నాడు వెలిగారు..నేడు అలిగారు || TDP

By KTV Telugu On 25 March, 2024
image

KTV TELUGU :-

సీనియర్ నేతలకు  వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు. ఒకప్పటి తన మంత్రి వర్గ సహచరులు పార్టీలో సీనియర్ నేతలు అయిన వారికి  మొదటి మూడు జాబితాల్లోనూ టికెట్ కేటాయించలేదు. ఇక అయిదు అసెంబ్లీ  స్థానాలు నాలుగు లోక్ సభ స్థానాలు  మాత్రమే ప్రకటించాల్సి ఉంది. చంద్రబాబు వైఖరిపై సీనియర్లు మండిపడుతున్నారు. వలస నేతలకు ఆగమేఘాల మీద టికెట్లు ఇస్తోన్న బాబు పార్టీ కోసం కష్టపడ్డవారిని పక్కన పెట్టడం దుర్మార్గమే అంటున్నారు వారు.

175 అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ 144 స్థానాల  నుండి పోటీ చేస్తోంది. 31 అసెంబ్లీ స్థానాలను పొత్తులో భాగంగా బిజెపి-జనసేనలకు కేటాయించింది. 144 నియోజక వర్గాల్లో మొదటి జాబితాలో 94 మంది అభ్యర్ధులను రెండో జాబితాలో 34 మందిని  ఎంపిక చేసిన చంద్రబాబు నాయుడు మూడోజాబితాలో  11 మంది ఎమ్మెల్యే అభ్యర్ధుల పేర్లు ప్రకటించారు. 139 నియోజక వర్గాలకు అభ్యర్ధులను ప్రకటించగా ఇక మిగిలినవి అయిదు స్థానాలు మాత్రమే. కానీ  పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ వారి జాబితా దీనికంటే పెద్దదే. చివరి జాబితాలో ఈ సీనియర్లలో ఎవరికైనా చోటు దక్కుతుందా లేదా అన్నది చెప్పలేం.వాడుకుని వదిలేయడం తమనాయకుడికి అలవాటే అంటున్నారు టికెట్ కోసం నిరీక్షిస్తోన్న నేతలు.

చంద్రబాబు కేబినెట్ లో  కీలక పదవులు అనుభవించిన  దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు,కళా వెంకట్రావు,బండారు సత్యనారాయణ,ఆలపాటి రాజేంద్ర ప్రసాద్,కె.ఎస్. జవహర్, పీతల సుజాత, కిడారి శ్రావణ్ లతో పాటు హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు లోక్ సభ స్థానం కేటాయించలేదు. బాబు కేబినెట్ లో నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించిన దేవినేని ఉమ గత ఎన్నికల్లో మైలవరం నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఈ సారి కూడా అక్కడినుండే పోటీ చేయాలని ఆశించారు. గత ఎన్నికల్లో దేవినేనని ఓడించిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్  నేత వసంత కృష్ణ ప్రసాద్  కొద్ది రోజుల క్రితమే టిడిపిలో చేరారు. అలా వలస వచ్చిన నేతకోసం దేవినేనిని బలిచ్చారు చంద్రబాబు. వసంత కృష్ణ ప్రసాద్ వందకోట్ల రూపాయలు చదివించుకుని సీటు కొనుక్కున్నారని దేవినేని వర్గీయులు మండి పడుతున్నారు.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో అభ్యర్ధుల నియోజక వర్గాలను మార్చడాన్ని ఉద్దేశించి  ఒక చోట పనికిరాని వారు నియోజక వర్గం మారితే బంగారం అయిపోతారా అని చంద్రబాబు అన్నారు.  ఇపుడు ఇదే ప్రశ్నను టిడిపి నేతలు చంద్రబాబుకు సంధిస్తున్నారు. వైఎస్.ఆర్.కాంగ్రెస్ కు పనికిరాని వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారగానే  బంగారం అయిపోయారా? అని దేవినేని అనుచరులు నిలదీస్తున్నారు.మరో సీనియర్ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రతీ ఎన్నికలోనూ నియోజక వర్గం మారుస్తూ ఉంటారు. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుండి గెలిచారు. ఈ సారి భీమిలి నియోజక వర్గం ఆశించారు. అయితే భీమిలి సీటును జనసేనకు కేటాయించారు చంద్రబాబు.

గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు. అయితే ఆనియోజక వర్గానికి వెళ్లే ప్రసక్తి లేదని గంటా తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలో మూడు జాబితాల్లోనూ గంటా కు ఎక్కడా సీటు ఇవ్వలేదు చంద్రబాబు. గంటాకు ఈ సారి టికెట్  దక్కడం గగనమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడైన తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు భంగపాటు తప్పలేదు. ఆలపాటి సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించేశారు చంద్రబాబు. దీంతో ఆలపాటి నిరాశలో ఉన్నారు. పార్టీ నాయకత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తెనాలి సీటు పోయినా తనకు  వేరే నియోజక వర్గాన్ని కేటాయిస్తారని ఆలపాటి ఆశపడ్డారు. పెనమలూరు అయినా ఇస్తారని అనుకున్నారు. అయితే వర్కవుట్ కాలేదు. తెనాలి నుండి జనసేన తరపున నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. ఈ సారికి ఆలపాటి విశ్రాంతి తీసుకోక తప్పదంటున్నారు.

కొవ్వూరు నియోజక వర్గం ఆశించిన మాజీ మంత్రి జవహర్ కు మొండి చెయ్యి చూపించారు చంద్రబాబు. మహిళా మంత్రిగా పనిచేసిన చింతలపూడి మాజీ ఎమ్మెల్యే పీతల సుజాతకు కూడా హ్యాండిచ్చారు. ఉత్తరాంధ్రలో బండారు సత్యనారాయణ పెందుర్తి సీటు ఆశించారు. ఆయన్ను కూడా చివరి నిముషం దాకా ఊరించి ఆ సస్పెన్స్ ను అలాగే కొనాసాగించారు. మాజీ మంత్రి కిడారు శ్రావణ్ కుమార్  అరకు సీటు  కోసం పట్టుబట్టారు. అయితే గిరిజన నేతను కూడా మోసం చేశారు చంద్రబాబు. టికెట్ ఇస్తామని  భరోసా ఇచ్చి చివరకు టోపీ పెట్టేశారు. నాలుగో జాబితా విడుదల అయితే  కానీ వీరి భవిష్యత్తు ఏంటన్నది స్పష్టత రాదు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి