రెడ్డి Vs కమ్మ – ఏపీ రాజకీయం మారదా ? – Andhra Caste Politics

By KTV Telugu On 5 April, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్ రాజకీయం పూర్తిగా రెండు సామాజికవర్గాల సమరంగా మారింది. టిక్కెట్లను కుడా ఆయా పార్టీలు మెజార్టీ రెండు వర్గాలకే కేటయించాయి. మిగతా ఓసీలు..  ఇతర వర్గాలకు వారికి లభించినంత ప్రాధాన్యం లభించలేదు.  ఎంతగా సామాజిక చైతన్యం వస్తున్నప్పటికీ ఏపీ రాజకీయం ఎందుకు మారడం లేదు ?. అసలేం జరుగుతోంది ?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల యుద్ధానికి శంఖారావాలు పూరించాయి అన్ని పార్టీలు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించాయి. 2024 ఎన్నికలు చాలా అసాధారణమైనవని అందరూ చెబుతున్నా ఏ ఒక్కరూ తమ గెలుపు గుర్రాలను మాత్రం వదులు కోలేదు.  సంఖ్యాపరంగా చిన్నవైన రెండు సామాజిక వర్గాలదే పైచేయిగా ఆంధ్రా పాలిటిక్స్‌లో నిలిచింది. చిన్నవి అయినప్పటికీ సామాజికంగా బలమైన రెండు కులాలు ఆంధ్ర రాజకీయ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీలోనూ అది రుజువు అయింది.  ఈ రెండూ పార్టీలు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకే అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్లలో సింహభాగం కేటాయించాయి.

ప్రస్తుతం ఉన్న అనధికార జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో బీసీలు 35 శాతం ఉంటారని అంచనా. కమ్మలు ఐదు నుంచిఆుర శాతం, రెడ్లు సుమారు 8 శాతం ఉంటారని లెక్కలున్నాయి.  ఆంధ్రా రాజకీయాల్లో కమ్మ, రెడ్ల మధ్యనే తరతరాలుగా అధికార మార్పిడి జరుగుతోంది. 1956 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు రెడ్లు, ఏడు సార్లు కమ్మ వారు సీఎం పదవిని అలంకరించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావం వరకు రెడ్లు కాంగ్రెస్‌తోనే కొనసాగారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌ నామరూపాలు లేకుండా పోయింది.

సామాజిక సమతూకమే తమ ఉద్దేశమన్న వైసీపీలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 49 మంది రెడ్లు అత్యధికంగా టికెట్లను సంపాయించారు. ఇక టీడీపీలోనైతే సహజంగా తమకు అండగా నిలిచే కమ్మ సామాజికవర్గీయులకు 34 టికెట్లు దక్కాయి.  మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 29 షెడ్యూల్డ్‌ కులాలకు, ఏడు షెడ్యూల్డ్‌ తెగలకు రిజర్వు అయ్యాయి. మిగతా 139 అన్‌ రిజర్వ్‌డ్‌ సీట్లలో బీసీలకు అగ్రస్థానం లభించాలి. రెండు పార్టీలలోనూ ఆ పరిస్థితి కనిపించలేదు. బీసీలలో 140కి పైగా కులాలు, ఉపకులాలు ఉన్నాయి.  అగ్రవర్ణాల విషయానికి వస్తే కాపులు 15 శాతం కంటే ఎక్కువ. కానీ ఈ వర్గం ఎన్నడూ అధికారం ఛాయలకు కూడా రాలేదు. ప్రముఖ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు కాస్త హడావిడి కన్పించినా అది మధ్యలోనే అంతర్థానమైంది. ఆ తర్వాత చిరంజీవి తమ్ముడు, నటుడు పవన్‌ కల్యాణ్‌ జనసేన ఏర్పాటు చేసినా కాపులంగా ఐక్యంగా ఆ పార్టీకి మద్దతుగా నిలవకపోవడంతో  టీడీపీతో జత కట్టారు.

కాపులకు పార్టీ సారథ్యం అప్పగించి కాపుల్ని తమవైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నించినా ఆ ప్రయత్నం నెరవేరలేదు.  మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హయాంలోగాని సోము వీర్రాజు కాలంలో గాని బీజేపీ వైపు కాపులు తొంగి చూడలేదు.  139 అన్‌రిజర్వ్‌డ్‌ సీట్లలో 91 మంది అగ్రవర్ణాల అభ్యర్థులకు వైసీపీ టికెట్లు ఇచ్చింది. వైఎస్‌ఆర్‌సీపీ కేవలం 41 మంది బీసీ అభ్యర్థులను బీసీలను బరిలోకి దింపింది. అగ్రవర్ణాలకు చెందిన 91 మంది అభ్యర్థుల్లో 49 మంది రెడ్లు, 23 సీట్లు కాపులకు ఇచ్చింది. 9 సీట్లు కమ్మ సామాజిక వర్గీయులకు ఇచ్చింది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. టీడీపీ నేతృత్వంలోని మహాకూటమి 38 మంది బీసీ అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది. 34 మంది కమ్మ, 29 మంది రెడ్డి, 18 మంది కాపులకు టిక్కెట్లు ఇచ్చింది. మిగతా అన్ని కులాలకు కలిపి 20 సీట్లు ఇచ్చింది. వీరిలోనే బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ, వైశ్య వర్గాలు ఉన్నాయి.

ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చినా అధికారం మాత్రం.. రెడ్డి, కమ్మ వర్గాల మధ్యనే మార్పిడి జరుగుతోంది. భవిష్యత్ లో కాపు నాయకులు ఆ స్థానానికి పోటీ పడవచ్చు. కానీ అది అంత దగ్గరలో ఉందని ఎవరికీ అనిపించడంలేదు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి