ఎంత చేట, కాట్రవల్లి డైలాగ్స్ తో ఫేమస్ అయిన హాస్య నటుడు అలీ పార్టీ మారుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి రాజకీయ సన్యాసం చేసినట్లు ప్రకటించినప్పటికీ అలీ అసలు ఉద్దేశం వేరుగా ఉందని చెబుతున్నారు. సుదీర్ఘకాలం సినీ,టీవీరంగాలో వెలిగిన అలీ.. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా రాణించలేదు. ఈ సారి మాత్రం ఆయన ఒక ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అన్నీ ఉన్నా రాజకీయ పదవి లేదన్న లోటును తీర్చుకునే కోరికతో ఆయన పావులు కదుపుతున్నారని అలీకి క్లోజ్ గా ఉండే వాళ్ల నుంచి సమాచారం అందుతోంది.
అలీ నాలుగున్నర దశాబ్దాల పాటు సినీ రంగంలో రాణించారు. 12 వందలకు పైగా సినిమాల్లో నటించారు. హీరోగా కొన్ని సినిమాలున్నా… హాస్య నటుడిగానే సెటిలయ్యారు. టీవీ యాంకరింగ్ కూడా చేస్తున్నారు. సినీ రంగం నుంచి సినిమాల్లోకి రావాలన్న ఒక రూలును తనకు కూడా వర్తింప జేసుకోవాలని భావిస్తూ 1999లోనే ఆయన దగ్గుబాటి రామా నాయుడుకు ప్రచారం చేశారు. అలీ చాలా కాలం టీడీపీలో కొనసాగారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ను పెద్దగా ప్రోత్సహించలేదు. పదవీకాంక్షతో ఉన్న అలీ… 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వైసీపీ కోసం విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ ఆయన అనుకున్నది మాత్రం నెరవేరలేదు. జగన్ తనను పిలిచి రాజ్యసభ లేదా మండలి సభ్యత్వమిస్తారని అనుకంటే మొండిచేయి చూపించారు. చివరాఖరుకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి కట్టబెట్టారు. చచ్చినోడికి వచ్చిందే దక్కు అన్నట్లుగా అలీ ఆ పదవితో సరిపెట్టుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. అది అలంకార ప్రాయమే అయ్యింది తప్ప అలీ సాధించిందేమీ లేదు. 2024 ఎన్నికల్లో లోక్ సభ లేదా అసెంబ్లీ సీటు ఇస్తారని అలీ ఎదురు చూస్తే జగనన్న ఆయనపై శీతకన్నేశారు. దానితో అలీ ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు అలీ ఒక వీడియో విడుదల చేశారు. దానికి కారణాలు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు….
ఏపీ రాజకీయాలు మారాయి. తాను కూడా మారాల్సిందేనని అలీ డిసైడయ్యారు. గుంభనంగా ఉంటూ జనసేనతో అలీ చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. పైగా అలీ చాలా సినిమాల్లో పవన్ కల్యాణ్ తో కలిసి నటించారు. పవన్ కు కూడా అలీ అంటే అభిమానమేనని చెబుతున్నారు..
బాబు మోషాయ్ క్యారెక్టర్ నుంచి గబ్బర్ సింగ్, అత్తరింటికి దారేదీ సినిమాలతో పాటు అనేక చిత్రాల్లో పవన్ కల్యాణ్ తో అలీ కలిసి నటించారు. ఇదీ వారిద్దరి మధ్య స్నేహం పెరగడానికి కూడా అవకాశమిచ్చింది. ప్రస్తుతం వైసీపీ నుంచి వైదొలగాలని అలీ నిర్ణయించుకుని జగన్ కు రాజీనామా పత్రం పంపించిన తర్వాత జనసేనతో టచ్ లోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. జనసేనలో చేరేందుకు తాను ఇష్టపడుతున్నట్లుగా అలీ సందేశం పంపిన వెంటనే పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. పైగా కొందరు రాజకీయ నాయకుల్లా అలీ ఎప్పుడు ఇష్టానుసారం ప్రకటనలివ్వలేదు. పోసాని కృష్ణమురళీ మాదిరిగా ఎవరినీ బూతులు తిట్టలేదు. నిత్యం అందరితో మంచిగానే ఉండేందుకు ప్రయత్నించారు. అదే ఇప్పుడు జనసేనలో చేరేందుకు మార్గం సుగమం చేసే వీలుంది…
అలీకి ఇప్పుడు ఏదోక పదవి కావాలి. గతంలో టీడీపీలో పనిచేసినా.. ఇప్పుడా పార్టీలో పదవుల కోసం వేచి చూస్తున్న గుంపులు బాగా పెరిగాయి. అలీకి ఛాన్స్ దొరకడం కష్టమే. అందుకే ఆయన జనసేన వైపుకు చూస్తున్నారనుకోవాలి. మరి అలీ కోరిక నెరవేరేందుకు ఎంతకాలం పడుతుందో చూడాలి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…