బాబు బాటలో పురందేశ్వరి?

By KTV Telugu On 15 August, 2023
image

KTV Telugu ;-

ఏపీ బిజెపి అధ్యక్షురాలు  దగ్గుబాటి పురందేశ్వరి ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తున్నారు? ఎవరి అజెండాకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు? ఎవరిని మెప్పించడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అన్నవి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. రాష్ట్రానికి కొత్త అధ్యక్షురాలిగా వచ్చీ రావడంతోనే  పాలక పక్షమైన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆమె టార్గెట్ చేశారు. అది కచ్చితంగా ఆమోదయోగ్యమైనదే. ఎందుకంటే ఏపీలో బిజెపిని బలోపేతం చేసుకోవాలంటే పాలక పక్షంపై పోరాటాలు చేయాలి. కాకపోతే ఆమె దానికి ఎంచుకున్న  మార్గాలే విమర్శలకు దారి తీస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆమె  అనుకున్నది ఒకటైతే  జరుగుతున్నది మరోటిగా ఉండడంతో ఆమె కూడా కంగారు పడుతున్నట్లు చెబుతున్నారు.

పురంధేశ్వరి ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే  ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేసేస్తోందని దుయ్యబట్టారు. నాలుగేళ్ల పాలనలోనే పదిలక్షలకు పైగా అప్పులు చేశారని ఆరోపించారు. అంతే కాదు ఏపీ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేయకుండా..రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను మరింత దిగజార్చకుండా కట్టడి చేయాలంటూ ఏకంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖకే ఫిర్యాదు చేశారు. పురంధేశ్వరి ఇలాంటి ఆరోపణ చేయడానికి రెండు రోజుల ముందే టిడిపి నాయకత్వంతో అంటకాగుతోన్న రఘురామ కృష్ణంరాజు, మాజీ టిడిపి నేత ప్రస్తుత బి.ఆర్.ఎస్. ఎంపీ నామా నాగేశ్వరరావులుకూడా ఏపీ అప్పుల గురించి ప్రశ్నించారు. అంతకు ముందు టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల కూడా ఇదే ప్రశ్న వేశారు. వీటన్నింటికీ కేంద్ర ఆర్ధిక మంత్రి ఒకటే బదులిచ్చారు. ఏపీ ప్రభుత్వం పరిమితులకు లోబడే అప్పులు చేసిందని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన వివరణలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం గద్దె దిగేనాటికి రెండు లక్షల 65వేల కోట్లకు పైగా అప్పులు ఉంటే అవి ఇపుడు జగన్ మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలన తర్వాత 4లక్షల 30 వేల కోట్ల పై చిలుకు మార్క్ కు చేరాయన్నారు. అంటే ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు లక్షా డబ్భై వేల కోట్ల రూపాయల మేరకే ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. కానీ టిడిపి నేతలు మాత్రం జగన్ మోహన్ రెడ్డి  పదిలక్షల కోట్లకు పైగా అప్పులు చేసేసి రాష్ట్రాన్ని దివాళా తీయించేశారని గగ్గోలు పెడుతున్నారు. చిత్రంగా బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా అదే పదిలక్షల కోట్ల రూపాయల వాదన తెరపైకి తీసుకురావడం  పై విమర్శలు చెలరేగుతున్నాయి.

అటు టిడిపి నేతలు..ఇటు బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి కలిసి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చేసిన ఒకే రకమైన ఆరోపణను  కేంద్ర ప్రభుత్వమే ఖండించడంతో పురంధేశ్వరికి షాక్ తగిలినట్లయ్యిందంటున్నారు రాజకీయ పండితులు. తాను లేవనెత్తిన ప్రశ్నలో పస లేదని తమ పార్టీ ప్రభుత్వమే తేల్చి చెప్పడంతో  ఏంచేయాలో పాలుపోక పురంధేశ్వరి దూకుడు తగ్గించారని అంటున్నారు. అయితే అసలు పది లక్షల కోట్ల అప్పు అన్న లెక్క ఆమెకు ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్న వస్తోంది. టిడిపి నేతలు, వారి అనుకూల మీడియా చేసే ఆరోపణనే ఆమె అంది పుచ్చుకున్నట్లు కనపడుతోంది. అందులో నిజా నిజాలు తెలుసుకోకుండా ఆమె  అవే ఆరోపణ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి  కనుసన్నల్లో పనిచేసే కొందరు నేతలు బిజెపిలో ఇప్పటికే ఉన్నారు. వారితో పాటు పురంధేశ్వరి కూడా చంద్రబాబు నాయుడి అజెండాను అంది పుచ్చుకుంటున్నారా ఏంటి? అని ఏపీ బిజెపి నేతల్లోనే గుస గుసలు వినపడుతున్నాయి. చంద్రబాబు నాయుడి ప్రయోజనాలకు అనుగుణంగా ఆమె నడుచుకుంటున్నారా లేక బిజెపి జాతీయ నాయకత్వమే ఆమె చేత వైసీపీని టార్గెట్ చేయిస్తోందా ? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా ఏపీలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవలసిన పరిస్థితులు దాపురించాయన్న పురంధేశ్వరి దానికి ఏపీ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి , టిడిపిలతో పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన.దానికి బిజెపి జాతీయ నాయకత్వం ఒప్పుకోవడం లేదు. దాంతో బిజెపిలోని తనకు అనుకూల వర్గాల ద్వారా లాబీయింగ్ చేయించాలని చూస్తున్నారు చంద్రబాబు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసే అజెండాను కూడా అమలు చేయిస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే పురంధేశ్వరి  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై విమర్శల దాడి పెంచారా అని  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పండితులు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి