మోడీ టూర్‌పై వైసీపీ వర్సెస్‌ బీజేపీ

By KTV Telugu On 7 November, 2022
image

మోడీ వైజాగ్‌ టూర్‌..క్రెడిట్‌ ఎవరికి

ప్రధాని వైజాగ్‌కి వస్తున్నారు. నవంబరు 12న బహిరంగసభకు వైసీపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపేమో ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీకి ఈ పరిణామాలేవీ మింగుడుపడటం లేదు. తెలంగాణలోలా ప్రభుత్వాన్ని కేంద్రపెద్దలు టార్గెట్‌ చేసుకోవాలని ఏపీ బీజేపీ నేతలు బలంగా కోరుకుంటున్నారు. కానీ తెలంగాణలో కేంద్రంపై కేసీఆర్‌ ఒంటికాలిమీద లేస్తుంటే ఏపీలో మాత్రం సీన్‌ రివర్స్‌. కేంద్రంతో వైసీపీ ప్రభుత్వం సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు పక్కనపెడితే జగన్‌కి ప్రధాని అప్పాయింట్‌మెంట్‌ దొరుకుతోంది. ఏపీ సీఎం ఆహ్వానిస్తే మోడీ వాలిపోతున్నారు. ప్రధాని ఇదివరకు పలుమార్లు ఏపీకి వచ్చినా ఈసారి టూర్‌ మాత్రం సమ్‌థింగ్‌ స్పెషల్‌. ఎందుకంటే ఏపీ రాజధానిమీద రాజకీయంగా పెద్ద రగడే నడుస్తోంది. అమరావతికోసం రైతులు పాదయాత్ర చేపడితే మూడు రాజధానులకోసం ఉత్తరాంధ్ర ఉద్యమం సాగుతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ఇందులో ముందుంటోంది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కూడా మోడీ ప్రధాని హోదాలో వచ్చారు. తెచ్చింది నీళ్లు, మట్టే అయినా అమరావతి రాజధానికి ఆయన మద్దతిచ్చారు. విశాఖ రాజధానిగా ఉంటుందని బల్లగుద్దిచెబుతున్న వైసీపీ మోడీ వైజాగ్‌ టూర్‌లోనూ అదే వెర్షన్‌ వినిపించబోతోంది. ఏపీ బీజేపీ మాత్రం అమరావతి రాజధానికే తాము కట్టుబడి ఉన్నామంటోంది. కీలక సమయంలో మోడీ టూర్‌ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ కంటే వైసీపీనే ప్రధాని పర్యటనను ఓన్‌ చేసుకుంటోంది. కేంద్రంనుంచి నిధులు తీసుకురాలేని వైసీపీ ప్రభుత్వం ప్రధాని ముందు మోకరిల్లుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ని కాపాడలేని వైసీపీ ఏమొహం పెట్టుకుని అక్కడ ప్రధానితో సభపెడుతోందని ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. కేంద్రంతో సఖ్యంగా ఉండటమే తమ పాలసీ అని చెబుతున్న వైసీపీ తన పనితాను చేసుకుపోతోంది. ఇది అధికారిక పర్యటన కావడంతో స్థానిక బీజేపీ నాయకత్వానికి ఇందులో ఎలాంటి పాత్ర లేకుండా పోయింది. మోడీది అఫీషియల్‌ టూర్‌ కావటంతో ఏపీలో బీజేపీకి ఇది పిలవని పేరంటంలానే ఉంది. కానీ చేసేదేముంది. టూర్‌తో సంబంధంలేనట్లు ఉండలేరు. అంతా నెత్తినేసుకుని మా క్రెడిట్టేనని చెప్పుకోలేరు. మింగలేక కక్కలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్‌ కమలనాథులు.