ఆలపాటి అవస్థలు

By KTV Telugu On 30 January, 2024
image

KTV TELUGU :-

మాజీ మంత్రి తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అలియాస్ రాజాకు రాజకీయంగా కష్టాలు వచ్చి పడ్డాయి. తెలుగుదేశం పార్టీలో ఎంత క్రియాశీలంగా పనిచేస్తున్నప్పటికీ ఆయనకు టికెట్ రావడం  కష్టమన్న అనుమానాలు కలుగుతున్నాయి.  పొత్తులు ఒక సమస్య  అయితే ఆలపాటి చేసిన తప్పిదాలు కూడా ఆయన్ను వెంటాడుతున్నాయన్న ఫీలింగ్ వస్తోంది.

టీడీపీ, జనసేన పొత్తు కొందరు సీనియర్ల రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్  పడే ప్రమాదం ఏర్పడింది. కీలక స్థానాలు  జనసేనకు  కేటాయించాల్సిన అనివార్యత  ఏర్పడిన తరుణంలో కొందరినీ పక్కన పెట్టే పరిస్థితి తప్పడం  లేదు. అలాంటివారిలో మాజీమంత్రి, తెనాలి మాజీ ఎంఎల్ఏ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా ఒకరని చెప్పక తప్పదు.టీడీపీకి  ఆలపాటి వీరవిధేయుడు.  ఐనా పరిస్థితులు అనుకూలించడం లేదనే చెప్పాలి.   ఆయన పార్టీలో చేరిందగ్గర నుండి రెండుపార్టీ గురించి ఆలోచన కూడా చేయలేదు. చంద్రబాబునాయుడు మద్దతుదారుడిగా ఉండిపోయారు. గెలుపోటములతో సంబంధంలేకుండా తెనాలిలో పోటీచేస్తునే ఉన్నారు. పోయిన ఎన్నికల్లో తెనాలిలో జరిగిన ట్రయాంగిల్ పోటీలో ఆలపాటి ఓడిపోయారు.

జనసేన రాకతో తనకు ఇబ్బందులు తప్పవని ఆలపాటి రాజా ఎప్పుడో గ్రహించారు. నియోజకవర్గం మారే ప్రయత్నం చేశారు. అదీ వర్కవుట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ఆలపాటి నోరు జారడం ఎక్కువన్న చర్చ కూడా జరుగుతోంది.

రాబోయే ఎన్నికల్లో ఆలపాటికి తెనాలి టికెట్ దక్కటం కష్టమని అర్ధమైపోయింది. ఎందుకంటే ఇక్కడ జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ అక్కడే ఉన్నారు. మనోహర్ కూడా చాలాకాలంగా తెనాలి నుండే పోటీచేస్తున్నారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తులేదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య టికెట్ వార్ జరగలేదు. ఇపుడు పొత్తు కుదిరడంతో సమస్య మొదలైంది. గుంటూరులో ఒక నియోజకవర్గం లేదా పెదకూరపాడులో పోటీ చేయాలని ఆలపాటి రాజా లెక్కలేసుకున్నారు.  అయితే గతేడాది ప్రారంభంలో ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన కానుకల పంపిణీ సందర్భంగా తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు. అక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయించిందీ రాజా అని బయటకు పొక్కడంతో ఇక ఆయన గుంటూరు మొహం చూడలేకపోయారు. పెదకూరపాడులో ఇప్పటికే కొమ్మాలపాటి శ్రీధర్ పని చేసుకుపోతున్నారు. నారా లోకేష్ ఆయనకు టికెట్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. మరో పక్క ఇద్దరు మాజీ జడ్జిల  మధ్య తగవులో  రాజా పేరు బయటకు వచ్చింది. ప్రస్తుతం లీడింగ్ లాయర్ గా ఉన్న మాజీ జడ్జికి పార్టీ తరపున నెలకు 30 లక్షలు ఇస్తున్నామన్ని రాజా  అప్పట్లో వెల్లడించిన  విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దానితో రాజా మాత్రమే కాకుండా పార్టీ కూడా డిఫెన్స్ లో పడిపోయింది. అది ఆయన టికెట్ కు గండమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి….

టీడీపీ అధినేత చంద్రబాబు వైపు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజా తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడి పనులు చేసుకుపోవాల్సిన తరుణంలో ఏమిటీ జాప్యమని అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు.  ఇదే పరిస్థితి కొనసాగి టికెట్ రాకపోతే తెనాలిలో ఇండిపెండెంట్ గా నైనా పోటీ చేస్తానని రాజా తన అనుచరుల వద్ద చెబుతున్నారట. ఏం జరుగుతుందో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి