జగన్ అంతే. మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వెళ్లిపోతారు. అలుగుతారనో వెళ్లిపోతారనో అస్సలు కేర్ చేయరు. ఓ పక్క ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిల ఎపిసోడ్స్ కళ్లముందున్నా తాను అనుకున్నది చేసుకుపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే మంత్రులకు ముందే చెప్పేశారు జగన్. రెండున్నరేళ్ల తర్వాత కొత్తవాళ్లకి అవకాశం ఇస్తామని చెప్పారు. చివరికి అదే పనిచేశారు. కొన్ని సమీకరణాలతో కొందరిని అలాగే కొనసాగిస్తూ కొత్తవారికి అవకాశం ఇచ్చారు. కొందరు మంత్రులు బాధపడ్డా బయటపడలేదు. కొందరు బయటపడ్డా మళ్లీ సర్దుకుపోయారు.
అసెంబ్లీ ఎన్నికలదాకా ఇదే కేబినెట్ ఉంటుందనుకున్నా మళ్లీ కొన్ని మార్పులకు జగన్మోహన్రెడ్డి సిద్ధమవుతున్నారు. మరోసారి మంత్రివర్గ విస్తరణకు కసరత్తుచేస్తున్నారు. ఇప్పుడున్న కేబినెట్లో ఐదుగురిని తప్పిస్తారన్న ప్రచారంతో మంత్రుల్లో గుబులు మొదలైంది. ఆ ఐదుగురూ ఎవరన్నదానిపై ఎవరికి తోచింది వారు విశ్లేషించుకుంటున్నా జగన్ నిర్ణయమే ఫైనల్. మళ్లీ కొనసాగించిన మంత్రుల్లో ఒకరిద్దరిని తప్పించడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి సీదిరి అప్పలరాజును కచ్చితంగా తప్పించబోతున్నారట. పనితీరుతో మెప్పించలేకపోయినవారినే తప్పించబోతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులోనే విస్తరణ ఉండొచ్చు. కొత్తగా ఎమ్మెల్సీలు అయ్యేవారిలో ఐదుగురిని కేబినెట్లోకి తీసుకోవచ్చన్న మాట గట్టిగానే వినిపిస్తోంది.
కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలకే పెద్దపీట వేయబోతున్నారు జగన్. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికని చూస్తేనే ఆయనెంత వ్యూహాత్మకంగా ఉన్నారో తెలిసిపోతుంది. ఆర్నెల్ల కిందట కేబినెట్ మీటింగ్‌లోనే కొందరిని తప్పించబోతున్నట్లు సీఎం జగన్ సంకేతాలిచ్చారు. అందులో తామెవరయినా ఉండొచ్చని మంత్రులంతా ఫిక్స్ అయిపోయారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టటంతో కొందరు మంత్రులు యాక్టివ్‌గా లేరన్న అసంతృప్తి ముఖ్యమంత్రిలో ఉంది. కేబినెట్ నుంచి తప్పించిన కొడాలి నాని, పేర్ని నాని ఈ విషయంలో ముందున్నా పదవుల్లో ఉన్నవారు స్పందించకపోవటం వారికి మైనస్ అయ్యింది. ఈ సమీకరణాలన్నీ ఏపీ కేబినెట్ విస్తరణలో ప్రభావం చూపించబోతున్నాయి.