చంద్రబాబు నాయుడేమో కమలం పువ్వును ప్రేమిస్తున్నారు. బిజెపి జనసేనను ప్రేమిస్తోంది. జనసేన టిడిపిని ఇష్టపడుతోంది. కామ్రేడ్లేమో చంద్రబాబును ప్రేమిస్తున్నారు. కమలం బాబును ఛీ కొడుతోంది. చంద్రబాబు కామ్రేడ్లను పక్కన పెట్టుకునే బిజెపితో వన్ సైడ్ లవ్ కొనసాగిస్తున్నారు. ఎన్నికల నాటికి ఎవరు ఎవరితో సెటిల్ అవుతారోనని జనం గమనిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా చిత్రంగా ఉన్నాయి. ఎన్నికలకు ఇక ఏడాదే ఉండడంతో ముందుగానే ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే పోలా అని విపక్షాలు తమలో తాము విశ్వ ప్రయత్నాలు చేసుకుపోతున్నాయి. పాలక పక్షమైన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అయితే తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. 2014 నుండి ఒంటరిగానే పోటీచేస్తోన్న తాము వచ్చే ఎన్నికల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని ఫ్యాన్ పార్టీ స్పష్టం చేస్తోంది. ఇక విపక్షాల్లోనే గందరగోళ సమీకరణలు కనిపిస్తున్నాయి. 2018లో బిజెపికి కటీఫ్ చెప్పి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల తర్వాతి నుంచి కూడా బిజెపి వెంటపడుతున్నారు. బిజెపి నాయకత్వం చీదరించుకుంటోన్న చంద్రబాబు నాయుడు మాత్రం వన్ సైడ్ లవ్ లో పడిపోయారు. మెలకువగా ఉన్నా కలలోనైనా కమలం జపమే చేస్తున్నారు.
చంద్రబాబు ప్రేమను తృణీకరిస్తోన్న కమల నాథులు తమ ప్రేమ జనసేనతోనే అని అంటున్నారు. జనసేనాని కూడా తమతోనే లవ్ లో ఉన్నారని బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు. బిజెపితో ప్రేమను పవన్ కళ్యాణ్ కూడా ఖండించడం లేదు కానీ తాను చంద్రబాబును కూడా ప్రేమిస్తున్నానని ఆయన చెప్పుకొస్తున్నారు. బిజెపి నాయకత్వం ఒప్పుకుంటే బిజెపి-టిడిపిలు రెండింటితోనూ కాపురం చేస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అయితే బిజెపి అగ్రనేతలు మాత్రం ఆ చంద్రబాబును అతగాని ప్రేమను మర్చిపోయి తమతోనే కాపురం చేయాలని పవన్ కు నూరిపోశారని సమాచారం.
చంద్రబాబు పై ప్రేమను మర్చిపోలేకపోతోన్న పవన్ కళ్యాణ్ తాను మొదటి నుంచీ ద్వేషించే జగన్ మోహన్ రెడ్డిని ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని భావిస్తున్నారు. ఓటు చీలకుండా ఉండాలంటే విపక్షాల మధ్య ఐక్యత అవసరమని ఆయన భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడితో పొత్తుకు సిద్ధపడ్డానని కూడా పవన్ కళ్యాణ్ వివరించారు.
పవన్ కళ్యాణ్ ఆలోచన సరియైనదే అంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే విపక్షాల మధ్య చీలికలు ఉంటే జగన్ మోహన్ రెడ్డి సునాయసంగా మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయని వారు భావిస్తున్నారు. దాన్ని అడ్డుకోవాలంటే ఇష్టం ఉన్నా లేకపోయినా టిడిపితో జట్టు కట్టక తప్పదన్నది పవన్ ఆలోచన. ఇక్కడే పవన్ లో రాజకీయ పరిణతి కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక చంద్రబాబు మాత్రం బిజెపిని ఎలాగైన సరే తన దారికి తెచ్చుకోవలసిందే అని పట్టుదలగా ఉన్నారు. చంద్రబాబు బిజెపి వెంట పడుతోంటే ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో ఒకటైన సిపిఐ చంద్రబాబు వెంట పడుతోంది. సిపిఐ అగ్రనేతలు నారాయణ, రామకృష్ణలు ఏ ఇష్యూ వచ్చినా చంద్రబాబుపై తమకున్న ప్రేమను చాటుకోడానికి పోటీలు పడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపిని మంత్రులు విమర్శిస్తే టిడిపి నేతలకన్నా ముందుగా సిపిఐ రామకృష్ణే నోరు చేసుకుంటున్నారు.
టిడిపి కార్యాలయం నుంచే సీపీఐ నేతలకు కూడా స్క్రిప్ట్ వచ్చేస్తోందని అంటున్నారు. చంద్రబాబు ఏం ఆరోపణలు చేస్తారో సరిగ్గా అవే ఆరోపణలను అక్షరం పొల్లు పోకుండా సిపిఐ కూడా చేస్తోంది. ఇలా చంద్రబాబును మంచి చేసుకుని ఆయన మనసు గెలుచుకుని వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకోవాలన్నది ఏపీ సీపీఐ ఆలోచనగా చెబుతున్నారు. అయితే కమ్యూనిస్టులతో పొత్తు వల్ల దమ్మిడీ లాభం లేదన్నది చంద్రబాబు అభిప్రాయంగా చెబుతున్నారు. లాభం లేనిదే కనీసం నవ్వను కూడా నవ్వని చంద్రబాబు నాయుడు ఎన్నికల దాకా కమ్యూనిస్టులను పక్కన పెట్టుకుని తిరుగుతారే తప్ప వారితో పొత్తు పెట్టుకోరని టిడిపి సీనియర్లు అంటున్నారు. 2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్నారు కమ్యూనిస్టులు. అయితే ఆ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. 2024 ఎన్నికల్లోనైనా ఏపీలో బోణీ కొట్టాలని కామ్రేడ్లు పంతంగా ఉన్నారు. ఒక వేళ టిడిపి ,జనసేనలు తమతో పొత్తుకు సిద్దంగా లేకపోతే కాంగ్రెస్ తో నైనా జట్టు కట్టేద్దామని కమ్యూనిస్టులు ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నిజానికి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు భావించారు. అయితే కాంగ్రెస్-టిడిపి పొత్తును జనం ఆమోదిస్తారో లేదో తేల్చుకునేందుకు తెలంగాణాను ప్రయోగశాలగా వాడుకున్నారు. ఏపీ ఎన్నికలకు ముందుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి కూటమి కట్టారు చంద్రబాబు. అయితే తెలంగాణ ప్రజలు ఆ పొత్తులను తిరస్కరించి బి.ఆర్.ఎస్. కే పట్టం కట్టారు. అయినా చంద్రబాబు పూర్తిగా ఆశ చావక ఏపీలో అదే కాంగ్రెస్ తో తెరచాటు పొత్తు పెట్టుకున్నారు. పైకి పొత్తు లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లకు టిడిపి తరపున టికెట్లు ఇచ్చి లోక్ సభ ఎన్నికల బరిలో దింపారు. అయితే ఒక్కరు కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోవడంతో కాంగ్రెస్ ను ఏపీ ప్రజలు క్షమించే ప్రసక్తే లేదని చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ కూ అర్ధమైంది. అందుకే కాంగ్రెస్ తో పొత్తులు పక్కన పెట్టి కాంగ్రెస్ మాజీ నేతలకు రెడ్ కార్పెట్ వెల్ కమ్ చెప్పడం బెటరని చంద్రబాబు భావిస్తున్నారు. అందులోభాగంగానే కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలకు కన్నుగీటారు. బిజెపి కి రాజీనామా చేసిన కన్నా టిడిపిలో చేరగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో అసహనంగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి టిడిపిలో చేరడానికి మంచి ముహూర్తం చూసుకుంటున్నారు. మొత్తానికి ఎన్నికల వేడి ఇపుడిపుడే పెరుగుతోంటే విపక్షాల ఆలోచనలూ వేడెక్కుతున్నాయి.