రాజకీయాల్లో అవసరాన్ని బట్టి లీడర్లు మారుతుంటారు. వారికి కావాల్సిన పార్టీ వైపు మొగ్గు చూపుతుంటారు. కూటములు, పొత్తులు, మద్దతుల విషయంలో కూడా అదే జరుగుతుంటుంది. అవసరాన్ని బట్టి ప్రత్యర్థి పార్టీలు కూడా ఒక నేతకు మద్దతివ్వడం సాధ్య పడుతుంది. తెలుగు రాజకీయ నేతల తీరును చూసిన వాళ్లు గలీలో కుస్తీ, ఢిల్లీలో మాత్రం మోదీతో దోస్తీ అని కామెంట్ చేస్తున్నారు. గత ఐదారు సంవత్సరాలుగా వైరీ వర్గాలు మోదీ నిర్ణయాలకు మద్దతిస్తూనే ఉన్నారు. అదేంటి మన ప్రత్యర్థి మద్దతిస్తే మనం వ్యతిరేకించాలి కదా అని అనుకోవడం లేదు.
అందరికీ మోదీనే అంతరాత్మ అవుతున్నారు. ఎన్డీయే రెండో పాలనా కాలంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయానికి వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, గులాబీ దళపతి కేసీఆర్ మద్దతిస్తూ వచ్చారు. నిజానికి గత ఐదేళ్లు మోదీతో ఈ మూడు పార్టీలకు పొత్తు లేదు. ఐనా సరే అన్ని నిర్ణయాలకు ఓకే చెబుతూ వచ్చారు. లోక్ సభలో బీజేపీకి సంపూర్ణ బలముండి కూడా వారి సహకారం తీసుకుంది. రాజ్యసభ గండాన్ని గట్టెక్కించుకునేందుకు తెలుగు పార్టీల సేవలను బీజేపీ వినియోగించుకుంది. రాష్ట్రాల్లో పార్టీల మధ్య కొట్లాటలు, అరెస్టులు, కేసులు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఎక్కడా అడ్డుకాకుండా చూసుకున్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తే మోదీ బయటకు వచ్చి మాట్లాడకపోవడం కూడా జగన్ రెడ్డి కీలక సమయాల్లో కేంద్రానికి ఇచ్చే మద్దతు కోసమేనని చెప్పుకునే వారు. ఇప్పుడు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి పరిస్థితులు మారిన తర్వాత కూడా తెలుగు పార్టీ మోదీ జిందాబాద్ అంటూనే ఉన్నాయి….
స్పీకర్ ఎన్నికలో ఆంధ్రప్రదేశ్ పార్టీలు ఇప్పుడు మోదీకి మద్దతిస్తున్నాయి. బీజేపీకి సొంత మెజార్టీ లేక ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై ఆధారపడుతున్న తరుణంలో ఎక్కడా భేషజాలకు పోకుండా చంద్రబాబు, జగన్ మోదీకి జై కొట్టారు. స్పీకర్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తూ అందుకు వైసీపీ చెప్పిన లాజిక్కు చాలా విచిత్రంగా అనిపించింది….
పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆశించినంత స్థాయిలో స్థానాల్లో రాలేదు. దీంతో భాగస్వామ్య పార్టీలతో కలిసి నరేంద్ర మోదీ, ఎన్డీఏ కూటమి పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో తెలుగుదేశం, జేడీయూ, జేడీఎస్, జనసేన పార్టీలు కీలకంగా ఉన్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు, నితీష్ కుమార్, కుమారస్వామి పార్టీల ఎంపీలకు మంత్రి పదవులు దక్కాయి. అయితే లోక్ సభను నడిపించేందుకు స్పీకర్ కావాలి. టీడీపీకి స్పీకర్ పదవి ఇద్దామనుకుంటే.. తాము సుముఖంగా లేమని చంద్రబాబు ప్రకటించారు. దానితో బీజేపీనే స్పీకర్ పదవి తీసుకుంది. అయితే పోటీ అనివార్యమైంది.
ఓం బిర్లాను స్పీకర్ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి ప్రతిపాదించగా.. కేరళ రాష్ట్రంలోని మావేలికర పార్లమెంటు స్థానం నుంచి 8 సార్లు ఎంపీగా గెలిచిన కోడికున్నిల్ సురేష్ ను కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించింది. ఎన్డీయే భాగస్వామిగా ఓం బిర్లాకు టీడీపీ మద్దతివ్వడంలో తప్పు లేదు. ఇప్పుడు నలుగురు సభ్యులున్న వైసీపీ కూడా ఆయనకే మద్దతిస్తోంది.అలా ఎందుకు మద్దతిస్తున్నారంటే.. టీడీపీకి వ్యతిరేకంగా అలాంటి చర్యలకు దిగామని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. టీడీపీ లోపాయకారిగా కాంగ్రెస్ తో చేతులు కలిపిందని, అందుకే తాము బీజేపీకి మద్దతిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. పైగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నుంచి స్పష్టమైన హామీ వచ్చినందునే స్పీకర్ ఎన్నికలో మద్దతిస్తున్నామని వైసీపీ అంటోంది. అయితే కేసుల భయంతో జగన్ ను సీబీఐ తరుముకొస్తోందని తెలిసి ముందు జాగ్రత్త చర్యగా మోదీని మంచి చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. కీలక సమయాల్లో మోదీ తనను కాపాడతారన్న నమ్మకం జగన్ రెడ్డికి ఉందని చెబుతున్నారు..
రాజకీయాలలో అవసరాలు మాత్రమే ఉంటాయి. వాటికి అనుగుణంగానే నాయకుల అడుగులు ఉంటాయి.మొత్తానికి తన రాజకీయ చాణక్యంతో నరేంద్ర మోదీ అటు టీడీపీ, ఇటు వైసీపీని తన ఆధీనంలో ఉంచుకున్నారని స్పష్టమవుతోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…