లోకేష్ కు చంద్రబాబు దిశానిర్దేశం…
అత్యధిక మెజార్టీ సాధించాలన్న బాబు..
గెలిచి గిఫ్ట్ గా ఇస్తానంటున్న లోకేష్…
అంత ఈజీ కాదంటున్న వైసీపీ………..
పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే ఓటమి పాలయ్యాడు తనయుడు. దశాబ్దాల రాజకీయ అనుభవం, అధికారంలో ఉండి కూడా తన కొడుకుని గెలిపించుకోలేకపోయాడనే అపవాదు మూటగట్టుకున్నారు తండ్రి. అందుకే, పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనుకున్నారో ఏమో, రూట్ మ్యాప్ వేసుకున్నారు. వచ్చే ఎన్నికల కోసం రూట్ క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయిన నారా లోకేష్… వచ్చే ఎన్నికల్లో అక్కడ గెలిచి తన తండ్రికి గిఫ్ట్ గా ఇస్తానంటున్నారు. అటు తండ్రి కూడా గెలుపు ఖాయమనే అలసత్వం తగదని పాఠాలు చెబుతూనే… అత్యధిక మెజార్టీతో గెలిచి చరిత్ర తిరగరాయాలి కొడుకా అంటూ దిశా నిర్దేశం చేశారు. మంగళగిరి నియోజకవర్గంపై సమీక్ష సందర్భంగా చంద్రబాబు, తన తనయుడికి పలు సూచనలు చేశారు.
మంగళగిరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు వరుసగా గెలుపొందారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. 2019లో లోకేష్ తన గెలుపు కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేసినప్పటికీ ఆళ్లను ఢీకొట్టలేకపోయారు. ఆ తర్వాత అక్కడ సుడిగాలి పర్యటనలు చేస్తూ దూకుడుగా వెళ్తున్నారు. మంగళగిరి ఇంఛార్జ్ గా ఉన్న లోకేష్ క్షేత్రస్థాయిలో తాను సొంతంగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తండ్రికి వివరించారు. గత పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకోవాలని, నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని వెళ్లాని చంద్రబాబు తనయుడికి హితబోధ చేశారు. ఈ సందర్భంగా, మంగళగిరిలో గత గణాంకాలను తండ్రీ కొడుకొడుకులు బేరీజు వేసుకున్నారు. 1983, 1985 లో మాత్రమే మంగళగిరిలో టీడీపీ గెలిచిన విషయం ప్రస్తావనకు వచ్చింది. పొత్తుల కారణంగా నియోజకవర్గంలో టీడీపీ నష్టపోయిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అటు వైసీపీ అధినాయకత్వం కూడా లోకేష్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల్లో మాదిరే ఈసారి టీడీపీని గట్టిదెబ్బకొట్టేందుకు… లోకేష్ లక్ష్యంగా కొత్త సమీకరణాలతో ఎన్నికలకు సిద్దం అవుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన గంజి చిరంజీవి ఇటీవలే వైసీపీలో చేరారు. పార్టీ చేనేత విభాగానికి ఆయన్ని అధ్యక్షుడిగా జగన్ నియమించారు. ఇది టీడీపీ గట్టి దెబ్బ అనే చెప్పాలి. అయితే, రాజధాని ప్రాంతమున్న నియోజకవర్గం కావడంతో పాటు… సింపతీ కలిసొస్తుందని లోకేష్ లెక్కలు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లోనూ అమరావతి లాజిక్ తో వెళ్లి టీడీపీ బొక్కాబోర్లా పడింది. ఈసారి, ఏమవుతుందో చూడాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో మంగళగిరిలో కేవలం 12 ఓట్ల తేడాతో టీడీపీ ఓటమి పాలైంది. 2019 ఎన్నికల్లో 5వేల ఓట్ల తేడాతో లోకేష్ ఓడిపోయారు. నియోజకవర్గంలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా అక్కడ గట్టిపట్టుదలతో ఉన్నారు.