వైసీపీ నేతలు తోకముడిచేస్తున్నారు. ఇక హడావుడి చేసి లాభం లేదన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. శాశ్వతంగా కాకపోయినా తాత్కాలికంగానైనా కోల్డ్ స్టోరేజీలో ఉండిపోవాలని డిసైడవుతున్నారు. ఎక్కడా కనిపించకుండా కొన్ని రోజులు కలుగులో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. జనం దగ్గర ఉండకుండా, జగన్ కంటికి కనిపించకుండా దూరంగా వెళ్లిపోవాలని తీర్మానించుకున్నారు. ఈ క్రమంలో చాలా మంది నేతలు పార్టీ వైపు రావడం లేదు. కొందరైతే తమ క్యాంపు కార్యాలయానికి మూసేసి చేతులు దులుపుకుంటున్నారు. అందులో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఒకరు. జల్లెడ పట్టి వెదికినా ఇప్పుడాయన ఎక్కడా కనిపించడం లేదు…..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు ఆయన పెద్ద పిస్తా. సొంత రెడ్డి సామాజికవర్గానికి చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా పక్కన పెట్టి మరీ ఆదిమూలపు సురేష్ కు మంత్రి పదవిని జగన్ కొనసాగించారు.ఈ క్రమంలో సురేష్ అప్పటి సీఎంకు బాగా దగ్గరయ్యారు. చంద్రబాబు..టూర్ సందర్భంగా తన చొక్కా విప్పి చూపించి సురేష్ తెగ హడావుడి చేశారు. అలాంటి సురేష్ ఇప్పుడు రాజకీయ శూన్యత దిశగా పయనిస్తున్నారనిపిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా ఆయన తన కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయాలంటే ఎంతగా లో ప్రొఫైల్ మెయింటేయిన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వరుసగా మూడు సార్లు గెలిచి నాలుగో సారి ఓడిపోయిన సురేష్.. ఇకపై తనకు రాజకీయ భవిష్యత్తు లేదని కూడా అనుమానిస్తున్నట్లు అనుచరులు చెబుతున్నారు….
ఆదిమూలపు సురేష్.. నిన్నటి దాకా దూకుడున్న నాయకుడు. జగన్ ను తప్పితే ఎవ్వరినీ లెక్కచేయరని కూడా ఆయనకు పేరుంది. కాకపోతే ఓడలు బండ్లు అవుతాయన్నట్లుగా ఇప్పుడాయన పలాయనమంత్రం పఠించే పరిస్థితి వచ్చింది. పార్టీ నేతలు ఆయన కోసం వెదుక్కునే దుస్థితి కనిపిస్తోంది…
2009లో ఎర్రగొండపాలెం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆదిమూలపు సురేష్ మొదటిసారి గెలుపొందారు. 2014 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన ఆదిమూలపు సురేష్ కి జగన్ సంతనూతలపాడు టిక్కెట్ కేటాయించారు. అక్కడ గెలిచినప్పటికీ 2019 ఎన్నికలు వచ్చేసరికి నియోజకవర్గంలో ఎదురుగాలి వీచింది. దీంతో 2019 ఎన్నికల్లో మరోసారి ఎర్రగొండపాలెం నుండి పోటీ చేసి ఆదిమూలపు సురేష్ గెలుపొందారు. అయితే ఐదేళ్లు మంత్రిగా పనిచేసినప్పటికీ పార్టీ క్యాడర్ నుండి వ్యతిరేకత తీవ్రమైంది.ప్రజలకు ఆయన చేసిందేమీ లేదని నిలదీయడం ప్రారంభమైంది. దీంతో 2024 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ కి మరోసారి నియోజకవర్గం బదిలీ తప్పలేదు. ఎర్రగొండపాలెం నుండి కొండపి వచ్చి పోటీ చేసిన ఆదిమూలపు సురేష్ కి ఈసారి ఎన్నికలు ఊహించని షాక్ ఇచ్చాయి. కొండపి ఓటర్లు ఆయన్ను తిరస్కరించారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన టీడీపీ అభ్యర్థి బాల వీరాంజనేయ స్వామి ఈ సారి కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. మూడుసార్లు నియోజకవర్గాలు మారి గెలుపొందిన ఆదిమూలపు సురేష్ కి నాలుగోసారి నియోజకవర్గ మార్పు బెడిసి కొట్టింది. కొండపిలో ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ఆదిమూలపు సురేష్ ఆ నియోజక వర్గానికి దణ్ణం పెట్టి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఎన్నికలవేళ హడావుడిగా ప్రారంభించిన పార్టీ కార్యాలయాలను, క్యాంపు కార్యాలయాలను గప్ చుప్ గా ఖాళీ చేశారు. కార్యాలయాలను ఖాళీ చేయడంతో ఇంటి యజమానులు వాటికి టూలెట్ బోర్డులు పెట్టారు. పార్టీ కార్యాలయం కోసం వేసిన రంగులు సైతం ఇంటి యజమానులు తొలగించారు.దీనితో ఆదిమూలపు సురేష్ పలాయనం పరిపూర్ణమైంది….
ఆదిమూలపు సురేష్ కొంతకాలం పాటు క్రియాశీలత తగ్గిస్తారని చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా అవసరాన్ని బట్టి మొక్కుబడిగా హాజరవుతారని అనుచరులు అంటున్నారు. ఐదేళ్ల తర్వాత రాజు ఎవరో, రెడ్డి ఎవరో అన్నట్లుగా ఆలోచన రావడంతో సురేష్ కొంచెం దూరంగా ఉండాలనే అనుకుంటున్నారట. నిజానికి ఆయన ఒక్కరే కాదు. వైసీపీలో చాలా మంది పరిస్థితి ఇదేనని చెప్పాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…