పవన్‌కల్యాణ్‌కు ఏమైంది.. స్క్రిప్ట్‌ తేడాకొడుతోందే!

By KTV Telugu On 5 November, 2022
image

ఆవేశం అనర్ధదాయకం.. పీకేకి ఎవరన్నా చెప్పొచ్చుగా!

చొక్కా పట్టుకుంటే చెప్పుతో కొట్టండి
రెక్కీలు కాదు సుపారీలిచ్చినా భయపడను
మీరు రోడ్లు విస్తరిస్తే మేం ఇడుపులపాయలో హైవే వేస్తాం.. పవన్‌

మనం గెడ్డం గీసుకుంటాం సింహం గీసుకోదు అంతే తేడా మిగతావన్నీ సేమ్‌టూ సేమ్‌. ఇట్టాంటి డైలాగులు సిన్మాల్లో విజిల్స్‌ కొట్టిస్తాయి. వన్స్‌మోర్‌ అనిపిస్తాయి. కానీ ఈమధ్య గబ్బర్‌సింగ్‌ జనంలో వదులుతున్న డైలాగులు అపస్వరాల్లా అనిపిస్తున్నాయి. అందరినీ ఆలోచనలో పడేస్తున్నాయి. స్టేజీమీద చేతిలోచి చెప్పు తీసుకున్నరోజే ఇంత టెంపర్‌మెంట్‌ ఉన్నాయన రాజకీయాల్లో కష్టమే అనుకున్నారంతా. గరికపాటివారు స్టేజీమీదే చిరంజీవిగారూ మీరిలా వచ్చి కూర్చోవాలని అనగానే వినమ్రంగా వచ్చిన అన్నగారెక్కడ, ఆవేశపడి జుట్టెగరేస్తూ ఊగిపోతున్న తమ్ములుంగారెక్కడ! హేవిటో!!

అమరావతి ప్రాంతంలోని ఇప్పటంగ్రామానికి వచ్చారు శ్రీమాన్‌ పవన్‌కల్యాణ్‌. పోలీసులు కారు ఆపినా ఆవేశంగా పెద్ద పెద్ద అంగలేసుకుంటూ స్పాట్‌కి చేరుకున్నారు. రోడ్డు విస్తరణకోసం అధికారులు ఇళ్లముందు తవ్వేశారు. అడ్డొచ్చిన గోడలూ గట్రా కూల్చేశారు. కానీ జనసేనాని దృష్టిలో అది కక్షసాధింపు చర్య. కేవలం తనకు మద్దతిచ్చినందుకు తన మీటింగ్‌కి వేదిక కల్పించినందుకు కక్షగట్టి మరీ ఇళ్లు కూల్చేశారన్నది ఆయన వాదన. రోడ్డువిస్తరణ కోసం తప్ప మరో కారణంలేదు మొర్రో అని అధికారులు చెప్పినా భీమ్లానాయక్‌ ఆవేశం చల్లారలేదు. చొక్కా పట్టుకుంటే చెప్పుతో కొట్టండన్నారు. మీ ఇడుపాలపాయలో మేం కూడా హైవే వేస్తాం జాగ్రత్తని వేలూపి వార్నింగిచ్చారు.

పవన్‌కల్యాణ్‌ పర్యటన ముగిసిందో లేదో రిటన్‌ ఎటాక్‌ మొదలైంది. వైఎస్‌ విగ్రహంతో పాటు అడ్డొచ్చిన అన్ని ఆక్రమణలు తీసి రోడ్డు విస్తరిస్తుంటే నీ గోలేంట్రా బాబూ అంటూ వైసీపీనుంచి సెటైర్లమీద సెటైర్లు. రోడ్డు విస్తరణతో ఊరోళ్లంతా ఆనందపడుతుంటే నీ కడుపుబ్బరం ఏమిటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆధారాలతో బయటపెట్టారు. ఓ పక్క పవన్‌కల్యాణ్‌ ఇంటిదగ్గర రెక్కీ జరిగిందన్న ప్రచారాన్ని తెలంగాణ పోలీసులు తుస్సుమనిపించారు.

మందెక్కువై కొందరి హంగామా తప్ప అందులో మ్యాటరేం లేదని తేల్చేశారు. అయినా రెక్కీ, సుపారీ అంటూ నాకో లెక్కతో పాటు కాస్త అది కూడా ఉందని జనసేన అధినేత నిరూపించుకుంటున్నారు. కాపులంతా అండగా ఉంటే వంగవీటి రంగా హత్య జరిగేది కాదని ఆ మధ్య పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. పవన్‌కల్యాణ్‌ కాపు కార్డుపై ఆ కులంలో భిన్నవాదనలతో చీలిక కనిపిస్తోంది. పోటీచేసిన రెండుచోట్లా ఓటమి పాలయ్యాక లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అందరివాడుగా ఎలా ఎదగాలన్నదానిపై దృష్టిపెట్టాలి. కానీ జనసేన అధినేతకు అసలు కంటే కొసరెక్కువైనట్లు కనిపిస్తోంది. ఆవేశపూరిత ప్రసంగాలు, భావోద్వేగ ప్రకటనలతో యూత్‌నుంచి వెర్రికేకలు తప్ప జనంలో బలం పెరగదన్న విషయం పవన్‌కల్యాణ్‌కి ఎవరు చెప్పాలో!