వైసీపీ మాజీ ఎంపీ, బాపట్ల నియోజకవర్గానికి నిన్నటి ప్రతినిధి నందిగం సురేష్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ మీయాపూర్‌లో ఉన్నట్లు గుర్తించి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. సురేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలోనే ఆయన్ను మంగళగిరి పోలీసులు అరెస్టు చేసి రాష్ట్రానికి తరలించారు. తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు భావిస్తున్నప్పటికీ సురేష్ పై మరిన్ని కేసులున్నట్లుగా చెబుతున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ కూడా నిందితుడు కావడంతో తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నందిగం సురేష్‌ను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి పోలీసులు వెళ్లగా.. ఆయన ఇంట్లో లేరని అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మొత్తానికి పక్కా సమాచారంతో హైదరాబాద్‌లో నందిగం సురేష్‌ను అరెస్ట్ చేయడం జరిగింది. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన్ను ట్రేసవుట్ చేశారు.
టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో మాజీ జోగి రమేష్, దేనినేని అవినాష్, అప్పిరెడ్డి, సురేష్, తలశిల రఘురాం సహా 14 మంది నిందితులుగా ఉన్నారు. జోగి రమేష్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి వ్యవహారంలో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అధికారాన్ని వినియోగించి కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా పిటిషనర్లు గత మూడేళ్లుగా దర్యాప్తు అధికారులను ప్రభావితం చేశారని, ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తులో పురోగతి సాధ్యపడదని ప్రాసిక్యూషన్ తరఫు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ చేసిన వాదనలతో ఏకీభవించింది. కాల్ రికార్డు, ఇతర సాంకేతిక ఆధారాలు సేకరించాల్సి ఉందని, పిటిషనర్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వారిని కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందన్న పోలీసుల వాదనను సమర్ధించింది. పిటిషనర్లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ బుధవారం తీర్పు ఇచ్చారు. తీర్పు వెల్లడించిన అనంతరం పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు పి.వీరారెడ్డి, ఎల్ రవిచందర్ స్పందిస్తూ.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు ఆశ్రయించేందుకు వీలుగా రెండువారాల పాటు పిటిషనర్లకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆ పిటిషన్ ను సైతం కోర్టు తోసిపుచ్చడంతో తొట్టతొలిగా నందిగం సురేష్ ను అరెస్టు చేశారు.
అంతం కాదిది ఆరంభం అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. వైసీపీ హయాంలో చేసిన అరాచకాలకు సమాధానం చెప్పుకునే రోజు వచ్చిందని వారంటున్నారు. వేధించిన ఎవ్వరినీ వదిలిపెట్టబోమని చెబుతున్నారు. నందిగం సురేష్, జోగి రమేష్ లాంటి వారు జగన్ కు ఆయన కుటుంబానికి చాలా క్లోజ్ అని చెప్పక తప్పదు.నాటి ఘటనలు అన్ని జగన్ కు తెలిసే, ఆయనకు చెప్పే చేశారని టీడీపీ నమ్ముతోంది. దాడులు చేయించి జగన్ ఆటవిక ఆనందం పొందారని టీడీపీ ఆగ్రహంతో ఉంది. దాడులను వారించేందుకు ఆయన ఎలాంటి ప్రయత్నమూ చేయలేదని, టీడీపీ శ్రేణులు ఇబ్బంది పడుతుంటే ఎంజాయ్ చేశారని వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే దాడులకు, జగన్ కు ఉన్న లింకును బయటకు తీసేందుకు వారు కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు నందిగం సురేష్ అరెస్టు, తర్వాత మరికొద్ది మందిని అదుపులోకి తీసుకోవడం ద్వారా వారిని ప్రశ్నిస్తే జరిగిన కుట్ర మొత్తం బయటకు వస్తుందని ఎదురుచూస్తున్నారు. మరి ప్రభుత్వం పెట్టుకున్న షెడ్యూల్ ఏమిటో చూడాలి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…