మాజీ హోంమంత్రి రాజీనామా అందుకేనట

By KTV Telugu On 5 November, 2022
image

గుంటూరు జిల్లా వైసీపీలో అసలేం జరుగుతోంది
ఇటీవల కేబినెట్ లో చోటు కోల్పోయిన సుచరిత
తాజాగా గుంటూరు జిల్లా అధ్యక్షపదవికి రాజీనామా

గుంటూరు జిల్లా వైసీపీలో అసలు ఏం జరుగుతోంది. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గెలిచిన సుచరిత జగన్ కేబినెట్ లో హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు కోల్పోయారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే జగన్ నచ్చజెప్పడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ తర్వాత పార్టీ సుచరితకు గుంటూరు జిల్లా బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు సడన్ గా ఆమె జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. తన నియోజకవర్గంపై ఎక్కువ సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుచరిత చెబుతున్నప్పటికీ వెనకాల బలమైన కారణం ఉందనే చర్చ జరుగుతోంది.

మంత్రి పదవి పోయిన దగ్గర నుంచి పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని సుచరిత సన్నిహితుల వద్ద వాపోయారట. పేరుకే జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారని ఎవరూ ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదనే గుసుగుసలు వినిపిస్తున్నాయి. అయితే జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో పార్టీ పరంగా సమస్యలు ఉన్నా సుచరిత వాటి పరిష్కరానికి చొరవ తీసుకోలేదనే అభిప్రాయం కొందరిలో ఉంది. వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. పనితీరు సరిగా లేని ప్రజాప్రతినిథులకు మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నారు. పార్టీ పటిష్టంగా లేని చోట పలు మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని జిల్లాల్లో అధ్యక్షులను మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సుచరిత రిజైన్ పై జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గుంటూరు జిల్లా బాధ్యతలను సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కు ఇచ్చే అంశంపై అధిష్టానం ఆలోచిస్తోందట.

టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వెంటనే డొక్కా మాణిక్య వరప్రసాద్ కు జగన్ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ తరువాత తాడికొండ నియోజకవర్గ పరిశీలకుడిగా పార్టీ బాధ్యతలు అప్పగించింది. అప్పట్లో ఈ వ్యవహారం తాడికొండ వైసీపీలో కలకలం రేపింది. స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి మద్దతు దారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ సలహాదారు సజ్జలతో శ్రీదేవి భేటీ తరువాత పరిస్థితి సద్దుమణిగింది. ఇప్పుడు సుచరిత జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవటంతో మరో సారి డొక్కా మాణిక్య వరప్రసాద్ కు బాధ్యతల కేటాయింపు పైన చర్చ మొదలైంది. తీవ్ర అసంతృప్తితో ఉన్న సుచరిత పార్టీ మారతారనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే తాడికొండ నుంచి తనను దూరం చేసే కుట్ర జరుగుతోందని శ్రీదేవి అసహనంతో ఉన్నారు. ఇప్పుడు సుచరిత ఉన్నపళంగా జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంపై హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది.