జగన్ ఎందుకలా చేస్తున్నారు . ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జగన్ పోతున్నారా. ఆ సంగతి ఆయనకు తెలియదా. ఫ్రస్టేషన్లో అలా చేస్తున్నారా. ప్రతిపక్ష నేతలను జైలుకు పంపాలన్న కోరిక,పట్టుదల ఎందుకు వస్తోంది. పైగా కులాల కుమ్మాలటకు సైతం ఆయన తెరతీశారా….
ఇవ్వాళ చంద్రబాబు అరెస్టు. రేపు ఎవ్వరు? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఒక్కరి నోట వస్తున్న ప్రశ్న ఇదే. ప్రజాభిప్రాయం తనకు వ్యతిరేకంగా ఉందని అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్.. అక్కసు మొత్తాన్ని విపక్షాలపై చూపే ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. పాలన చేతగాక రాష్ట్రాన్ని అథోగతిపాలు చేసిన జగన్మోహన్ రెడ్డి… డైవర్షన్ కోసం కూడా విపరీత చేష్టలకు దిగుతున్నారనిపిస్తోంది. త్వరలో లోకేష్ అరెస్టు కావడం ఖాయమనిపిస్తున్న వేళ.. ఏదోక కేసు పెట్టి టీడీపీలో మరికొందరిని కూడా జైలుకు పంపడం ఖాయంగా కనిపిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారో ఆయనకైనా అర్థమవుతుందా అన్నది మొదటి ప్రశ్న. పాలన గాలికి వదిలేసి పగసాధింపుకు దిగడం ఆయనకే చెల్లిందన్నది ఆ ప్రశ్నకు సమాధానం. ఉద్యోగులకు ఒకటో తేదీన ఠంచనగా జీతాలు ఇచ్చే రాష్ట్రం ఇప్పుడిలా అయిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డేనని కోట్ల వేళ్లు ఆయన వైపు చూపిస్తున్నాయి. ఐనా జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం మారడం లేదు. తనకు దగ్గరుండి ఓట్లేయించిన టీచర్లు, ఉద్యోగులకే ఆయన పంగనామం పెట్టారు.దానితో వారిలో ఆయన పట్ల వ్యతిరేకత పెరిగింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదు…సర్దుకోమని చెప్పి రాజీమార్గంలో వారిని దారికి తెచ్చుకోవాల్సిన తరుణంలో ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నించి పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఉద్యోగులు,టీచర్లే కాదు అన్ని వర్గాలను ఆయన దూరం చేసుకున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత కట్ చేసి చూస్తే ఇప్పుడు తప్పులను సరిదిద్దుకోలేక కొత్త తప్పులు చేస్తున్నారు.
పూట గడవటం కష్టంగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పక తప్పదు. ప్రతీ మంగళవారం కొత్త అప్పుకు వెళ్లి జీతాలు, పెన్షన్లకు ఏర్పాటు చేసుకోవాల్సిందే. బాండ్ల వేలంతో దశాబ్దాల పాటు తీర్చలేని అప్పులు తెస్తున్నారు. ప్రస్తుతం ఏపీ అప్పు 11 లక్షల కోట్లకు చేరుతున్న తరుణంలో ఏదోక రోజున కొత్త అప్పు పుట్టని పరిస్థితి వస్తుందని తెలిసిన జగన్ అండ్ కో.. ఇప్పుడే డైవర్షన్ గేమ్ కు తెరతీసింది. సమస్యలను జనం మరిచిపోవాలంటే కొత్త సమస్యలు సృష్టించాలన్న ఫార్ములాను జగన్ ఫాలో అవుతున్నారు. పైగా తనను ఓడించడానికి ఏపీ జనం సిద్ధంగా ఉన్నారని తెలుసుకున్న జగన్… సమస్యల నుంచి వారి దృష్టి మళ్లిస్తే కొంతైనా ప్రయోజనం ఉంటుందన్న ఆశతో అరెస్టుల గేమ్ కు తెరతీశారు.
జనం గత్యంతరం లేని పరిస్థితుల్లో తనకు ఓటెయ్యాలన్నది జగన్ ఆలోచనా విధానం కావచ్చు. అందుకే ప్రతిపక్షాన్ని గట్టి దెబ్బలు కొడుతూ వారిని బలహీన పరచాలన్న ఐడియాతోనే చంద్రబాబును అరెస్టు చేశారు. తొట్టతొలిగా పెట్టిన స్కిల్ డెవలమ్మెంట్ కేసు వీగిపోతుందన్న ఆలోచనతో చంద్రబాబుపై వరుస కేసులకు శ్రీకారం చుట్టారు. టీడీపీ అధినేతను వరుస కేసుల్లో ఇరికించి ఉక్కిరిబిక్కిరి చేయాలని జగన్ చూస్తున్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ ను కూడా జనంలో తిరగకుండా, జనాభిప్రాయం ఆయన వైపుకు మళ్లకుండా చూసేందుకు త్వరలో లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారని తెలుస్తోంది. ఈ విషయం టీడీపీ వాళ్లే స్వయంగా అంగీకరిస్తున్నారు. లోకేష్ జైలుకు వెళితే నారా బ్రాహ్మణిని ముందు పెట్టి పార్టీని నడిపించుకుంటామని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చెప్పడం కూడా జగన్ చేయబోయే అరాచకానికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పాలి. జగన్ చాలా మందిని అరెస్టు చేయబోతున్నారని టీడీపీ నేతల్లోనే టాక్
జగన్ ఫ్రస్టేషన్ ఫైనల్ స్టేజీకి చేరిందని కూడా అనుకోవచ్చు. చంద్రబాబు కులాన్ని పూర్తిగా తొక్కేయ్యాలని ఒకప్పుడు గౌతం అదానీ దగ్గర ప్రస్తావించి భంగపడిన జగన్…మళ్లీ ఇప్పుడు అదే తప్పుచేస్తున్నారు. పైగా కులం వర్సెస్ కులం అన్నట్లుగా నాటకాలు ఆడుతున్నారు. చంద్రబాబు కులపిచ్చితోనే రాష్ట్రం అథోగతిపాలైందని ప్రచారం చేయడం ఒక వంతు అయితే ఆయన కులస్థులైన కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారితో తిట్టించడం అరాచకానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. పైగా జగన్ కు ఒక ధైర్యం ఉందని చెబుతారు. పరిమితికి మించి అప్పులిస్తున్న కేంద్రం అన్ని విషయాల్లో తనకు సహకారం అందిస్తుందని ఎదురు చూస్తున్నారు. ప్రధాని మోదీకి, చంద్రబాబుకు పడదు కాబట్టి టీడీపీ అధినేతను దెబ్బకొట్టేందుకు బీజేపీ అగ్రనేత ఎంత సాయమైనా చేస్తారని విశ్వసిస్తున్నారు. అది నిజం కాకపోవచ్చు.
చంద్రబాబు అరెస్టుతో టీడీపీకి సానుభూతి పెరుగుతుందని జగన్ కు తెలియనిది కాదు. తాజాగా సీ-ఓటర్ సర్వే కూడా అదే చెప్పింది. చంద్రబాబుకు సానుభూతి పెరిగిందని తేల్చడంతో పాటు జగన్ పట్ల వ్యతిరేకత టన్నుల కొద్దీ పోగయ్యిందని సీ ఓటర్ సర్వే నిగ్గు తేల్చింది. టీడీపీ సానుభూతిపరులే కాకుండా ఇతర పార్టీల సానుభూతి పరులు కూడా చంద్రబాబు పట్ల సానుకూలతగా ఉన్నారని సర్వే చెబుతోంది. పైగా వైసీపీ సానుభూతిపరులు సైతం చంద్రబాబు పట్ల పాజిటివ్ గా ఆలోచిస్తున్నారట. ఐనా జగన్ తీరు మారదు. ఆయన మొండితనం వదలడు. తాను 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఇతరులు మాత్రం జైలు ఊచలు లెక్కపెట్టకుండా ఉంటే ఎలా అన్నట్లుగా జగన్ ప్రవర్తిస్తున్నారు. జైలు విషయంలో అందరూ సమానులే అన్నట్లుగా జగన్ ప్రవర్తిస్తున్నారు..
జగన్ ఓటమి అంచున ఉన్నారని ఇప్పటికిప్పుడు జరిగిన సర్వేలు కూడా తేల్చేశాయంటే ప్రజల్లో వ్యతిరేకత ఎంతగా పెరిగిపోయిందో తెలుసుకోవచ్చు. అప్పుడెప్పుడో మోదీ భుజం తట్టారు కదా అని రెచ్చిపోవడం జగన్ కే చెల్లింది. వ్యాపారలకు, పగలు ప్రతీకారాలకు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రాష్ట్రాన్ని నేలబారుకు తీసుకొస్తున్నారు.జనం లేకపోయినా, వచ్చిన జనం వెంటనే వెళ్లిపోతున్నా అధికార మీటింగులు, ప్రచార పటాటోపాలాకు మాత్రం కొదవ లేదని చెప్పాల్సింది. మరి జగన్ మారతారని ఎవరైనా అనుకుంటే పొరబాటే అవుతుందేమో