విభజనకు పదేళ్లు – చితికిన ఆంధ్రా !

By KTV Telugu On 31 May, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రులు తెలివైన వారు.. వారు లేకపోతే తెలంగాణకు పాలన చేతకాదు లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కొంత మంది. కానీ ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత చూస్తే… ఆంధ్రులే తెలివి తక్కువ వారని ఎవరైనా చెబుతారు.  పదేళ్లలో తెలంగాణ రాజకీయాలను రాజకీయంగానే చూసి ముందడుగు వేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ముందడుగు వేస్తే.. ఏపీ మాత్రం రాజకీయాలతో రాష్ట్రాన్ని కుంగదీసుకుంది. ఇప్పుడా రాష్ట్రానికి రాజధాని కూడా లేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు.. సీమాంధ్ర ప్రజలు అసలు  సమైక్యాంధ్ర కోసం పోరాడారు. గతంలో ఉద్యమం  జరిగినప్పుడు జై ఆంధ్ర పోరాటం చేశారు. కానీ ఈ సారి మాత్రం.. సమైక్యంగా ఉండాలని  పోరాడారు. అయితే పెరిగిపోతున్న ప్రాంతీయ ఆకాంక్షల కారణంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం సాధ్యం కావడం లేదంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేసింది.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేక సవాళ్లను ఎదుర్కొంది. అవశేష ఆంధ్రప్రదేశ్ గా మిగిలింది. ఈ క్రమంలో పదేళ్లలో  రెండు ప్రభుత్వాలు వేర్వేరు పార్టీలవి ఏర్పడటం.. రెండు ప్రభుత్వాల తీరు భిన్నమైనవి కావడంతో ఏపీ పూర్తిగా చితికిపోయిందని అనుకోవచ్చు. మొదటగా బాధ్యతలు చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఏపీకి అమరావతిని రాజధానిగా నిర్ణయించి.. ఓ కొత్త మోడల్ తో అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రారంభించాలని అనుకుంది. ఐదేళ్లలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుతో పాటు అమరావతిని  సమాంతరంగా నిర్మిస్తూ ముందుకెళ్లారు. కానీ ఐదేళ్లకే  ప్రజలు వేరే విధంగా ఆలోచించారు. చంద్రబాబుకు ఘోర పరాజయాన్ని  ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టారు. అయితే జగన్ ప్రాధాన్యాలు వేరు. ఆయన పూర్తిగా సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకున్నారు. బటన్ నొక్కే పథకాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా ఏపీ ఐదేళ్ల కిందట ఎలా ఉందో.. అక్కడే ఉంది..

రాజధానిగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా అమరావతిని ఖరారు చేసినప్పటికీ.. అలా అంగీకరించిన వారే తర్వాత మూడు రాజధానుల పేరుతో మడమ తిప్పేయడంతో రాజధాని పరిస్థితి గందరగోళంలో పడిపోయింది. అమరావతి పేరుతో రైతుల వద్ద నుంచి భూములు సేకరించకపోయి ఉన్నట్లయితే.. జగన్ ఎక్కడ రాజధాని కావాలంటే అక్కడ ఏర్పాటు చేసుకుని ఉండేవారు. కానీ రాజధాని రైతులతో చేసుకున్న ఒప్పందాలతో ఆయన మూడు రాజధానుల విషయంలో ముందడుగు వేయలేకపోయారు. రైతులకు పరిహారం ఇచ్చి తన రాజధానుల కల నెరవేర్చుకున్నా సమస్య ఉండేది కాదు. కానీ అలా కూడా చేయలేదు. ఫలితంగా ఏపీకి రాజధాని లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అంతే. నవయుగ సంస్థ శరవేగంగా నిర్మిస్తున్న ప్రాజెక్టును తాను రాగానే రివర్స్ టెండరింగ్ పేరుతో మేఘా సంస్థకు కట్టబెట్టంతో ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయింది. నిర్మాణం అసలు ముందుకు సాగలేదు. ఫలితంగా కొత్త సమస్యలు వచ్చాయి. ఆర్ అండ్ ఆర్ సంగతి తేలడం లేదు. ఫలితంగా తాము అధికారంలోకి వస్తే రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన ప్రాజెక్టును.. మరోసారి ఎన్నికలకు వెళ్తూ వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటి ఐదేళ్లు ఆశాజనకంగా ఉన్న అమరావతి, పోలవరం. తర్వాత ఐదేళ్లు పడకేశాయి. ఈ విషయాల్లో ఏపీ పూర్తి స్థాయిలో వెనుకబడిపోయింది.

విభజనతో ఏపీ వ్యవసాయ అధారిత రాష్ట్రంగా మారింది. పరిశ్రమలు పెద్దగా లేవు, మొదటి ఐదేళ్లు తెలుగుదేశం హయాంలో సీఎం చంద్రబాబు పరిశ్రమల్ని ఆకర్షించేందుకు విస్తృత ప్రయత్నాలు చేశారు. కియా లాంటి అతి పెద్ద విదేశీ పెట్టుబడుల్ని తీసుకు వచ్చారు.  విశాఖ , విజయవాడ,తిరుపతి లాంటి చోట్లకు భిన్న రంగాల పరిశ్రమల్ని ఆకర్షించారు.తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చే ప్రయత్నంలో అనేక పరిశ్రమల్ని ఆకర్షించారు. పారిశ్రామికీకరణ ఊపందుకుంటోందనుకున్న దశలో ప్రభుత్వం మారింది. జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యతలు వేరు కావడంతో పరిశ్రమలు కూడా పెద్దగా రాలేదు.   గత ఐదేళ్లలో  ఏపికి వచ్చిన  పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు లేవు. అలాగే విద్య కోసం కోసం కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ఇంటర్ వరకూ ఏపీలో చదువుకున్నా.. పై స్థాయి అవకాశాల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు.  విభజన తర్వాత తమ రాష్ట్రాన్ని గాడిన పడేసుకోవడానికి  రాష్ట్రం కేంద్రంగా రాజకీయాలు చేయాల్సిన పార్టీలు గాడి తప్పాయి.  ఫలితంగా ఏపీ వెనుకబడిపోయింది.

విభజన చట్టంలోని హామీలను తెలంగాణతో పోలిస్తే ఏపీ ఎక్కువ సాధించింది.  ఈ వివరాలను మరో వీడియోలో చూద్దాం

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి