ఇష్టమా..కష్టమా..పొత్తు పర్ఫెక్ట్ స్కెచ్ – Alliance Perfect Sketch Of Chandrababu

By KTV Telugu On 12 March, 2024
image

KTV TELUGU :-

ఒక రాజకీయ నాయుకుడు రేపు ఆలోచించేది.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళే ఆలోచిస్తారు. జగన్ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్న తరుణంలో తమ పార్టీకే గెలుపు ఖాయమని భావించిన చంద్రబాబు.. భవిష్యత్తును కూడా లెక్కగట్టుకుని మరీ పొత్తులపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. జనసేననే కాకుండా బీజేపీని కూడా కలుపుకుపోయేందుకు వెనుకాడని చంద్రబాబు… ఆ దిశగా టీడీపీపై ఎలాంటి వత్తిడి, ఇబ్బంది లేకుండా చూసుకున్నారు.తమ ప్రయోజనాలు కాపాడుకుంటూనే బీజేపీకి స్నేహహస్తం అందించారు…

ప్రకటనలకు చాలా మంది కొత్త అర్థాలు వెదుకుతారు. వారికి అసలు అర్థాలు బోధపడవు. చంద్రబాబుతో చర్చల తర్వాత నడ్డా వదిలిన జాయింట్ స్టేట్ మెంట్ పై వాళ్లు ఏదేదో మాట్లాడేస్తున్నారు. చంద్రబాబు వెళ్లి బీజేపీని శరణు వేడారని చెప్పేందుకు వాళ్లు పడరాని పాట్లు పడుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు ఎంత మాస్టర్ స్ట్రోక్ కొట్టారో వాళ్లకు అర్థం కాకపోవడమే విడ్డూరం. ఎందుకంటే చంద్రబాబు ఎక్కడా పొత్తు కోసం వెంపర్లాడలేదు. అలాగని పొత్తు అనివార్యతలు ఆయనకు తెలియనిది కాదు. తొందరపడితే పుచ్చుకోవడం కంటే ఇచ్చుకోవడం  ఎక్కువ ఉంటుందని తెలిసినోడు కాబట్టి, పైచేయి కాకుండా కింది చేయిగా ఉంటుందని అర్థమైనోట్లు కాబట్టి ఎంతో నేర్పుగా వ్యవహరించారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై పవన్  కల్యాణ్ చాలా రోజులుగా మాట్లాడుతున్నారు. ఐనా చంద్రబాబు ఎక్కడా తన మనోగతాన్ని బహిరంగంగా ఆవిష్కరించలేదు. పొత్తు ఉండొచ్చన్న సంకేతాలను జనానికి, టీడీపీ కేడర్ కు అర్థమయ్యేలా  చెప్పారే తప్ప ప్రకటన చేయలేదు. దాన్ని ఎలా నరుక్కుంటూ రావాలో తెలుసుకుని ఆ దిశగానే పావులు కదిపారు…

మోదీతో కలిసిపోయేందుకు పవన్ తొందరపడ్డారు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ చంద్రబాబు ముందుకు కదిలారు.కొత్త బ్యాచ్ తో కేడర్ ఇబ్బంది పడకుండా చూసుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే చంద్రబాబు అడుగులు వేశారు. పైగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఐదేళ్ల పాటు రాజకీయ స్నేహం చెక్కుచెదరకుండా చూసుకునే చర్యలకు కూడా ఇప్పుడే శ్రీకారం చుట్టారు..

బీజేపీతో పొత్తు  పెట్టుకోవడమంటే కీలక నియోజకవర్గాల్లో ఆ పార్టీకి టీడీపీ కేడర్ కు మధ్య పేచీలు రావచ్చు. క్షేత్రస్థాయిలో సంఘర్షణను పెంచుకోవడమే అవుతుందని కూడా చంద్రబాబుకు తెలుసు. అలాంటి సమస్యలను ఆదిలోనే తుంచివేయగల యంత్రాంగం కావాలని ఆయన అంచనా వేసుకున్నారు. అందుకే బీజేపీలోని టీడీపీ వ్యతిరేకులను కట్టడి చేస్తామని ఆ పార్టీ పెద్దల నుంచి హామీ వచ్చిన తర్వాతే పొత్తు ఏర్పాట్లు మమ్మరమయ్యాయి. మీరు ఎన్ని స్థానాల్లోనైనా పోటీ చేయండి. బీజేపీ ఎన్నయినా తీసుకోనివ్వడం, జనసేనతో ఎన్నయినా పంచుకోండి.. టీడీపీ మాత్రం 145 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని చంద్రబాబు కుండబద్దలు  కొట్టి రెండు పార్టీలతో మమ అనిపించారు. ఇక చంద్రబాబు అసలు పొత్తు ఎందుకు పెట్టుకున్నారన్న ప్రశ్నకు కూడా ఇప్పుడిప్పుడే సమాధానం వస్తోంది. ఎన్నికల్లో గెలిచి సీఎం పదవిని చేపట్టిన తర్వాత మంచి  పాలనాదక్షుడన్న పేరు  తెచ్చుకోవాలని చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారు.  జగన్ ఇప్పటికే  రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన నేపథ్యంలో అమరావతి  నిర్మాణం సహా అన్ని పనులకు భారీగా నిధులు కావాలి. కేంద్రంలో ఉన్న పార్టీతో సఖ్యతగా ఉంటేనే… ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి నిధులను పొందే వీలుంటుంది. కొత్త మార్గాల్లో రాష్ట్రానికి అప్పుపుట్టే అవకాశం ఉంటుంది. అంటే అసలు గేమ్  ఎన్నికల తర్వాత మొదలవుతుంది. ఆ ఆటలో పైచేయి సాధించేందుకు ఇప్పుడే స్నేహహస్తం అందించారు.

గెలిచిన తర్వాత టీడీపీతో బీజేపీకి అవసరం ఉండకపోవచ్చు.మిషన్ 400లో భాగంగా వీలైనన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆ సంగతి గ్రహించే తన డిమాండ్లను వెనక్కి తీసుకోకుకుండానే టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తును ఫైనల్ చేసుకున్నారు. ఎక్కడా తొందరపాటును ప్రదర్శించలేదు..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి