యనమల ఇక సర్దుకోవాల్సిందేనా.!
మూడు దఫాలుగా తునిలో ఓటమి
నో టికెట్ అంటోన్న టీడీపీ అధినాయకత్వం?
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా టీడీపీ అధినేత చంద్రబాబు తమ్ముళ్లను సమాయత్తం చేస్తున్నారు. నియోజకవర్గాల స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్న బాబు, వచ్చే ఎన్నికల్లో వారసులకు ఎక్కువ శాతం టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే, సీనియర్ నేత, తనకు అత్యంత ఆప్తుడైన యనమల కుటుంబానికి బాబు గట్టి షాక్ ఇవ్వనున్నారనే ప్రచారం పార్టీలో జోరుగా జరుగుతోంది. యనమల కుటుంబాన్ని దూరం పెట్టాలన్న యోచనలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. యనమల కుటుంబం మూడు దఫాలుగా తుని నియోజకవర్గంలో ఓటమి పాలు అవుతూ వస్తుంది. దాంతో, వచ్చే ఎన్నికల్లో యనమల కుటుంబానికి టికెట్ ఇవ్వకూడదనే ఆలోచనలో ఉందట అధిష్టానం.
1984 నుంచి వరుసగా ఆరుసార్లు గెలిచిన యనమల…2009లో తొలిసారి ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన చట్టసభల్లో కొనసాగుతూ వచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో యనమల సోదరుడు కృష్ణుడు కూడా రెండుసార్లు ఓడిపోయారు. దాంతో, యనమల కుటుంబం వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువని లోకేష్ భావిస్తున్నారట. పైగా, తునిలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న దాడిశెట్టి రాజా మంత్రి అయ్యారు. దీంతో, నియోజకవర్గంలో యనమల పట్టు క్రమంగా తగ్గిపోతుందన్న వార్తలు వస్తున్నాయి. రాజాను ఎదుర్కొనేందుకు మరో వ్యక్తిని రంగంలోకి దింపాలని లోకేష్ భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెకు కాకినాడ రూరల్ ఇవ్వాలని యనమల కోరగా…అటువైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదట. ఆ ప్రతిపాదనను కూడా లోకేష్ తిరస్కరించారని తెలుస్తోంది. కుటుంబంలో రెండు, మూడు సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని… అలాగే, వరుసగా రెండు సార్లు ఓడిన వారిని కూడా పక్కన పెడతామంటూ మహానాడులో లోకేష్ ప్రకటించారు. లోకేష్ ప్రకటన యనమలకు అడ్డంకిగా మారింది.
యనమల ప్రతిపాదనను లోకేష్ తిరస్కరించడానికి మరో కారణం కూడా ఉందట. గతంలో తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యనమల గ్రూపు రాజకీయాల కారణంగా జిల్లాలో పార్టీ ఓడిపోతుందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పార్టీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. ఆయన నుంచి కూడా యనమల వైఖరిపై పలుమార్లు హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయి. ఇక, పార్టీలో బీసీ వర్గానికి చెందిన నేతలు కూడా భారీసంఖ్యలో ఉన్నారని, ఆ కోణంలో కూడా యనమల నుంచి పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏదీ లేదనే భావనతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే, యనమల ఫ్యామిలీకి ఈసారి ఎక్కడా టిక్కెట్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది.