శిష్యుల పోటీలో విజేతలెవ్వరో

By KTV Telugu On 22 November, 2022
image

ఏపీ రాజకీయాలు విచిత్రంగా మారాయా. వైసీపీ, టీడీపీ అన్నట్లుగా కాకుండా ఇప్పుడు రిషి రాజ్ వర్సెస్ రాబిన్ శర్మ అని చెప్పుకోవాల్సి వస్తోంది . పోటీ పార్టీల మధ్య ఉంటుందా. వ్యూహకర్తల మధ్య కొనసాగుతుందా. అసలు ఏమిటీ విచిత్రం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్న పీకే శిష్యులు
జగన్ కోసం ఐ-ప్యాక్ వ్యూహాలు
ఐ – ప్యాక్ పట్ల జగన్ కు పూర్తి విశ్వాసం
నియోజకవర్గాల్లో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న రిషి రాజ్ టీమ్
గడప గడపకు కార్యక్రమ రూపకర్త రిషి రాజ్
టిడీపీ సమావేశంలో రాబిన్ శర్మను పరిచయం చేసిన చంద్రబాబు
వైసీపీ గురించి అన్నీ తెలిసిన రాబిన్ శర్మ
షో టైమ్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు రాబిన్ శర్మ
ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి అనే కొత్త కార్యక్రమం
రాబిన్ శర్మ దగ్గర ఇంకెన్ని వ్యూహాలు ఉన్నాయో.

2019 ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన ఐ-ప్యాక్ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తప్పుకున్నారు. జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టాలని ప్రయత్నించి చేయి కాల్చుకున్న ఆయన బిహార్ లో పాదయాత్ర చేసుకుంటున్నారు. జగన్ రెడ్డి తరపున పని చేయడంతో టైమ్ వేస్ట్ అయ్యిందని కూడా ఆయన ఈ మధ్యనే ఒక డైలాగ్ వదిలారు. అదంతా ఒక కోణం. ఇప్పుడు పీకే శిష్యులే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించడం అసలు కోణం.

ఎంత అసంతృప్తి ఉన్నా వైసీపీని ప్రశాంత్ కిషోర్ వదిలి పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తన పట్టు ఉండి తీరాల్సిందేననుకున్నారు. దక్షిణాదిలో ఐ – ప్యాక్ బాధ్యతలు తన అనుచరుడు రిషి రాజ్ సింఘ్ కు అప్పగించారు. ఇప్పుడు జగన్ రెడ్డికి రిషి రాజ్ సింఘ్ చాలా కావాల్సిన వ్యూహకర్త. 2019లో తనను గెలిపించిన ఐ – ప్యాక్ అంటే ఎక్కడ లేని గురి ఆయనకు. అందుకే ఐ – ప్యాక్ ఏది అడిగితే జగన్ రెడ్డి అది ఇచ్చేస్తున్నారు. జగన్ అభ్యర్థనతో రిషి రాజ్ బృందం రోజు వారీగా క్షేత్ర స్థాయిలో పనిచేస్తోంది. ప్రతీ నియోజకవర్గంలో ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. ఎమ్మెల్యేల పట్ల, వైసీపీ నేతల పట్ల స్థానిక ప్రజల అభిప్రాయాలను సేకరిస్తోంది. నిజానికి గడప గడపకు కార్యక్రమ రూపకల్పన చేసింది రిషి రాజ్ సింఘేనన్నది మరిచిపోకూడదు. జనం నిరసన వ్యక్తం చేసినా వెనుకాడకుండా గడప గడపకు వెళ్లాలని రిషి రాజ్ సూచించారు. పైగా ఐ ప్యాక్ టీమ్ ఇప్పుడు ప్రతీ ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల తీరు, జనానికి వాటితో కలిగే ప్రయోజనాలపై నివేదికలు రూపొందిస్తోంది.

కట్ చేసి చూస్తే టీడీపీ తరపున వ్యూహాలు రచిస్తున్నది కూడా ప్రశాంత్ కిషోర్ శిష్యుడే కావడం విశేషం. ఆ సంగతిని చంద్రబాబు అధికారికంగా ప్రకటిస్తూ టీడీపీ సర్వసభ్య సమావేశంలో రాబిన్ శర్మను పరిచయం చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ కు పనిచేసిన పీకే టీమ్ లో రాబిన్ శర్మ కీలక వ్యక్తి కావడంతో వైసీపీ గురించిన మంచి, చెడు రెండూ ఆయనకు తెలుసు. పీకే బృందం నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంతంగా షో టైమ్ కన్సల్టెన్సీ అనే సంస్థను ఏర్పా టు చేసుకొని వివిధ పార్టీలకు పనిచేస్తున్నారు. కొంతకాలం కిందట టీడీపీ నాయకత్వం సునీల్‌ కనుగోలు అనే మరో వ్యూహకర్తను కూడా నియమించుకుంది. అయితే సునీల్‌కు ఏపీ పై వ్యక్తిగతంగా దృష్టి కేంద్రీకరించే సమయం లేకపోవడంతో టీడీపీ ఆయనను పక్కన పెట్టింది. రాబిన్ ఇప్పుడు టీడీపీ కోసం పూర్తి స్తాయిలో పనిచేస్తున్నారు. బాదుడే బాదుడు తరహాలో ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని రూపొందించారు. దీనిలో భాగంగా టీడీపీ నేతలంతా డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఇంటింటికి వెళతారు. జగన్ రాకముందు రాష్ట్రం ఎలా ఉంది. ఇప్పుడు ఎలా ఉందో ప్రతీ ఒక్కరికీ వివరిస్తారు. జనాన్ని తాకట్టు పెట్టి జగన్ లక్ష కోట్లు అప్పు చేశారని చెబుతారు. ఓటర్లను టీడీపీ వైపుకు తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల లోపు రాబిన్ శర్మ అమ్ముల పొది నుంచి ఇలాంటి అస్త్రాలు చాలానే వస్తాయని భావిస్తున్నారు.

రిషి రాజ్, రాబిన్ శర్మ ఇద్దరూ ఒకే స్కూల్ నుంచి వచ్చిన వ్యూహకర్తలు. ఎన్నికల నాటికి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.