కూటమికి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే

By KTV Telugu On 28 November, 2024
image

KTV TELUGU :-

కొందరు కొరకరాని కొయ్యలుగా తయారవుతారు. వారిని ఎంత కట్టడి చేయాలన్నా పార్టీ పెద్దల వల్ల కాదు. ఒకటి రెండు సార్లు పిలిచి మందలించినా, వార్నింగులు ఇచ్చినా……… ఆ కాసేపటికి సరే అంటారు. తర్వాత తమదైన శైలిలో అడ్డదారుల్లోనే నడుస్తుంటారు. ఇప్పుడు అలాంటి నేత…..తమ కూటమికే చెందిన మరో ఫైర్ బ్రాండ్‌తో గొడవకు దిగుతున్నారు. చూసుకుందాం రా అంటూ తొడకొడుతున్నారు. అలాంటి సమస్యలను ఎలా పరిష్కరించాలో అర్థం కాక ఆంధ్రప్రదేశ్‌లోని అధికార కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు…

ఇటీవ‌ల బీజేపీ ఎంపీ సీఎం ర‌మేశ్‌కు చెందిన రిత్విక్ సంస్థ ప‌నుల్ని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి వ‌ర్గీయులు అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే. సీఎం ర‌మేశ్ సంస్థ తాము డిమాండ్ చేసిన‌ట్టు కాంట్రాక్ట్ ప‌నులు ఇవ్వ‌లేద‌నే ఆగ్ర‌హంతో ఎమ్మెల్యే వ‌ర్గీయులు దాడికి తెగ‌బ‌డ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆదినారాయణ రెడ్డిని స్వయంగా చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. నచ్చజెప్పారో, హెచ్చరించారో తెలీదు కానీ… ఆ విషయాన్ని ఆదినారాయణ రెడ్డి వర్గం వదిలేసింది. ఇప్పుడు అదే గ్రూపు మరో సమస్యలో తలదూర్చింది….

జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం ఎర్ర‌గుంట్ల మండ‌లంలోని ఆర్టీపీపీ నుంచి ప్లైయాష్ త‌ర‌లింపు విష‌య‌మై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి, తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు జేసీ దివాక‌ర్‌రెడ్డి వ‌ర్గీయుల మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతోంది. ఈ గొడ‌వంతా ఆదాయం కోస‌మే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకి ఆర్టీపీపీ వ‌స్తుంది. దీంతో త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ఏ పనైనా సరే త‌మ క‌నుస‌న్న‌ల్లోనే అని ఆదినారాయ‌ణ‌రెడ్డి భావిస్తున్నారు, . తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలోని సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆర్టీపీపీ నుంచి జేసీ దివాక‌ర్‌రెడ్డి వ‌ర్గీయుల వాహ‌నాలు ప్ల‌యాష్ త‌ర‌లిస్తున్నాయి. అయితే ఒప్పందం కుద‌ర‌క‌పోవ‌డంతో జేసీ దివాక‌ర్‌రెడ్డి వాహ‌నాల్ని ఆర్టీపీపీకి ఎట్టి ప‌రిస్థితుల్లో రానివ్వ‌కూడ‌ద‌ని ఆది వ‌ర్గీయులు పంతం ప‌ట్టారు. తమకు ఎలాంటి కప్పం కట్టకుండా ఫ్రీగా తీసుకెళ్తున్నారని ఆగ్రహం చెందారు.

జేసీ దివాక‌ర్‌రెడ్డి వాహ‌నాలు ఆర్టీపీపీకి వ‌స్తున్నాయ‌ని తెలిసి, ఆర్టీపీపీ స‌మీపంలోని క‌ల‌మ‌ల్ల వ‌ద్ద ఆదినారాయణ‌రెడ్డి వ‌ర్గీయులు భారీగా మోహ‌రించారు. వ‌స్తే దాడి చేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపారు. ప్రస్తుతానికి సమస్య పరిష్కారమైనట్లే కనిపించినా ఆదినారాయణ రెడ్డి వర్గం మాత్రం ఊరుకునేందుకు సిద్ధంగా లేదు. తమ ఇలాకాలోకి వస్తే జేసీ వర్గం పని పడతామని వాళ్లు చెబుతున్నారు….

ఆదినారాయణ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. రెండు పర్యాయాలు జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో వైసీపీ టికెట్ పై గెలిచి టీడీపీలో చేరారు. మంత్రిగా పనిచేశారు. మారిన పరిస్థితుల్లో ఈ సారి బీజేపీలో చేరి పోటీ చేశారు. కూటమి ప్రభంజనంలో నాలుగో సారి జమ్మలమడుగు నుంచి గెలిచారు. జమ్మలమడుగు తన సొంతం అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. పైగా ఆదినారాయణ రెడ్డి బంధు,మిత్రులంతా ఇప్పుడు జమ్మలమడుగులో రాజ్యమేలుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏ పనైనా వాళ్లు రంగంలోకి దిగి పెత్తనం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. మరి ఆదినారాయణ రెడ్డిని కంట్రోల్ చేయడమెలాగా కూటమి పెద్దలే ఆలోచించుకోవాలి….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి