వారిద్దరూ మంచి స్నేహితులు. పవర్ స్టార్ చేసే ప్రతీ సినిమాలో ఆ స్టార్ కమెడియన్ నటిస్తారు. అలా ఆ ఇద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. కానీ రాజకీయాలకు వచ్చే సరికి ఎవరి దారి వారిదే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమంటున్నారు ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ. సీఎం జగన్ ఆదేశిస్తే పవన్‌పై పోటీకి రెడీ అంటున్నారు. తమ బాస్ చెప్పాలేగానీ ఎవరిపైనైనా ఎక్కడైనా తాను పోటీ చేస్తానని అంటున్నారు. అలీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కమెడియన్‌గా నటుడిగా ఎన్నో వందల సినిమాల్లో ప్రేక్షకులను అలరించిన అలీ 2019 ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నించినా కుదరలేదు. అయితే పార్టీ విజయానికి అలీ జోరుగా ప్రచారం చేశారు.
వైసీపీ అధికారంలోకి రాగానే అలీకి ఏదో పదవి దక్కడం ఖాయమనే ప్రచారం జరిగింది. ఓ సందర్భంలో రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ ఇవ్వనున్నారనే టాక్ నడిచింది. కానీ అవేమీ జరగలేదు. దీంతో ఆయన మళ్లీ జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ వార్తలను ఖండించిన అలీ జగన్‌ను సీఎం చేసేందుకు మళ్లీ కృషి చేస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్‌లో అలీకి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అలీ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. గోదావరి జిల్లాల్లో జనసేనానికి బలమైన సామాజికవర్గం ఉంది. పవన్ ఎక్కడ పోటీ చేసినా ఆయనపై ముద్రగడను బరిలోకి దింపాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇలాంటి సమయంలో అలీ తాను సైతం అంటూ హీట్ పెంచారు.
నాలుగున్నర దశాబ్దాల నటనానుభవం అలీ సొంతం. హీరో కమెడియన్ క్యారక్టర్ ఆరిస్టుగా చాలా పాత్రలు చేశారు. టీవీ షోలలో కూడా సూపర్ హిట్ అనిపించుకున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో చేరి తన లక్ ని పరీక్షించుకున్నారు. కానీ ఎమ్మెల్యే కావాలనే కోరిక మాత్రం తీరలేదు. అలీ తన సొంత ఇలాక అయిన రాజమండ్రి నుంచి ఒక్కసారైనా గెలవాలని పరితపిస్తున్నారు. వైసీపీలో ఓ పదవి దక్కడంతో మైలేజ్ పెంచుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఏకంగా తన మిత్రుడిపైనే పోటీకి సిద్ధమంటూ అలీ బాంబ్ పేల్చారు. ఇటీవల కాలంలో అలీ, పవన్‌కు మధ్య దూరం పెరిగింది. అలీ కూతురు పెళ్ళికి కూడా పవన్ వెళ్లలేదు. వచ్చే ఎన్నికల్లో అలీకి అధినాయకత్వం టికెట్ ఇస్తుందా?ఇస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? నిజంగానే పవన్‌పై ఆయన్ను బరిలోకి దింపుతారా? అనేది చూడాలి మరి.