మూడు రాజధానులపై ప్రభుత్వం మనసు మార్చుకుందా. బెంగళూరు ఇండస్ట్రీ మీట్‌లో ఆర్థికమంత్రి బుగ్గన వ్యాఖ్యలను ఏవిధంగా చూడాలి. ఏపీకి త్రీ క్యాపిటల్స్ అనే మాట మిస్ కమ్యూనికేషన్ అంటూ బుగ్గన హాట్ కామెంట్స్ చేశారు. ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయన్న అంశం పూర్తిగా తప్పుడు సమాచారమని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచి నిర్వహించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా జగన్ సర్కార్ మూడు రాజధానులను ప్రకటించింది. న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం పేర్లను ప్రతిపాదించింది. అమరావతే ఏకైక రాజధాని అంటూ అధికార పార్టీ మినహా ఏపీలోని అన్ని పార్టీలు ఇప్పుటివరకు నినదించాయి. అనేక ఉద్యమాలు జరిగాయి. కానీ అవన్నీ పక్కనబెట్టి మూడు రాజధానులకే ప్రభుత్వం మొగ్గుచూపింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే ఇలాంటి సమయంలో ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం గమనార్హం.
విశాఖకు మారిపోతామని అక్కడి నుంచే పరిపాలన చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన కొద్దిరోజుల్లోనే ఆర్ధికమంత్రి క్లారిటీ ఇచ్చారు. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ ప్రచారంలో భాగంగా ఇన్వెస్టర్లు అడిగిన పలు ప్రశ్నలకు బుగ్గన సమాధానాలిచ్చారు. విశాఖపైనే ఎందుకు దృష్టి పెట్టారు పారిశ్రామిక గ్రోత్ ఏరియా కింద తిరుపతి, విజయవాడల్ని ఎందుకు ఎంచుకోలేదంటూ ఇన్వెస్టర్లు ప్రశ్నించారు. ఐటీ పరిశ్రమలు సంబంధిత పెట్టుబడుల్ని విశాఖపట్నానికి ఆకర్షించాలనేది ప్రభుత్వ నిర్ణయమని మంత్రి బుగ్గన సమాధానమిచ్చారు. తదుపరి రాజధానిగా ప్రభుత్వం విశాఖనే నిర్ణయించిందని బుగ్గన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి బుగ్గన మరో విషయాన్ని స్పష్టం చేశారు. కర్నూలు రాజధాని కాదని కేవలం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి బుగ్గన తెలిపారు. అదే విధంగా గుంటూరులో కూడా అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం మేరకు మూడు ప్రాంతాల అభివృద్ధికి అనుగుణంగా ఈ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇక తిరుపతి ప్రపంచానికే ఆధ్యాత్మిక రాజధాని అని చెప్పారు.
ఇప్పటికే ఏపీలో రాజధాని విషయంలో గందరగోళం నెలకొంది. రాష్ట్ర విభజన జరిగి 9ఏళ్లు కావొస్తున్నా ఏపీ ప్రజలు రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితులో ఉన్నారు. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి ముందుకెళ్తే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని విశాఖకు షిఫ్ట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏకంగా సీఎం జగన్ తన నివాసం విశాఖకు మారుతుందని అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తామని కూడా స్పష్టం చేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకే ప్రభుత్వం పూర్తిగా విశాఖనే రాజధానిగా ఉంటుందని చెబుతుందా లేక నిజంగానే ఏకైక రాజధానిగా విశాఖనే కొనసాగిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. బుగ్గన విశాఖనే అసలైన క్యాపిటల్ అని చెబితే మరో మంత్రి అంబటి వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. మూడు రాజధానులపై ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. వైసీపీ విధానం మూడు రాజధానులే అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే స్ధానిక భావాలున్నాయని వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.