టిడిపి-జనసేనల పొత్తు ఎన్నికల్లో కూటమికి ఎంత మైలేజీ ఇస్తుందో తెలీదు కానీ ఎన్నికల లోపు రెండు పార్టీల్లో మాత్రం ఆరని చిచ్చు రాజేస్తోందన్నది వాస్తవం. అటు టిడిపిలోనూ ఇటు జనసేనలోనూ సీట్ల కేటాయింపుపై అసంతృప్త జ్వాలలు ఎగసి పడుతున్నాయి. రెండు పార్టీలు పొత్తులు పెట్టుకున్నప్పుడు ఇటువంటివి సహజమే అయినప్పటికీ రెండు పార్టీల నాయకత్వాలకీ పెద్ద తలనొప్పిగా మారింది వ్యవహారం. ఎన్నికల నగారా మోగిన వెంటనే ఈ గొడవలన్నీ సద్దుమణుగుతాయని రెండు పార్టీల నాయకత్వాలూ ధీమాగా ఉన్నాయి. అటు పాలక వైసీపీలోనూ అసంతృప్త జ్వాలలు మండుతూనే ఉన్నాయి.
పొత్తులో భాగా ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించడంపై తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అనకాపల్లి అసెంబ్లీ స్థానంతో పాటు లోక్ సభ స్థానాన్ని కూడా జనసేనకు కేటాయించారు చంద్రబాబు. అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుండి ఈ మధ్యనే జనసేనలో చేరిన కొణతాల రామకృష్ణ పేరు ప్రకటించారు పవన్. చిత్రం ఏంటంటే ఈ మధ్యనే టిడిపిలో చేరిన మరో సీనియర్ నేత దాడి వీరభద్రరావు తన కుమారుడికి అనకాపల్లి సీటు దక్కించుకుందామనుకున్నారు. అది కాస్తా జనసేనకు పోవడం ఆయనకు జీర్ణం కావడం లేదు. మరో వైపు తన రాజకీయ శత్రువు అయిన కొణతాల రామకృష్ణ విజయం కోసం తాను పనిచేయాల్సి రావడంతో ఆయన మండి పడుతున్నారు.
ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఈ సారి టిడిపి తరపున బరిలో దిగాలనుకున్నారు. అందుకోసం ఆయన చాలా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ పార్టీ చరిత్రలో మొదటి సారి చంద్రబాబు అనకాపల్లిని జనసేనకు ఇచ్చేయడంతో పీలా వర్గీయులు నిప్పులు చెరుగుతున్నారు.
గోవింద్ కు సీటు రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు.. నల్ల బ్యాడ్జీలతో తమ అసంతృప్తిని టిడిపి అధిష్టానంకు తెలియజేశారు.. అనకాపల్లి టీడీపీలో రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తిని చల్లబరిచేందుకు పీలా గోవిందును చంద్రబాబు అమరావతి పిలిపించి చర్చలు జరిపారు..
ఈసారి జనసేనకు సహకరించాలని సూచించారు.. పీలా మాత్రం తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తన మనసులో మాటను చంద్రబాబు ముందు ఉంచారు.
చంద్రబాబు సీటు ఇవ్వడానికి నిరాకరించడంతో అసంతృప్తిగానే పీలా బయటకు వచ్చారు. అనకాపల్లి ఎమ్మెల్యే సీటు ఈసారి తనకే వస్తుందని అనకాపల్లి జనసేన నేత పరుచూరి భాస్కరరావు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.. భాస్కర్ రావు ఆశలను నిరాశ చేస్తూ పవన్ కళ్యాణ్ కొణతాలకు అనకాపల్లి సీటు కేటాయించారు.. దీంతో తీవ్ర నిరాశకు గురైన పరుచూరి భాస్కరరావు కార్యకర్తల సమక్షంలోనే కన్నీటి పర్యంతమయ్యారు.. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు.. పవన్ తన నిర్ణయాన్ని పునపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
వీరిద్దరి సంగతి పక్కన పెడితే కొణతాలకు రాజకీయంగా బద్ధ శత్రువు అయిన దాడి వీరభద్రరావు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు.. వీరభద్ర రావు ఆయన కుమారుడు రత్నాకర్ కు సీటు వస్తుందని ఆశించారు. టిడిపి జనసేన పొత్తులో భాగంగా ఆ సీటును చంద్రబాబు జనసేనకు కేటాయించారు. దాడి వీరభద్ర రావు వర్గీయులు బయటికి ఏమి మాట్లాడకపోయినా లోలోపల రగిలిపోతున్నారు.. రాజకీయ ప్రత్యర్థి అయిన కొణతాలతో కలిసి ఎలా పని చేస్తామంటున్నారు.. కొణతాలతో శత్రుత్వం ఈనాటిది కాదని మూడు దశాబ్దాలకు పైగా వైరం ఉన్న సంగతిని గుర్తు చేస్తున్నారు.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొణతాల తమపై అనేక తప్పుడు కేసులు పెట్టి టిడిపి కార్యకర్తలను అనేక రకాలుగా వేధించారు అంటున్నారు.
పచ్చ గడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి రెండు వర్గాల మధ్య ఉంది.. సీటు రాకపోవడంతో ఈ మూడు వర్గాల నేతలు కొణతాలపై కారాలు మిరియాలు నూరుతున్నారు.. ఇటీవల పార్టీలో చేరిన వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.. పదేళ్ల నుండి కొణతాల రాజకీయాలకు దూరంగా ఉన్నారని, ప్రజలతో సంబంధాలు లేని వ్యక్తికి అధిక ప్రాధాన్యత ఏ విధంగా వఇస్తారంటున్నారు.. మూడో వర్గాలు కొణతాలకు వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వీరు జనసేన గెలుపుకు ఎంతవరకు సహకరిస్తారు అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…