ఇక్కడ తాడులేదు..వాళ్లకు బొంగరంలేదు..తిప్పేస్తారా!
పాత దోస్తులం..ఒకే తాను ముక్కలం…కలిసిపోతే పోలా!
ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. పవన్‌కల్యాణ్ ఈమధ్య వైసీపీమీద గయ్యిమని లేస్తున్నాడు. చెప్పుతో కొడతానని వార్నింగులిస్తున్నాడు. టూర్లమీద టూర్లేస్తూ జనసైనికులను పోగేస్తున్నాడు. వైసీపీమీద బురదచల్లే విషయంలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. బీజేపీకి కూడా దూరమై తన సైకిలెక్కితే బాగుంటుందని చంద్రబాబు ఆశపడ్డారు. అందుకే ఆ మధ్య హోటల్‌కి వెళ్లిమరీ పవన్‌కల్యాణ్‌కి సంఘీభావం ప్రకటించేశారు. అన్నీ మంచి శకునాలే అనుకుంటున్న సమయంలో వైజాగ్ టూర్‌తో టీడీపీ ఆశలకు మోడీ గండికొట్టారు.
జనసేనాని మద్దతు దొరికితే బీజేపీ కూడా దారికొస్తుంది. మూడుపార్టీల కాంబినేషన్ వచ్చే ఎన్నికల్లో మ్యాజిక్ చేస్తుందని టీడీపీ అధినేత ఎన్నో లెక్కలేసుకున్నారు. కానీ ఒక్క మీటింగ్ కలలసౌధాన్ని కూల్చేసింది. పవన్‌కల్యాణ్ ఆలోచనని మార్చేసింది. దీంతో ఏమి చేయవలె అంటూ మీమాంసలో పడ్డ తెలుగుదేశానికి వామపక్షాలు చీకట్లో చిరుదివ్వెల్లా కనిపిస్తున్నాయి. ఉనికే కనుమరుగవుతుండటంతో లెఫ్ట్ పార్టీలకు కూడా పాత దోస్త్ పెద్ద దిక్కులా కనిపిస్తున్నారు. మునుగోడు ఎన్నికతో తెలంగాణలో టీఆర్‌ఎస్ రూపంలో ఓ ఆసరా దొరికింది. అలాగే ఏపీలో కూడా టీడీపీతో అంటకాగితే ఒకటీ అరా సీట్లు రాకపోతాయా అన్న ఆశతో ఉన్నాయి సీపీఐ, సీపీఎం.
మొదట్లో జనసేనాని వెంట తిరిగారు లెఫ్ట్ నేతలు. పవన్‌కల్యాణ్ వారికి అభినవ చేగువేరాలా కనిపించారు. కానీ పవర్‌స్టార్ ఫ్లవర్‌పార్టీ వైపు మొగ్గటంతో ఆయనపై ఎర్రకండువాలు ఆశలొదిలేసుకున్నాయి. అందుకే ఇప్పుడు వామపక్షాలకు టీడీపీతో చేయి కలపడం తప్ప మరో మార్గం కనిపించడంలేదు. వైసీపీ మరోపార్టీ మద్దతు కోరదన్న విషయం వామపక్షపార్టీలకు అర్ధమైంది. అందుకే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ టీడీపీతో గొంతు కలుపుతున్నాయి. తూచ్ అన్న పవన్‌కల్యాణ్‌ని కూడా టార్గెట్ చేసుకుంటున్నాయి. చంద్రబాబు కోరుకున్నదే వామపక్షాలు చేస్తున్నాయి. టీడీపీ అధినేత ఉక్రోషమే లెఫ్ట్‌పార్టీ నేతల నోటి వెంట బయటికొస్తోంది. ఇక మిగిలిందల్లా టీడీపీ-లెఫ్ట్‌పార్టీల ఉమ్మడి కార్యక్రమాలే. పచ్చజెండా, ఎర్రజెండాలు కలిసి రోడ్డెక్కే రోజు ఎంతో దూరంలో లేదు.