తెలంగాణలో టీడీపీకి మహర్దశ ఖాయమా

By KTV Telugu On 9 October, 2024
image

KTV TELUGU :-

పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలన్నది కొన్ని జూదాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ గా చెప్పుకోవాలి. రాజకీయం కూడా జూదమే కావడంతో నేతలు … పోగొట్టుకున్న చోటే వెదుక్కునే పనిలో ఉంటారు. పైగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు ఒకదానితో మరోకటి లింకు ఉండటంతో ఇక్కడైతే అక్కడ, అక్కడైతే ఇక్కడ కూడా అన్నట్లుగా పార్టీల తీరు మారుతుంటుంది.అన్ని పార్టీలు టూ స్టేట్స్ ఫిలాసఫీని పాటిస్తుంటాయి. బీఆర్ఎస్ ఏర్పడిన కొత్తల్లో ఏపీపైనా కేసీఆర్ దృష్టిపెట్టిన సంగతి అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. తర్వాత ఖంగుతిన్న మాట వాస్తవమనుకోండి. ఇప్పుడు తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆచి తూచి ఆలోచించి.. వెనుకాముందు చూసుకుని తెలంగాణలోకి మళ్లీ గట్టిగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంట్రీ ఇవ్వడం అంటే ఇప్పుడు అక్కడ పార్టీ అసలు లేదని చెప్పకూడదు. నిద్రాణంగా పడున్న కేడర్ ను తట్టిలేపి.. మనం సైతం తెలంగాణలో అధికారానికి వచ్చే అవకాశం ఉందని విశ్వసించేందుకు అవసరమైన చర్యలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారనుకోవాలి…

ఏపీలో తిరుగులేని విజయం సాధించిన తర్వాత చంద్రబాబు తెలంగాణపై కూడా ఒక కన్నేశారు. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇతర పార్టీల్లో అసంతృప్తులెవ్వరైనా టీడీపీ వైపు చూస్తున్నారా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లాలని ప్రయత్నించి విఫలమైన వారు పిలిచీ పిలవకముందే టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందా అని ఆయన తమ నేతలను ప్రశ్నించారు. ఆయన ఆలోచన అన్ని విధాలుగా నిజమైంది. ఒకప్పుడు టీడీపీలో చక్రం తిప్పి…ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉంటున్న వాళ్లు మళ్లీ పచ్చచొక్కా తొడుక్కునేందుకు రెడీ అవుతున్నారని ఆయన తెలిసింది. అంతే వారికి ఎర్రతివాచీ పరిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే అయిన విద్యా సంస్థల అధినేత చేమకూర మల్లారెడ్డి, స్వయాన ఆయన అల్లుడైన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసి చంద్రబాబుతో భేటీ కావడం ఏపీ సీఎం చాణక్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మర్రి ఇంట వివాహ ఆహ్వానం అందించేందుకు వచ్చినట్లుగా పైకి చెబుతున్నా.. అదే స్వకార్యం అయినా..ఎప్పుడోకప్పుడు మీకు వీలైనప్పుడు మమ్మల్ని టీడీపీలోకి చేర్చుకోండి మహాప్రభో అని వేడుకోవడం అసలు కారణం. పైగా ఈ మామా అల్లుళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించి విఫలమై తలబొప్పి కట్టించుకున్నారు. ఇక టీడీపీలోనే ఉంటూ తర్వాత పార్టీ మారిన హైదరాబాద్ మాజీ మేయర్ తీగెల కృష్టారెడ్డి ఇప్పుడు చంద్రబాబుతో భేటీ అయి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయగా… అధినేత పచ్చజెండా ఊపడం కూడా జరిగిపోయింది…టీడీపీలో చేరాలనుకోవడానికి కారణం బీజేపీ అని కూడా చెప్పుకోవాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం.. ఎన్డీయే కూటమిలో టీడీపీ కీలక పాత్ర పోషించడంతో సైకిలెక్కితే తమకు కూడా ప్రయోజనమేనని, కేసుల భయం ఉండదని నేతలు నమ్ముతున్నారు….

టీడీపీలో చేరేవారి ఆశ‌, అభిలాషలు చాలానే ఉన్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ కావ‌డంతో తెలం గాణ‌లో త‌మ‌కు, త‌మ వ్యాపారాల‌కు ఇబ్బందులు లేకుండా ముందుకు సాగేందుకు అవ‌కాశం ఉంటుందన్న ఆశ ఒక‌టి. పార్టీ ప‌రంగా రాజ‌కీయాల ప‌రంగా టీడీపీలో చాలా అవ‌కాశాలు ఉన్నాయి. పైగా సానుభూతి ప‌వ‌నాలు కూడా టీడీపీకి ఎక్కువ‌గానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీలోకి చేర‌డం ద్వారా.. త‌మ‌కు ఒక బ‌ల‌మైన అండ ల‌భిస్తుంద‌న్న ఉద్దేశం క‌నిపిస్తోంది. ఇక‌, బ‌ల‌మైన నాయ‌కులుగా పేరున్న వారు, ఆర్థికంగా ఖ‌ర్చు పెట్ట‌గ‌ల నాయ‌కులు కావ‌డంతో టీడీపీకి మేలు చేకూరుతుంద‌న్న అంచ‌నాలు కూడా వ‌స్తున్నాయి.

అధికారం దూరమైనా.. కేడర్ బలంతో తెలంగాణలో నడుస్తున్న టీడీపీకి పాతవారి పునరాగమనంతో ఇంతకాలం శాశ్వతంగా ఉన్న వారు అసంతృప్తి చెందకుండా చూసుకుంటానని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహులు కొనసాగుతుండగా, సీనియర్ నేతలు రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షులుగా, కార్యదర్శులుగా పని చేస్తున్నారు. వారు సైతం పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఊహించని విధంగా తీగల కృష్ణారెడ్డి.. చంద్రబాబుతో భేటీ కావడం, అధ్యక్ష పదవి ఇస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో సీనియర్ నేతలంతా అసంతృప్తికి గురవుతున్నారు. కష్టపడి పని చేస్తున్న తమను కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారు నిరాశ చెందకుండా తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఏదేమైనా ఈ సారి రాష్ట్రంలో పార్టీని గట్టిగా నిలబెట్టే చర్యలే చేపడుతున్నారని చెప్పక తప్పదు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి