మోడీ వచ్చారు..వెళ్లారు.. ఏపీకి ఏం ఒరిగింది?

By KTV Telugu On 12 November, 2022
image

మెత్తగా ఉంటే మొత్తబుద్దవుతుందని తెలీదా!

ప్రధానివస్తే ప్రసంగంతో కడుపు నింపుకోడమే!

ప్రధాని విశాఖ వచ్చారు. ప్రసంగించారు. స్టేజీమీదున్న ముఖ్యమంత్రి సాక్షిగా జనం చప్పట్లు కొట్టారు. కానీ రాష్ట్రానికి ఒరిగిందేంటి? విభజన తర్వాత ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి కేంద్రంనుంచి చెప్పుకోదగ్గ సాయం లేదు. పైగా అప్పులు చేసి బతికేస్తున్నారంటూ దెప్పిపొడుపులు. అయినా జగన్‌ సర్కారు కేంద్రాన్ని, ప్రధానిని ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి కలిసినా భరోసా లేదు. ప్రధాని తానే స్వయంగా వచ్చినా ఏపీకి ఎలాంటి హామీ ఇవ్వలేదు.

పోలవరం మా బాధ్యతని చెప్పొచ్చు. ఫలానా టైంకల్లా పూర్తిచేస్తామని విశ్వాసం కలిగించవచ్చు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ భవిష్యత్తుకి ప్రధానిగా హామీ ఇవ్వొచ్చు. ఇక ప్రత్యేకహోదా ముగిసిపోయిన అధ్యాయమైనా ఏపీకి అన్నివిధాలా అండగా ఉంటామని చెప్పొచ్చు. అయినా మోడీ పొరపాటున కూడా అలాంటివేమీ చేయలేదు. విప్లవవీరుడి గడ్డని గుర్తుచేసుకున్నారు. విశాఖపట్టణానికి మంచి భవిష్యత్తు ఉంటుందని పైసా ఖర్చులేని మాటలు చెప్పారు. పోనీ రాజధాని విషయంలో సందిగ్ధతకు తెరదించే ప్రయత్నం చేశారా అంటే అదీ లేదు.

ఇక కేంద్రంతో ఏనాడూ కయ్యానికి దిగని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా మోడీ మనసెరిగి మసలుకున్నారు. మీ దయ మా ప్రాప్తమన్నట్లు కొన్ని విన్నపాలను ప్రధాని దృష్టికి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం రాజకీయాలకు అతీతమని చెప్పుకున్నారు. రాష్ట్రాభివృద్ధి తప్ప తమకు మరో ఎజెండా లేదని ఏపీ సీఎం చెప్పుకున్నా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే అయింది. తమరు పెద్దలు పెద్దమనసుతో ఆశీర్వదించాలని అడిగితే ఆల్‌ది బెస్ట్‌ చెబుతారేగానీ నిధులిచ్చేంత పెద్దమనసు ఎక్కడుందని! తెలంగాణలో మోదీకి గోబ్యాక్‌ ఫ్లెక్సీలు. నల్లబెలూన్ల నిరసనలు. అలాంటివేమీ లేకుండా మర్యాదిచ్చిన ఏపీకి నేనున్నాననే భరోసా ఇస్తే మోడీ ముల్లె ఏమన్నా కరిగిపోతుందా?