కొంతమందికి ఏలిననాటి శని పట్టుకుంటుంది. కొందరిని దరిద్రం వీధికుక్కలా వెంటాడుతుంది. తాడును పట్టుకున్నా పామై కాటేస్తుంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీనని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఇలాగే ఉందని చెప్పాల్సి వస్తోంది. అనుకోకుండా జరిగితే నేనేం చేయాలని బుకాయించవచ్చు. ఓపాతికో ముప్ఫై పరిహారం ఇవ్వొచ్చు. కానీ తన విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతోందనే విషయంలో మాత్రం చంద్రబాబు కొత్త సంవత్సరం మొదటిరోజునే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రోగ్రాం పేరు ఇదేం ఖర్మ. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ఈ కార్యక్రమం పెట్టుకున్నా.. అది ఎవరి ఖర్మన్న సెటైర్లుమాత్రం ఇప్పటికీ ఆగలేదు. ఆ కార్యక్రమంలోనే మొన్న నెల్లూరుజిల్లాలో ఓ ఘోరం జరిగిపోయింది. తొక్కిసలాటలో ఎనిమిది ప్రాణాలు గాల్లో కలిశాయి. టీడీపీ అధినేత పరామర్శ కార్యక్రమం కూడా జరిగిపోయింది. ఆ విషాదం మరిచిపోకముందే గుంటూరులో మరో దారుణం జరిగింది.
ఈసారి కానుకల కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ప్రచారంకోసం పాకులాటలో టీడీపీ నిర్వహణాలోపంతో మూడు ప్రాణాలు పోయాయి. మరికొందరు చావుబతుకులమధ్య ఆస్పత్రిలో ఉన్నారు. గుంటూరు వికాస్‌నగర్‌లో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనతావస్త్రాలు, చంద్రన్నకానుక పంపిణీ కార్యక్రమం విషాదానికి వేదికైంది. 30వేలమందికి కానుకలు ఇవ్వాలనుకున్న ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిధి చంద్రబాబునాయుడు. ఆయన ప్రసంగించి వెళ్లిపోయిన కాసేపటికే తొక్కిసలాట జరిగింది. మహిళలు ఒక్కసారిగా తోసుకురావటంతో ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు. అంతమంది వచ్చినప్పుడు ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో నిర్వాహకులు చూసుకోలేదు. సభలో ప్రసంగించి వెళ్లిపోయిన చంద్రబాబు అయినా మొన్నటి దుర్ఘటనను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు చెప్పి ఉండాల్సింది. కొత్త సంవత్సరం తొలిరోజునే చంద్రబాబు ప్రచారకాంక్ష నిండు ప్రాణాలు తీసిందన్న అపనిందలు మొదలయ్యాయి. సారుకి శకునం బాలేనట్లుంది.