్టీనే తలుపులు తెరవలేదు. విజయసాయిరెడ్డి సహా చాలామంది ముఖ్యనేతలకు గంటా చేరిక ఇష్టంలేదు. అందుకే ఇన్నాళ్లు ఆగింది. ఇప్పుడు లైన్‌క్లియర్ అయిందనే సంకేతాలున్నాయి. సో.. వైసీపీలో గంటా మోగబోతోందన్నమాట!
విశాఖ వైసీపీ ఇంచార్జిగా వైవీ సుబ్బారెడ్డి వచ్చాక గంటాకు మార్గం సుగమం అయినట్లుంది. ఈసారి టీడీపీ వస్తుందన్న నమ్మకం ఉంటే గంటా మెడలో పచ్చకండువా అలాగే ఉండేది. నిజంగానే అదే జరిగితే మరోసారి గంటాకి మంత్రి యోగం కూడా ఉండేది. కానీ జగన్ గాలి ఏమాత్రం తగ్గలేదని వచ్చే ఎన్నికల్లో కూడా ఫ్యాన్ స్పీడ్ అలాగే ఉంటుందనే అంచనాకు వచ్చారు గంటా శ్రీనివాసరావు. అందుకే ఆలస్యం అమృతం విషం అనుకుంటున్నారు. తెరవెనుక మంతనాలు జరిపారు. మరోవైపు ఎన్నికలనాటికి చంద్రబాబు-పవన్మధ్య అవగాహన ఉంటుందన్న అనుమానం గంటాకుంది. అదే జరిగితే ప్రజారాజ్యం పాత బ్యాచ్‌కి ప్రాధాన్యం ఉండదనేది గంటా అంచనా. అందుకే ఎందుకొచ్చిన తలనొప్పులు అని వైసీపీనే సేఫ్ జోన్‌గా భావిస్తున్నారు. పైగా ఫలానా చోటినుంచే పోటీచేయాలన్న పట్టుదల ఏమీ లేదు. ఎంపీగానైనా ఓకే, ఎమ్మెల్యేగానైనా ఓకే అన్నట్లుంది ఆయన ఆలోచన. గంటా పార్టీ మారడం అయితే ఖాయం. అయితే ఆయన రాకకు ముందే వైసీపీలో అలజడి మొదలైంది. గంటాకు అవకాశమిస్తే మరో రఘురామకృష్ణంరాజుని పెంచిపోషించడమేనని కొందరంటున్నారు. జగన్‌కి ఓకే అయితే ఇక ఎవరి అభ్యంతరాలు కూడా ఈసారి గంటాకి అడ్డుపడకపోవచ్చు.