షాకింగ్ న్యూస్..షేకింగ్ న్యూస్.. జనానికే కాదు పార్టీ కేడర్‌కి కూడా.
నిజమేనా అని నేతలు గిల్లి చూసుకుంటున్నారు.
ఇంతకీ ఆ బ్రేకింగ్ బ్లాస్టింగ్ న్యూసేంటో తెలుసా..
నారా లోకేష్ పాదయాత్ర. నిజం..నిజమంటే నిజం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వారసుడు రోడ్డెక్కబోతున్నాడు. తను కూడా పాదయాత్రతో ఫ్యాట్ ఏదన్నా మిగిలి ఉంటే కరిగించుకోబోతున్నాడు. వచ్చేది ఎన్నికల సీజన్. దీంతో జనంలోకి వెళ్లేందుకు నేతలంతా లెఫ్ట్ అండ్ రైట్ అంటున్నారు. ఇప్పటికే కన్యాకుమారి నుంచి మొదలుపెట్టిన రాహుల్‌గాంధీ పాదయాత్ర చచ్చుబడ్డ కాంగ్రెస్ నరాల్లో కొంత ఉత్సాహం నింపుతోంది. ఇప్పుడు లోకేష్ నేను సైతమంటున్నాడు.
రాహుల్‌గాంధీకి నారా లోకేష్నీ పోల్చలేంగానీ ఇద్దరూ రాజకీయ వారసులే. సముద్రమంత పార్టీని నేను ఈదలేనంటూ చేతులెత్తేసిన రాహుల్‌గాంధీ చివరి ప్రయత్నంగా పాదయాత్ర ప్రారంభించారు. పెత్తనం కాదు తనకు పార్టీ భవిష్యత్తే ముఖ్యమనే సంకేతాలిస్తూ ముందుకు సాగుతున్నారు. పప్పు, మొద్దబ్బాయ్ (ప్రత్యర్థులు పెట్టిన ముద్దుపేర్లు) ముద్రనుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నారావారి వారసుడు తను కూడా ఈ ట్రెండ్‌నే నమ్ముకున్నట్లున్నారు. ఇప్పుడు మొదలుపెడితే ఎన్నికలనాటికి రాష్ట్రాన్ని చుట్టేయొచ్చనుకుంటున్నారు. తండ్రిచాటు బిడ్డగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఈమధ్య తనను తాను నిరూపించుకునే పనిలో ఉన్న లోకేష్ పాదయాత్రతో రాజకీయ భవిష్యత్తు అటోఇటో తేలిపోతుందని డిసైడ్ అయినట్లున్నారు.
నారా లోకేష్ ప్రస్తుతం తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. కొంతకాలంగా ఆయన పాదయాత్ర చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రచారం కాదు నిజమేనంటూ కాళ్లకు షూస్ వేసుకుంటున్నారు చంద్రబాబు వారసుడు. డేట్ ఫిక్స్ చేసుకున్నారు. 2023 జనవరి 27న పాదయాత్రకు లోకేష్ శ్రీకారం చుట్టబోతున్నారు. తండ్రి ప్రాతినిధ్యం వహించే కుప్పం నుంచి ఇచ్ఛాపురం దాకా లోకేష్ పాదయాత్ర సాగబోతోంది. ఏడాదిపాటు జనంలోనే ఉండేలా నారా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ రెడీ అయింది. నిరుద్యోగం, యువత సమస్యలే ప్రధాన అంశాలుగా నారా లోకేష్ యాత్ర సాగుతుందని చెబుతున్నారు. మహిళలు, రైతుల సమస్యలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళిక రూపొందించనున్నారు.
ప్రతీ ఎన్నికలకు ముందు ఎవరో ఒకరు పాదయాత్రలు చేయడం పరిపాటిగా మారింది. ఒకప్పుడు వైఎస్ ఈ పాదయాత్రతోనే కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకొచ్చారు. తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డికి పాదయాత్రే ప్లస్ పాయింట్ అయింది. జాతీయస్థాయిలో రాహుల్ పాదయాత్ర ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దీంతో జనంలోకి వెళ్లేందుకు, రాజకీయంగా బలపడేందుకు వాకింగ్‌కి మించిన మంచి రూటు మరోటి లేదనుకున్నారు లోకేష్ కూడా. ఏడుపదుల వయసులో తండ్రి నడవడం కష్టంకాబట్టి ఆ బాధ్యతని తన భుజాలకెత్తుకున్నారు. టీడీపీని అధికారంలోకి తీసుకురాగలుగుతారా లేదా అన్నది తర్వాత. రాజకీయంగా మరింత రాటుదేలటానికి లోకేష్‌కి ఈ పాదయాత్ర పనికొస్తుందని మాత్రం చెప్పొచ్చు.