కాపు ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం చూపు ఎటు వైపు? ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరబోతున్నారు? కొద్ది రోజుల క్రితం ఆయన మా పార్టీలో చేరతారంటే మా పార్టీలో చేరతారంటూ తెలుగుదేశం -జనసేన పార్టీలు పోటా పోటీగా ప్రకటనలు చేశాయి. ముద్రగడ ఇంటికి తమ పార్టీల నేతలను రాయబారాలకు పంపాయి. ఆ సమయంలోనే ఆయన తనయుడు మా తండ్రి టిడిపి-జనసేన పార్టీల్లో ఏదో ఒక దానిలో చేరతారు సుమా అన్నారు కూడా. ఇక అదే సమయంలో పాలక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ముద్రగడతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. దానికి స్పందనగా ముద్రగడ తాను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరబోవడం లేదంటూ ప్రకటన చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే రోజులు గడుస్తోన్నా ముద్రగడ ఏ పార్టీలోనూ చేరకుండా ఉత్కంఠను అలానే కొనసాగిస్తున్నారు.
1978లో జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ ప్రస్థానం ఆరంభించారు ముద్రగడ పద్మనాభం. ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని స్థాపించగానే అందులో చేరిన ముద్రగడ పద్మనాభం 1983,1985 ఎన్నికల్లో టిడిపి తరపున ప్రత్తిపాడు నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీయార్ మంత్రి వర్గంలో చోటు సంపాదించారు కూడా. ఎన్టీయార్ తో విబేధాలతో మంత్రి పదవికి రాజీనామా చేసి సీనియర్ నేతల కె.ఇ.కృష్ణమూర్తి, కె.జానారెడ్డిలతో కలిసి తెలుగునాడు పార్టీని స్థాపించారు. 1989 లో కాంగ్రెస్ లో చేరి ప్రత్తిపాడు నియోజక వర్గం నుంచే గెలిచారు. 1994లో మొదటి సారి ప్రత్తిపాడు నుండి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రత్తిపాడు నుండి తిరిగి పోటీ చేయలేదు. 1999లో టిడిపి అధ్యర్ధిగా కాకినాడ నుండి గెలిచి ఎంపీ అయ్యారు.2004లో అదే నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆతర్వాత ఆయన చట్టసభకు ఎన్నిక కాలేదు.కాపుల రిజర్వేషన్ల కోసం కాపునాడు ఉద్యమాన్ని ఆరంభించిన ముద్రగడ పద్మనాభం దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. 2014 లో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపుల రిజర్వేషన్లకోసం మళ్లీ కదం తొక్కారు ముద్రగడ. 2014 ఎన్నికల్లో కాపుల రిజర్వేషన్లపై చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని ముద్రగడ ఉద్యమానికి ఉరికారు. అయితే ఆ ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అణచివేసింది. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన సతీమణిని వారి ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సమయంలోనే ముద్రగడను పోలీసులు దారుణంగా అవమానించడమే కాకుండా దంపతులను బూతులు తిట్టారు. ఆ తర్వాత తునిలో కాపుల రిజర్వేషన్లకోసం ఉద్యమిస్తోన్న వేళ ఓ రైలును గుర్తు తెలియని దుండగుటు దగ్ఢం చేశారు. దాంతో ముద్రగడతో పాటు పలువురు కాపు యువకులపై కేసులు పెట్టారు.
2014 నుండి 2019 వరకు ముద్రగడను టిడిపి కానీ జనసేన కానీ పట్టించుకోలేదు. జనసేన అధినేత పవన్ అయితే కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏంటి అసహ్యంగా అని ముద్రగడను విమర్శించారు. యువకులను తప్పుదోవ పట్టిండచం మంది పద్ధతి కాదంటూ ముద్రగడకు హితవు కూడా పలికారు పవన్ కళ్యాణ్. కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసిన సమయంలోనూ ముద్రగడపై మాటల తూటాలు పేల్చారు పవన్ కళ్యాణ్ , ఆయన పార్టీ నేతలు. ముద్రగడ పద్మనాభం పాలక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ విమర్శలు చేశారు. అయితే అన్నిటినీ మౌనంగానే ఆలకించిన ముద్రగడ పవన్ కళ్యాణ్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. అందులో కాపులకు జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. నిజాయితీగా ఉద్యమం చేసిన తనపై విమర్శలు చేయడం తగదని సలహా ఇచ్చారు ముద్రగడ.
ముద్రగడ పద్మనాభంపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించుకోవడం..కాపుల రిజర్వేషన్ల అంశం కేంద్రం చేతుల్లో ఉన్నందున దానిపై తాను ఎలాంటి హామీ ఇవ్వలేనని జగన్ మోహన్ రెడ్డి నిజాయితీగా ఒప్పేసుకోవడం జరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడితో పొత్తు పెట్టుకున్నారు. దాంతో కాపు సామాజిక వర్గం ఓట్లు టిడిపి-జనసేన కూటమికి పడతాయని వారు భావించారు. ఈ తరుణంలోనే ముద్రగడ పద్మనాభం వై.ఎస్.ఆర్.కాగ్రెస్ లో చేరతారన్నా ప్రచారం జరిగింది. దాంతో టిడిపిలో కంగారు మొదలైంది. ఆ సమయంలోనే ముద్రగడను బుజ్జగించి తమ కూటమిలోకి తెచ్చుకునేందుకు చంద్రబాబు వ్యూహరచన చేశారు. పవన్ చేత దాన్ని అమలు చేయించే ప్రయత్నం చేశారు. జనసేన నేతలు నేరుగా ముద్రగడ ఇంటికేవెళ్లి జనసేనలో చేరాలన్నారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పుకున్నారు కూడా. అయితే ముద్రగడ మాత్రం తాను ఏ పార్టీలో చేరేదీ క్లారిటీ ఇవ్వలేదు.
ముద్రగడను వీలైనంత త్వరగా తమ పార్టీలో చేర్చేసుకుందాం అనుకున్న జనసైనికులు ముద్రగడ ఇంటికి వెళ్లారు. మీరు మాపార్టీలో ఎప్పుడు చేరతారు సార్ అని అడిగారు. దానికి ముద్రగడ నేరుగా బదులివ్వలేదు. టిడిపితో పొత్తులో భాగంగా పవన్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఒప్పుకున్నారా అని ముద్రగడ అడిగారు. జనసైనికులు బిక్కమొగాలేసే సరికి కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి అయినా ఇస్తారన్న గ్యారంటీ లభించిందా? అని ఆరా తీశారు. దానికీ జనసైనికుల వద్ద సమాధానం లేదు. ముందుగా చంద్రబాబుతో లిఖిత పూర్వకంగా ఒప్పందం చేసుకుని రండి.అప్పుడు చెబితే నేను మీ పార్టీలో చేరతాను అని ముద్రగడ వ్యాఖ్యానించి వారిని పంపేశారు. పవన్ కు సిఎం పదవి కానీ..డిప్యూటీ సిఎం పదవి కానీ ఇచ్చే పరిస్థితి లేదని టిడిపి నేతలే అంటున్నారు. అంటే కీలక పదవి ఏదీ పవన్ కు దక్కే పరిస్థితులు లేవని తేలిపోయింది. దాంతో జనసైనికులు టిడిపి అధినేతపై కారాలూ మిరియాలూ నూరుతున్నారు.
ఇది జరిగిపోయి కూడా వారం దాటింది. అయినా ముద్రగడ పయనం ఎటో తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే రాజకీయ వర్గాల్లో ఓ పుకారు షికారు చేస్తోంది. అందరూ అనుకుంటోన్నట్లు ముద్రగడ పద్మనాభం టిడిపిలో కానీ..జనసేనలో కానీ చేరడం లేదని.. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వైపూ చూడ్డం లేదని అంటున్నారు రాజకీయ పండితులు. ఆయన త్వరలో బిజెపిలో చేరనున్నారని అంటున్నారు. అందుకే జనసైనికులు తన ఇంటికి వచ్చినా ముద్రగడ ఆ పార్టీలో చేరలేదని వారంటున్నారు. బిజెపిలో చేరి వచ్చే ఎన్నికల్లో బిజెపి అధ్యర్ధుల విజయానికి పాటుపడ్డం ముద్రగడ బాధ్యతగా వారు చెబుతున్నారు. వీలైతే కాకినాడ లోక్ సభ స్థానం నుండి ముద్రగడ చేత పోటీచేయించాలన్న ఆలోచనలో కమలనాధులు ఉన్నారని అంటున్నారు. గతంలోనూ ముద్రగడ బిజెపిలో నాలుగేళ్ల పాటు కొనసాగారు. మాజీ ఎంపీ కృష్ణంరాజు విజయంలో కీలక పాత్ర పోషించారు కూడా. పవన్ కళ్యాణ్ టిడిపితో ముందుకు సాగుతోన్న తరుణంలో కాపు ఓటు బ్యాంకు కోసమే బిజెపి ముద్రగడను తమవైపు ఆకర్షించుకుంటోందని ప్రచారం జరుగుతోంది. అయితే ముద్రగడ మాత్రం తాను బిజెపిలో చేరుతున్నట్లు ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…