కేబినెట్ లో సీనియర్లకు చంద్రబాబు షాక్

By KTV Telugu On 15 June, 2024
image

KTV TELUGU :-

ఏపీలో ఐదేళ్ళ తర్వాత మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి గెలిచిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఈసారి కూడా తమకు మంత్రి పదవులు ఖాయం అనుకున్నారు. తొలిసారి ఎన్నికైనవారికి కూడా పదవులిచ్చిన చంద్రబాబు గతంలో తనతో పనిచేసిన చాలామందికి షాక్ ఇచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఒక్కరికే మంత్రి పదవి ఇవ్వడంప్ల సీనియర్ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు షాక్‌లతో ఆగ్రహావేశాలకు లోనవుతున్న ఆ నేతలు ఎవరో చూద్దాం.

ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబునాయుడి నాయకత్వంలోని నూతన మంత్రివర్గ కూర్పుపై ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త మంత్రివర్గంలో తమకు అవకాశం ఇవ్వకపోవడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి మంత్రి పదవులు ఆశించారు. ఈ ముగ్గురే కాకుండా వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు, పల్లా శ్రీనివాస్ కూడా ఈసారి తమకు మంత్రి పదవి లభిస్తుందని భావించారు. అయితే వీరందరినీ కాదని తమకంటే జూనియర్ అయిన పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు మంత్రి పదవిని కట్టబెట్టడం పట్ల సీనియర్లు మండిపడుతున్నారు.

అయ్యన్నపాత్రుడు ఒకసారి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఏడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ హయాంలోనే మూడుసార్లు మంత్రిగా పనిచేశారు. గంటా శ్రీనివాసరావు ఒకసారి ఎంపీగా, 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. బండారు సత్యనారాయణ మూర్తి కూడా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో మంత్రిగా పనిచేశారు. వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఈసారి మంత్రివర్గ జాబితాలో తప్పకుండా తమకు అవకాశం లభిస్తుందని వీరంతా గట్టి నమ్మకంతో ఉన్నారు.

సీనియర్లందరి ఆశలపైనా చంద్రబాబు నీళ్లు జల్లారు. అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద అయితే టిడిపి కార్యకర్తలు కాబోయే మంత్రి అయ్యన్నపాత్రుడుకి శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు..  డీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ తరపున వాయిస్ వినిపించింది అయ్యన్న పాత్రుడు ఒక్కరే అన్న విషయాన్ని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ మాటలు విని ఆయన కేసులు కూడా పెట్టించుకున్నారంటూ అయ్యన్న అనుచరులు వాపోతున్నారు.

పార్టీలో సీనియర్ నేత అయిన అయ్యన్నకు చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. బండారు సత్యనారాయణమూర్తి అయితే పొత్తులో భాగంగా తమ నియోజకవర్గాలను జనసేనకు విడిచిపెట్టామని గుర్తు చేస్తున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా తమ సొంత నియోజకవర్గాలను విడిచిపెట్టి పక్క నియోజకవర్గాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన తాము చంద్రబాబుకు గుర్తు రాలేదా అంటున్నారు.

దశాబ్దాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెట్టడమేంటని సీనియర్ నాయకులు, వారి అనుచరులు చంద్రబాబు మీద మండిపడుతున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి తనకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తారని గంటా శ్రీనివాసరావు ఎంతో ఆశించారు. అయితే ఇదే సామాజికవర్గం నుంచి తొలిసారి విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. ఈసారి అసలు సీనియర్లను చంద్రబాబు పట్టించుకోలేదని ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు వాపోతున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి