కాపు సామాజికవర్గంపై వైసీపీ ఫోకస్
ముద్రగడను ముగ్గులోకి దింపుతోన్న జగన్
వచ్చే ఎన్నికల కోసం టిక్కెట్ ఆఫర్
పవన్‌పై బరిలో దింపాలని వ్యూహం
వచ్చే ఎన్నికల్లో కాపు సామాజికవర్గం ఓట్ల కోసం వైసీపీ కాపు కాస్తోంది. పవన్‌కు చెక్ పెట్టేందుకు ఆ వర్గానికి చెందిన కీలక నేతను రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను జగన్ ముగ్గులోకి దింపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ముద్రగడ రాజకీయంగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుబెట్టపోతున్నారనే ఊహగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఆఫర్‌పై ఆలోచన చేస్తున్నారట ముద్రగడ. గతంలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పనిచేసిన ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల సమయంలోనే ఆయన వైసీపీలో చేరతారని అంతా భావించారు. కానీ అదేమీ జరగలేదు. వచ్చే ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం కీలకంగా మారనుండడంతో ఆయన్ను పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. పార్టీలో చేరడం పక్కా అంటున్న వైసీపీ శ్రేణులు పోటీ ఎక్కడి నుంచి అనేది కాస్త సందిగ్ధంగా మారిందని చెబుతున్నారు.
ముద్రగడకు ప్రత్తిపాడు లేదంటే కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని ప్రతిపాదన పెడుతోందట వైసీపీ. అయితే ఆ రెండింటిపైనా ఆయన అంతగా ఆసక్తి చూపడం లేదనే టాక్ వినిపిస్తోంది. 1994లో తొలిసారి ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు ముద్రగడ పద్మనాభం. తాను బతికుండగా ప్రత్తిపాడు నుంచి మళ్లీ పోటీ చేయబోనని తేల్చిచెప్పారు. అదేసమయంలో పార్లమెంట్‌కు వెళ్లే ఉద్దేశం లేదని…అసెంబ్లీకి అయితే ఒకే అని ముద్రగడ చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. దానికి తగ్గట్టుగానే వైసీపీ పెద్దలు లెక్కలు వేస్తున్నారట. పవన్ పిఠాపురాన్ని ఎంచుకుంటే ఆయనపై ముద్రగడను పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అదే ప్రత్యర్థిగా ముద్రగడ ఉంటే ఫలితం వైసీపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుందని లెక్కలేసుకుంటున్నారట జగన్. 2009లో పిఠాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ముద్రగడ ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. కాపు ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సైలెంట్ అయిపోయారు.
కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాపు సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు. ఆ సమీకరణాలకు తగ్గట్టుగానే అధికారపార్టీ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. పిఠాపురం కాకపోతే మరో ఆప్షన్‌గా పెద్దాపురంను కూడా వైసీపీ పరిశీలిస్తోందట. వైసీపీ ఇంత వరకు పెద్దాపురంలో బోణీ కొట్టలేదు. పిఠాపురం, పెద్దాపురం విషయంలో అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో అడుగులు ముందుకు పడొచ్చని అనుకుంటున్నారు. ముద్రగడ కాదంటే ఆయన కుటుంబం నుంచి ఒకరిని వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయించాలనే పట్టుదలతో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజివకర్గం బలమైనది. గత ఎన్నికల్లో ఆ వర్గం వైసీపీ వైపు నిలిచినా, ఈసారి జనసేన వైపు మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ముద్రగడను వైసీపీలోకి తీసుకొస్తే పవన్‌ను అడ్డుకోవడంతో పాటు ఆ సామాజికవర్గం తమకు వెన్నుదన్నుగా నిలుస్తోందనే ఈక్వేషన్స్‌తో జగన్ ఉన్నారట. అటు ముద్రగడ కూడా తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం జగన్‌కు మద్దతుగా నిలిచే సూచనలు కనిపస్తున్నాయి. మొత్తంగా ముద్రగడ ఏ సీటు కోరినా ఇచ్చేందుకు వైసీపీ రెడీ అంటుండడంతో పద్మనాభం అడుగులు ఏవిధంగా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.