కాంగ్రెస్ డీఎన్ఏ కాస్త ఉన్నా విపరీతమైన స్వేచ్ఛేమీ ఉండదు. ఎంత పెద్ద నాయకుడైనా అదుపులో ఉండాల్సిందే. నోరుజారినా మాట తూలినా నాలుగ్గోడల మధ్య స్పెషల్ క్లాసు ఉంటుంది. అయినా మా ఇష్టం అంటే వైసీపీలో ఇంతే సంగతులు. చిత్తగించవలెను అన్నట్టే ఉంటుంది. నెల్లూరుజిల్లాలో సీనియర్ మోస్ట్ ఆనం రామనారాయణరెడ్డికే పార్టీని తప్పుపడితే ఏం జరుగుతుందో తెలిసొస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే వెంకటగిరి వైసీపీకి మరో ఇంచార్జిని నియమించేసింది పార్టీ నాయకత్వం. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కొడుకు రాంకుమార్కి బాధ్యతలు అప్పగించింది. ఆనం రామనారాయణరెడ్డి పరిపక్వత లేని నాయకుడేం కాదు. అపార అనుభవమున్న సీనియర్. ఆయనే నోరుజారారంటే మరో ఆలోచనతో ఉన్నాడనే అర్ధం. అందుకే అస్సలు ఆలస్యం చేయకుండా వైసీపీ అధినాయకత్వం తన పని తాను చేసుకుపోతోంది.
సొంతపార్టీ ఎమ్మెల్యేనే ప్రభుత్వవిధానాలను తప్పుపట్టారు. సలహాలిచ్చే అవకాశమున్న నాయకుడే నోరుజారటంతో ఆయన వైసీపీని వీడటం ఖాయమనుకుంటోంది నాయకత్వం. అందుకే మంతనాలు బుజ్జగింపుల జోలికి వెళ్లకుండా వెంకటగిరిలో తన ప్రత్యామ్నాయమేంటో కేడర్‌కి చెప్పేసింది. కాంగ్రెస్‌నుంచి టీడీపీలోకొచ్చి తర్వాత వైసీపీలో చేరారు ఆనం రామనారాయణరెడ్డి. మళ్లీ ఆయన టీడీపీలో చేరి ఆత్మకూరు నుంచి పోటీ చేయొచ్చని ఒకవేళ ఆయన కాకుంటే కూతురు కైవల్యారెడ్డి పోటీ చేస్తారని చెబుతున్నారు. అందుకే పొమ్మనకుండా పొగబెట్టేసిన వైసీపీ పెద్దలు ఇప్పుడాయన సెక్యూరిటీని కూడా కత్తిరించారు. ఆనంకున్న 2+2 సెక్యూరిటీని 1+1కి కుదించింది ప్రభుత్వం. ఆనం స్థానంలో వెంకటగిరి వైసీపీ ఇంచార్జిగా వచ్చిన నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి అప్పుడే చక్రం తిప్పేస్తున్నారు. అధికారులు కూడా ఎమ్మెల్యేని పక్కనపెట్టి ఇంచార్జికి అనుకూలంగా నడుచుకుంటున్నారు.
ఆనం సంగతలా ఉంచితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైఖరిపైనా వైసీపీ నాయకత్వం ఓ కన్నేసి ఉంచింది. పిలిచి మాట్లాడినా స్వయానా అధినేత భరోసా ఇచ్చినా వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. పదిమంది రౌడీల్ని వెంటేసుకుని తిరగడం చేతగాక పాతతరం నాయకుడిగా మిగిలిపోయానన్న కృష్ణప్రసాద్. ఎమ్మెల్యే ఎందుకయ్యానా అని బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు. ఆయన టీడీపీకి టచ్‌లో ఉన్నారని ఆయనొస్తే గన్నవరంనుంచి పోటీచేయించే ఆలోచనలో ఆ పార్టీ ఉందనే ప్రచారం జరిగింది. దీంతో మైలవరంలో మంత్రి జోగి రమేష్‌కి వైసీపీ ఫ్రీహ్యాండ్ ఇచ్చేసింది. వసంతని బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేయడంలేదు. వసంత పార్టీమారితే అక్కడినుంచి పోటీకి జోగి రమేష్ రెడీగా ఉండటంతో వసంత విషయంలో ఉంటే ఉండు పోతే పో అన్నట్లే వ్యవహరిస్తోంది వైసీపీ. రేపోమాపో వసంత కృష్ణప్రసాద్ కూడా దాగుడుమూతలకు తెరదించి కండువా మార్చేలా కనిపిస్తున్నారు.