పురంధేశ్వరి సోషల్ మీడియా గేమ్..

By KTV Telugu On 27 April, 2024
image

KTV TELUGU :-

రాజకీయాల్లో కొందరు ఉచ్చనీచాలు పాటించరు. వాళ్లకు ఏదీ తప్పు కాదు. బాక్సింగ్ క్రీడలో బీలో ది బెల్టు కొట్టినట్లుగా వాళ్లు ఎక్కడైనా, ఏదైనా ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై కూడా అదే గేమ్ ను వైసీపీ సోషల్ సైన్యం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.  ఆమెకు సంబంధం లేని అంశాలను సైతం  తెరమీదకు తెచ్చి ఇరకాటంలో పెట్టాలని  చూస్తోంది. పురంధేశ్వరి అవకాశవాది అని, బీజేపీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ప్రచారం చేసేస్తోంది. అందులో నిజం లేదని తెలిసినా  తమ గోబెల్స్  ప్రచారం ఏదోక రోజున నిజమవుతుందన్న పేరాశలో ఒక వర్గం సోషల్ మీడియా పనిచేస్తోంది….

పురంధేశ్వరి బీజేపీ ఏపీ శాఖ  బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ బాగా యాక్టివ్ అయ్యింది. టీడీపీ-జనసేనతో పొత్తు పెట్టుకున్న  తర్వాత రాష్ట్రంలో  పార్టీ విజయావకాశాలు పెరిగాయి. పురంధేశ్వరి చొరవ చూపి, చర్చలు జరిపి పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చేట్టుగా చేశారు. ఆరు లోక్ సభా స్థానాలు, పది అసెంబ్లీ స్థానాలకు బీజేపీ పోటీ చేస్తుండగా…దాదాపుగా అన్ని చోట్ల గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పురంధేశ్వరిని బద్నాం  చేసేందుకు ఒక వర్గం సోషల్ మీడియా ప్రచారం మొదలు  పెట్టింది. ఎప్పుడో జరిగినపోయిన కారంచేడు సంఘటనను గుర్తు చేస్తూ పురంధేశ్వరి దళిత వ్యతిరేకి అని ప్రచారం  మొదలు  పెట్టింది. ఆమె అత్తగారి కుటుంబం ఎస్సీ, ఎస్టీలను అణిచివేసిందని అక్కడక్కడా రాసేస్తున్నారు. నిజానికి కారంచేడులో దళిత ఊచకోతకు, పురంధేశ్వరికి ఎలాంటి సంబంధం లేదు. అప్పట్లో ఆమె రాజకీయాల్లో లేదు. ఆ సంఘటన  జరిగినప్పుడు ఆమె ఎక్కడ ఉన్నారో  కూడా తెలీదు. ఐనా సరే ఇప్పుడు  దాన్ని తవ్వితీసి  పురంధేశ్వరిపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు..

నల్లమల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ వ్యవహారంలో కూడా పురంధేశ్వరిని కార్నర్  చేసే ప్రయత్నం జరుగుతోంది.మరో పక్క ఆమె కాపు వ్యతిరేకి అన్న ముద్ర వేసేందుకు శతవిధాలా పావులు కదుపుతున్నారు…

సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్న  వారి లెక్క ప్రకారం పురంధేశ్వరికి కాపులంటే గిట్టదు. అసెంబ్లీ, లోక్ సభకు కలిసి బీజేపీ తరపున 16 మంది పోటీ చేస్తున్నా ఒక్క కాపుకు కూడా టికెట్ ఇవ్వలేదని వారు పుంఖానుపుంఖాలుగా రాసేస్తున్నారు. కాపులను ఆమె దగ్గరకు రానివ్వరని చెప్పుకుంటూ పోతున్నారు. అనపర్తిలో బీజేపీ అభ్యర్థిని పక్కన పెట్టేందుకు ఆమె స్కెచ్   వేసి మరీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలో చేర్చుకున్నారని వాళ్లు ప్రచారం  చేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల ఏపీలో బీజేపీ దెబ్బతింటుందని, తన మరిది పార్టీ టీడీపీని లబ్ధి చేకూర్చేందుకే ఆమె కమలం పార్టీలో ఉన్నారని కొందరు రాసేస్తున్నారు. పురంధేశ్వరి ఎవ్వరినీ కలుపుకుపోవడం లేదని ఆమె వాళ్లు చేస్తున్న మరో  ఆరోపణ. ఆమె పద్ధతి  నచ్చకే చాలా మంది బీజేపీ నేతలు వైసీపీలో  చేరుతున్నారని కూడా ఆరోపిస్తున్నారు….

విమర్శలను పురంధేశ్వరి పట్టించుకోరని  వాళ్లకు తెలుసు. బీజేపీ అధిష్టానం  అప్పగించిన పని చేసుకుంటూ పోతారని కూడా తెలుసు. పురంధేశ్వరి వల్ల కూటమి బలపడుతోందని  కూడా వారికి అర్థమై ఉండొచ్చు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆమెకు వ్యతిరేక క్రీడ  మొదలు పెట్టారు. ఏదో  విధంగా టెన్షన్  పెట్టి.. డైవర్ట్ చేయడం కోసమే  ఈ ప్రయత్నాలు  కొనసాగుతున్నాయి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి