అమరావతే జగన్ ఆయుధమా ?

By KTV Telugu On 26 January, 2023
image

రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాలన్నది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం. కాదు కూడదు అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలన్నది చంద్రబాబు పంతం. మూడు రాజధానులు ఏర్పాటు చేయకుండా అందుకే చంద్రబాబు నాయుడు తన వర్గీయుల చేత కోర్టులో పిటిషన్లు వేయించారు. హైకోర్టు అయితే ఇప్పటికే మూడు రాజధానులకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. అమరావతి మాత్రమే రాజధాని అంది. అయితే దీన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. అక్కడ దీనిపై వాదోప వాదనలు జరుగుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు వెలువడే వరకు మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యం కాదు. ఒక వేళ 2024 అసెంబ్లీ ఎన్నికల నగరా మోగే వరకు కూడా సుప్రీం తీర్పు రాకపోతే పరిస్థితి ఏంటి. నిజంగానే అప్పటి వరకు తీర్పు రాకపోతే అది ఒక విధంగా జగన్ మోహన్ రెడ్డికి వరమే అని చెప్పాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

న్యాయస్థానం చెప్పేవరకు ముందుకు కదలడానికి వీల్లేదు కాబట్టి మూడు రాజధానులు ఏర్పాటు చేయలేరు. ఎన్నికలొస్తే ఎన్నికల ప్రచారంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఈ సారి మా విధానం మూడు రాజధానులే అని స్పష్టం చేయడం ఖాయం అంటున్నారు రాజకీయ పండితులు. ఒక వేళ దాన్ని టిడిపి ఖండిస్తే ఏమవుతుంది. అమరావతి తప్ప మిగతా ప్రాంతాల్లో టిడిపి పట్ల వ్యతిరేకత పెల్లుబుకుతుంది. అది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ, ఉత్తరాంధ్రలకు రాజధానులు వద్దు అని గట్టిగా చెప్పలేరు. కేవలం అమరావతిలోనే లక్షకోట్లు ఖర్చు పెట్టాలి అని డిమాండూ చేయలేరు. ఒక వేళ తాము అధికారంలోకి వస్తే అమరావతి తప్ప మిగతా ప్రాంతాల్లో రాజధానులకు తాము వ్యతిరేకమని వాదించనూ లేరు.

ఇదే జగన్ వ్యూహం. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి తమ లక్ష్యమనడం ద్వారా జగన్ మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాల ప్రజల మనసులూ దోచుకుంటున్నారు. దానికి భిన్నంగా టిడిపి అండ్ కోలు ఒక్క అమరావతినే అభివృద్ధి చేయాలంటున్నారు. పోనీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అమరావతిని వ్యతిరేకిస్తోందా అంటే అదీ లేదు. అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేస్తామనే జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు. అమరావతిలోనే శాసన రాజధాని కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. అమరావతి రైతులకు ఏ విధంగానూ నష్టం రాకుండా చూసే బాధ్యత తమదని మంత్రులు పదే పదే చెబుతున్నారు. ఇన్ని చెప్పాక ప్రభుత్వం అమరావతికి అన్యాయం చేస్తోందని ప్రచారం చేయడం టిడిపికి కూడా సాధ్యం కాకపోవచ్చునంటున్నారు రాజకీయ పండితులు.

గత ఎన్నికల్లో రాయలసీమలో టిడిపికి వచ్చినవి మూడే మూడు సీట్లు. చంద్రబాబు నాయుడు, పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణలు మాత్రమే ఆ ఎన్నికల్లో గెలిచారు.  మిగతా సీమనంతటినీ జగన్ మోహన్ రెడ్డి ఊడ్చి పారేశారు. ఇపుడు న్యాయ రాజధానికి టిడిపి వ్యతిరేకంగా ఉందని తెలిస్తే 2024 ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఇక కలే. అదే విధంగా ఉత్తరాంధ్రలోనూ కార్యనిర్వాహక రాజధానికి చంద్రబాబు వ్యతిరేకమని తేలితే ఉత్తరాంధ్ర ప్రజలు టిడిపిని తిరస్కరించక తప్పదు. అక్కడా వైసీపీ ఫ్యానే గిర్రుమని తిరుగుతుంది. అపుడు అమరావతి ప్రాంతంలో ఒకటి రెండు సీట్లు తగ్గినా వైసీపీ అధికారానికి ఢోకా ఉండదు. సూపర్ మెజారిటీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. సో చంద్రబాబుకు ఏం నిర్ణయం తీసుకోవాలో పాలుపోని స్థితిని కల్పించారు జగన్ మోహన్ రెడ్డి.